Mental Health: శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అనేక సందర్భాల్లో.. మనం మానసిక సమస్యలను గుర్తించడంలో ఫెయిల్ అవుతుంటాం. లేదా వాటిని తేలికగా తీసుకుంటాం. అయితే.. మనస్సు సరిగా లేదని సూచించే కొన్ని సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇదిలా ఉంటే మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపే 5 ముఖ్య సంకేతాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్ర, ఆకలిలో తీవ్ర మార్పులు:
మానసిక సమస్యలకు.. ముఖ్యంగా ఒత్తిడి లేదా నిరాశకు నిద్ర, ఆకలిలో వచ్చే మార్పులు బలమైన సూచనలు.
నిద్ర: నిద్ర పట్టకపోవడం (నిద్రలేమి), లేదా రోజంతా అతిగా నిద్రపోవాలనిపించడం, రాత్రుళ్లు పదేపదే మెలకువ రావడం.
ఆకలి: ఆకలి పూర్తిగా తగ్గిపోవడం (కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం) లేదా విపరీతంగా పెరగడం (ఎక్కువగా తినడం). దీనివల్ల బరువు ఆకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
2. రోజువారీ ఆసక్తి తగ్గిపోవడం, ఉదాసీనత :
ఒకప్పుడు ఎంతో ఇష్టపడి చేసిన పనుల పట్ల లేదా సరదాల పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతే.. అది నిరాశకు సంకేతం కావచ్చు.
ఉదాసీనత: ఏ విషయం పట్ల ఉత్సాహం లేకపోవడం, ఎల్లప్పుడూ నిస్సత్తువగా ఉండటం.
సామర్థ్యం తగ్గడం: ఉద్యోగంలో లేదా చదువులో దృష్టి పెట్టలేకపోవడం.. చిన్న పనులను కూడా పూర్తి చేయడంలో ఇబ్బంది పడటం.
3. తీవ్ర భావోద్వేగ మార్పులు:
ఒక వ్యక్తి ప్రవర్తనలో తరచుగా , తీవ్రమైన భావోద్వేగాల మార్పులు వస్తే.. అది మానసిక అనారోగ్యాన్ని సూచిస్తుంది.
కోపం/చికాకు: చిన్న విషయాలకే విపరీతమైన కోపం లేదా చిరాకు రావడం.
నిరాశ/దుఃఖం: కొద్దిసేపటి క్రితం సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఏడ్వడం లేదా తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోవడం. ఈ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం.
4. సామాజిక దూరం:
మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు చాలా మంది ఇతరుల నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తారు.
ఒంటరిగా ఉండటం: స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి నిరాకరించడం. ఇతరులతో మాట్లాడటానికి ఇష్ట పడకపోవడం.
సంబంధాల ప్రభావం: తమ సన్నిహిత సంబంధాలలో (భార్యాభర్తలు, తల్లిదండ్రులు, స్నేహితులు) మార్పులు రావడం లేదా గొడవలు పెరగడం.
Also Read: ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. కోలన్ క్యాన్సర్ కావచ్చు !
5. విపరీతమైన భయాలు, శారీరక నొప్పులు:
మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు.. దాని ప్రభావం శారీరక లక్షణాల రూపంలో కూడా బయట పడుతుంది.
భయాలు: విపరీతమైన ఆందోళన లేదా భయపడటం, ప్రతి చిన్న విషయం గురించి అతిగా ఆలోచించడం. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా చెమటలు పట్టడం వంటి భయాందోళన దాడులు .
శారీరక లక్షణాలు: డాక్టర్‌కి చూపించినా తగ్గని తలనొప్పి, కడుపు నొప్పి లేదా కండరాల నొప్పులు ఎక్కువగా ఉండటం.