Nag Panchami 2024: శివుడి మెడలో అలంకారంగా ఉండే పాముకు చాలా ప్రత్యేక ఉంటుంది. నాగ దేవత మహిమ గల్లదని, భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలను తీరుస్తుందని భక్తులు నమ్ముతుంటారు. సాధారణంగా గుడికి వెళ్లిన ప్రతీ సారి నాగదేవతకు పూజలు చేస్తుంటారు. కానీ ప్రతీ ఏటా రెండు సార్లు మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నాగుల పంచమి, నాగుల చవితి నాడు భక్తులు నాగమ్మను పూజిస్తే సర్ప దోశ నివారణ కలుగుతుందని, కోరుకున్న కోరికలు తీరుతాయని, సంతాన ప్రాప్తి కూడా లభిస్తుందని భావిస్తుంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి పండుగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన జరుపుకోనున్నారు. ఈ మేరకు పంచమి తిథి ఉదయం 8.15 గంటలకు ప్రారంభమై తిరిగి 10వ తేదీన ఉదయం 6.09 గంటలకు ముగుస్తుంది.
జాతకంలో పితృదోషం, కాలసర్ప దోషంతో బాధపడుతున్న వారు నాగ పంచమి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే దోషాల నుంచి విముక్తి లభిస్తుందట. శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసంగా హిందూ గ్రంధాలలో పరిగణించబడింది. శ్రావణ మాసంలో వచ్చే పండుగలను నారద పురాణం, స్కంద పురాణం, మహాభారతం వంటి వాటిలో మహా దేవుడితో పాటు పామును కూడా పూజిస్తారని పేర్కొనబడింది. అయితే ఈ ఏడాది వచ్చే నాగపంచమి నాడు కొన్ని చర్యలు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జాతకంలో పాము కారణంగా ఉండే దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది.
నాగ పంచమి రోజున పితృదోష నివారణకు చేయాల్సిన పరిహారాలు
* జాతకంలో కాల సర్ప దోషం, పితృదోషంతో బాధపడేవారు నాగ పంచమి నాడు శ్రీ సర్ప సూక్తాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇది మహా శక్తివంతమైన మంత్రంగా హిందూ పురాణాల్లో పరిగణించబడుతుంది.
* పంచమి రోజు శ్రీమద్ భగవద్ పురాణం, శ్రీ హరివంశ పురాణాన్ని పఠించడం వల్ల పితృదోషం నుంచి విముక్తి పొందుతారు.
* పూజా అనంతరం శివునికి చందనం సమర్పించి దానిని నుదుటిపై తిలకంగా దిద్దుకోవాలి. ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి దేవుడికి భక్తి, శ్రద్ధలతో పూజిస్తే పితృ దోషం తొలగిపోతుంది.
* ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడ, లేదా మట్టితో సర్ప ఆకారాన్ని తయారు చేసి పూజించడం వల్ల కూడా పితృదోషం తొలగిపోయి ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
* పంచమి రోజున శివాలయానికి వెళ్లి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయడం వల్ల ఆర్థికంగా మంచి రోజులు వస్తాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)