Holi 2026: హిందూ పండగల్లో చాలామందికి ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైనా ఉందటే అది హోలీ. అందుకే దేశవ్యాప్తంగా హోలీని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి 2026లో హోలీ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3వ తేదీనా లేక 4వ తేదీనా? అనే చిన్న కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ డౌట్ క్లియర్ చేసుకుంటూనే, ఈ పండుగ విశేషాలను కూడా ఒకసారి తెలుసుకుందాం రండి.
మన హిందూ పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజే హోలీ జరుపుకుంటాం. 2026లో మార్చి 3వ తేదీ, మంగళవారం నాడు పౌర్ణమి తిథి వస్తోంది. కాబట్టి.. ఆ రోజు సాయంత్రం ‘హోలికా దహనం’ చేసుకుంటాం. దీనినే చాలామంది చిన్న హోలీ అని కూడా అంటారు. ఇక మనందరం ఎంతో ఆశగా ఎదురుచూసే ఆ అసలైన రంగుల కేళి ‘ధులెండి’ లేదా పెద్ద హోలీ మాత్రం మార్చి 4వ తేదీ, బుధవారం నాడు ఉంది. కాబట్టి.. మీ ప్లాన్స్ అన్నీ మార్చి 4కి ఫిక్స్ చేసేసుకుంటే సరి.
Also Read: ఈ సమయాల్లో ఏసీ వేయొద్దు.. అలా చేస్తే ఈ రెండు నష్టాలు తప్పవు!
సాధారణంగా చెడు మీద మంచి గెలిచిన సందర్భాన్ని మనం పండుగలా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం.. హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని చంపాలని చూసినప్పుడు, విష్ణుమూర్తి ఆ బాలుడిని కాపాడతాడు. మంటల్లో పడినా ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు కానీ, మంటల్లో కాలిపోదని వరం ఉన్న హోలిక మాత్రం భస్మమైపోతుంది. అందుకే సమాజంలో ఉన్న చెడును తగలబెట్టి, కొత్త ఉత్సాహంతో జీవితాన్ని మొదలుపెట్టాలని హోలికా దహనం చేస్తాం. ఆ మరుసటి రోజున మనసులో ఉన్న పాత గొడవలు, భేదభావాలను మరిచిపోయి అందరూ రంగులు పూసుకుని ఆనందాన్ని పంచుకుంటారు.
పండుగ అంటే కేవలం రంగులే కాదు కదా.. మన ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇప్పుడు మార్కెట్లో దొరికే రసాయన రంగుల వల్ల చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే వీలైనంత వరకు సహజసిద్ధమైన రంగులు వాడటానికి ట్రై చేయండి. ఇంట్లోనే పసుపు, గోరింటాకు లాంటి వాటితో రంగులు తయారు చేసుకుంటే ఎలాంటి స్కిన్ ఎలర్జీలు రావు. అలాగే ఈసారి కూడా నీటిని అనవసరంగా వృధా చేయకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకుందాం.
Also Read: హోలీకి ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదా? సెలబ్రెటీల్లా మెరిసిపోయే బెస్ట్ అవుట్‌ఫిట్ ఐడియాస్ ఇవే!