జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎట్టిపరిస్ధితుల్లో బైపోల్‌లో విజయం సాధించక తప్పని పరిస్ధితి మూడు ప్రధాన పార్టీలది. ఈ గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారబోతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయట.
జూబ్లీహిల్స్ నామినేషన్ల పర్వం ముగయడంతో ప్రచారంపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్ధ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ఆయా పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే మూడు పార్టీలు.. అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించేశాయి. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు మూడు పార్టీలు యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాయట
అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానంలో గెలవడం ద్వారా స్ట్రాంగ్ మేసేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తోంది. కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరీక్షగా మారడంతో.. పార్టీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్ వెంకటస్వామిలకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
మంత్రులకు సహకారం అందించేందుకు డివిజన్ల వారీగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా ఇంటింటి ప్రచారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేసేలా పీసీసీ వ్యూహారచరన చేస్తుందట. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. గ్రేటర్‌లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది.
బీఆర్‌ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పని చేస్తుంది. గ్రేటర్ పీఠాన్ని కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్. బీఆర్‌ఎస్ వెల్లడించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు సభలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్.. ప్రచార పర్వాన్ని కూడా అదేరీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా నాయకులకి బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారట.
లేటుగా అయినా లేటెస్ట్ అంటూ..బీజేపీ కూడా తగ్గేదేలే అంటుంది. బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటే…మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక తమకు వస్తాయని భావనలో బీజేపీ ఉందట. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకోవడం బీజేపీ అవకాశంగా భావిస్తుందట. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ భావిస్తోంది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జుబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులకు పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రచారానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనే అవకాశం ఉందని కాషాయ దళం చెబుతున్న పరిస్ధితి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్‌లోనే మోహరించడంతో..నియోజకవర్గంలో సందడి నెలకొంది. రసవత్తరంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారంలో మూడు పార్టీలు ఎలా ముందుకు వెళ్లబోతున్నాయనేది వేచి చూడాలి.
Story by Ajay Kumar, Big Tv