పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు భీమవరం డిఎస్పి జయ సూర్య పనితీరుపై క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా మాట్లాడటం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఓవైపు డీఎస్పీపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీని డిప్యూటీ సీఎం ఆదేశించిన తర్వాత రఘురామకృష్ణంరాజు ఈ తరహా కామెంట్స్ చేయడం చర్చినీయంశంగా మారింది.
భీమవరం డీఎస్పీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీన్‌లోకి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రావడంతో గోదావరి జిల్లాలో కొత్త రాజకీయం మొదలైందా అనే చర్చ నడుస్తోందట. సాధారణంగా గోదావరి జిల్లాలలో పందేలు జూదాలు అన్నవి కామన్ గా జరిగిపోతుంటాయి. అయితే అవి శృతి మించి మరీ సాగడం, ఆ మీదట వివాదాలు గొడవలు ఇలా లా అండ్ ఆర్డర్ కే ఇబ్బందిగా మారుతున్నాయనేది నడుస్తున్న చర్చ. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి భీమవరం పరిసర ప్రాంతాలలో పేకాట జూదాల గురించి ఫిర్యాదులు రావడంతో నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన ఈ విషయం మీద పోలీసు అధికారులనే నివేదికను కోరారు దాంతో ఇపుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి డిఎస్పీ జయ సూర్య చేసిన అక్రమాలు, అవినీతి వెళ్లడంతోనే ఆయన నేరుగా జిల్లా ఎస్పీతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంపై రఘురామ కృష్ణంరాజుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటో తెలపాలని కూడా జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు భీమవరం డిఎస్పి జయ సూర్యకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడటం ఏమిటనే చర్చ నడుస్తోందట. డీఎస్పీపై ఇంకా నివేదిక ప్రభుత్వానికి చేరకుండానే రఘురామకృష్ణంరాజు డిఎస్పీకి మద్దతుగా మాట్లాడటంపై కూడా జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
ఆర్ఆర్ఆర్ మాటలను బట్టి చూస్తే డీఎస్పీ జయ సూర్య నివేదికలో కూడా రఘురామ కృష్ణంరాజు కల్పించుకుంటున్నారనే ఆరోపణలను జనసైనికులు చేస్తున్నారట. ఒక పార్టీ అధినేత అయి ఉండి, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పని చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా డిఎస్పీ జయ సూర్య పై ఎస్పీతో మాట్లాడారా అని జన సైనికులు రఘురామకృష్ణంరాజును ప్రశ్నిస్తున్నారు. ఒక పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి నేరుగా పేకాట క్లబ్లపై స్పందించినప్పుడు తగుదునమ్మా అని రఘురామకృష్ణంరాజు ఎందుకు స్పందించాల్సి వచ్చిందని, నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తే బాగుండేదని జనసైనికులు చెబుతున్నారట.
రఘురామకృష్ణంరాజు డీఎస్పీకి క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా రాజకీయం చర్చకు దారితీస్తున్నాయట. పవన్ కల్యాణ్ ఆయన శాఖతో పాటు మిగిలిన శాఖలుపై కూడా సమకాలీన దృష్టి పెట్టడం సంతోషకరమని. ఆర్ఆర్ఆర్ దీనిపై మాట్లాడం గురించి జనసేన నేతలు కొంత అసహనానికి గురవుతున్నారట. పవన్ కళ్యాణ్ అన్ని శాఖలపై అవగాహన కల్పించుకోవడం సంతోషకరమని వెటకార ధోరణిలో ట్రిపుల్ ఆర్ మాట్లాడారని జన సైనికులు మండిపడుతున్నారట. గతంలో ఇటీవల కాలంలో భీమవరంలో ఉన్న కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలించే విధంగా కూడా రఘురామ కృష్ణంరాజు ప్రయత్నాలు చేసి భీమవరం ఎమ్మెల్యే, పి ఎస్ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులను అవమానపరిచే విధంగా వ్యవహరించారని కూడా జన సైనికులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు పెత్తనం చేసే విధంగా ఆయన వైఖరి ఉందని విమర్శిస్తున్నారు.
వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా రఘురామకృష్ణంరాజు వ్యవహారించిన తీరును జనసైనికులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారట. నర్సాపురం ఎంపీగా గెలిచి ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో ఇదేవిధంగా వ్యవహరించారాని…ప్రతి అంశంలో జోక్యం చేసుకున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారట. ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్న పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా ఆయన మాట్లాడం పొలిటికల్ సర్కిల్స్ పెద్ద చర్చ నడుస్తోంది.
Story by Chandram, Big Tv