శీతాకాలం వచ్చిందంటే చాలా ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే కనిపిస్తారు. సుమారు 45 రోజుల పాటు నిష్టతో స్వామి వారిని కొలిచి.. సంక్రాంతి రోజు మకర జ్యోతిని చూసి మాల తీస్తారు. అయ్యప్ప మాల వేసిన చాలా మంది స్వాములు కేరళలోని శబరిమలకు వెళ్లి మణికంఠుడిని దర్శించుకుంటారు. ముడుపులు చెల్లించుకుంటారు. కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు. మాల తీసి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే, శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం గోదావరి తీరంలో అద్భుతమైన అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. రాజమండ్రిలో కొలువైన ఈ ఆలయం అచ్చం శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్నిచూసినట్టే ఉంటుంది. అక్కడి లాగే పూజలు, ధూప దీప, నైవేద్యాలతో శోభాయమానంగా ఉంటుంది.
ఈ అయ్యప్ప దేవాలయం మార్చి 20, 2011న భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆధ్యాత్మికత, విశ్వాసం, భక్తికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. కోటప్పకొండ నుంచి శిలలను తీసుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. పంచలోహాలతో కూడిన అయ్యప్ప స్వామి మూల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక ఈ ఆలయంలో శబరిమలలో మాదిరిగానే అనేక ఇతర దేవతల విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, మాలికాపుర అమ్మవారు, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ విగ్రహాలను ఏర్పాటయ్యాయి. భక్తులు అయ్యప్ప స్వామితో పాటు వీరికి కూడా పూజలు చేస్తారు.
Read Also: తెలంగాణలో కంచి ఆలయం.. తప్పకుండా ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలు, ధూపదీప నైవేద్యాలు భక్తులను శబరిమలలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే ఈ ఆలయం నిత్యం మణికంఠుడి నామంతో మార్మోగుతుంది. అయ్యప్ప మాలధారులు, భక్తులతో నిత్యం సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యాన్నదానం కూడా నిర్వహిస్తారు. శబరిమల వెళ్లలేని భక్తులు ఇక్కడే పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధరించే భక్తులు సాధారణంగా శబరిమలలో ఇరుముడి సమర్పించి మాలధారన తొలగిస్తారు. అక్కడి లాగే ఇక్కడ కూడా భక్తులు తమ ఇరుముడిని సమర్పిస్తారు.
గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఈ అయ్యప్ప ఆలయం రాజమండ్రిలో ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ దివ్య స్థలాన్ని సందర్శించి ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రికి వెళ్తే, ఈ అయ్యప్ప ఆలయాన్ని తప్పకుండా దర్శించండి! స్వామివారి ఆశీస్సులు పొందండి!
Read Also: అనుకోకుండా తిరుమలకు వెళ్లారా? ఇలా ట్రై చేస్తే కచ్చితంగా రూమ్ దొరుకుతుంది!