Big Stories

Sri Rama Navami: రాముడు మనకు చెబుతున్నదేమిటి?

Sri Rama Navami 2024: యుగయుగాలుగా భారతీయుల జీవితాల్లో భాగమైన అపురూప దృశ్యకావ్యం రామాయణం. ఇందులో కథానాయకుడైన శ్రీరాముడు కుమారుడిగా, భర్తగా, సోదరుడిగా, మిత్రుడిగి, తండ్రిగా, పాలకుడిగా అడుగడుగునా తన ఆదర్శ ప్రవర్తనతో జాతి మనోఫలకంపై వేసిన ముద్ర అనన్యసామాన్యం. సామాన్య మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు రాముడు తన జీవితం ద్వారా పరిష్కారాలను సూచించిన తీరు నేటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. హక్కుల కంటే బాధ్యతలు మిన్నగా తలచిన రాముడి పాత్ర దైవంగా కంటే గొప్ప మార్గదర్శిగా ఆధునిక మానవ సమాజానానికి దిశానిర్దేశం చేస్తోంది.

- Advertisement -

నర, నారాయణ తత్వాలకు ప్రతీక అయిన రాముడు.. భారతీయ కుటుంబ విలువలకు, అనుబంధాలకు గొప్ప ఉదాహరణ. పితృవాక్య పరిపాలన, సత్యమార్గంలో నడవటం, ఏకపత్నీ వ్రతాన్ని పాటించటం, సోదరుల పట్ల, అనుచరుల పట్ల వాత్సల్యం చూపటం, ఆదర్శ పాలన చేసి జనం మనసు గెలవటం మనకు రాముడిగా కనిపిస్తాయి. శ్రీరాముడు సాక్షాత్తూ విష్ణు స్వరూపమే అయినా, ఏనాడూ తనకున్న దైవశక్తిని వాడలేదు. ప్రదర్శించలేదు. కేవలం తన భుజ బలాన్ని, మేధస్సును, ధర్మమార్గాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. శ్రద్ధగల శిష్యుడిగా తన గురువులను గౌరవించాడు.

- Advertisement -

అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ధర్మాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలిచాడు. చక్రవర్తి కుమారుడైనా వనవాస కాలంలో సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో వనచరుడిగా జీవించాడు. ఆ సమయంలో ప్రకృతి ప్రసాదించిన అక్కడి వనరులతోనే సర్దుకుపోయాడు. ప్రకృతికి దగ్గరగా, దానితో మమేకమై జీవించటం ఎలాగో రాముడి పాత్ర మనకు సూచిస్తోంది. పట్టాభిషేకం తర్వాత కూడా తన రాజ్యంలో ప్రకృతి రమణీయతకు పెద్దపీట వేయటం మన సంస్కృతిలో భాగమైన ప్రకృతిని కాపాడుకోవాలని మనకు చెప్పకనే చెబుతోంది.

మనం పొందిన సాయానికి కృతజ్ఞతలు చెప్పటం మనిషికి ఉన్న అలవాటే. కానీ, రాముడికి సీతమ్మ ఆనవాలు చెప్పిన జటాయు పక్షి పట్ల కూడా రాముడు అంతే కృతజ్ఞతగా వ్యవహరించాడు. సీత జాడ చెప్పి కన్నుమూసిన జటాయువుకు స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించటం, లంకకు వారధి కట్టేవేళ తన ఒంటిపై ఇసుకను మోసిన ఉడుతను రాముడు ఆప్యాయంగా నిమిరటం ద్వారా రాముడి హృదయ వైశాల్యం ఎంతటితో మనకు అర్థమవుతుంది. బాలుడిగా ఉన్న సమయంలో గురువు విశ్వామిత్రుడి వెంట అడవికి వెళ్లి రాక్షస సంహారానికి పూనుకుని తన క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చాడు. గురువుతో శిష్యుడు ఎలా ఉండాలనేది బోధపడుతుంది.

తండ్రిమాటను జవదాటని వాడు రాముడు. పుత్రధర్మాన్ని పాటించాడు. తన మూలంగా కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని తలచి వనవాసానికి తరలిపోయాడు. ఐదారుగురు కూడా కలిసి ఉండలేక విడిపోతున్న నేటి ఆధునిక తరానికి కుటుంబ వ్యవస్థ పట్ల రాముడికి ఉన్న నమ్మకం లేకపోవటం దురదృష్టకరం. అలాగే, పెద్దన్నగా తన తమ్ముల పట్ల ఆయన చూపిన అనురాగం, సోదరులు కూడా అన్నపై చూపిన గౌరవాన్ని మనమూ అలవరచుకోవాల్సిన అవసరముంది.

సుగ్రీవుడితో రాముడి స్నేహం మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. క్షత్రియుడు, చక్రవర్తి కుమారుడైన రాముడు, వానరులకు రాజైన సుగ్రీవుడినీ అంతే గౌరవించాడు. వాలి, సుగ్రీవుల మధ్య వివాదంలో ధర్మం సుగ్రీవుని పక్షాన ఉండటంతో మహావీరుడైన వాలికి వ్యతిరేకంగా వ్యవహరించి, తిరిగి సుగ్రీవుడిని రాజును చేశాడు. తాత్కాలిక అవసరాల కోసం సొంత సోదరులనే వదిలిపెడుతున్న ఈ రోజుల్లో రాముడు ఆచరించిన ఈ మార్గం మనకు అనుసరణీయం.

మాతృభూమిపై రాముడికి ఉన్న ప్రేమను చెప్పేందుకు మాటలే దొరకవేమో. రావణాసురుడిని చంపిన తర్వాత లంకా వైభవాన్ని చూసిన లక్ష్మణుడు ‘ఈ బంగారు లంకలోనే ఉండిపోదాం’ అనగా, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’(కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి) అంటాడు రాముడు. వృత్తి నిమిత్తం మనం దేశవిదేశాలకు వెళ్లి స్థిరపడినా, మనం పుట్టిన నేలను మరవొద్దనే సందేశాన్ని రాముడు మనకు ఇస్తున్నాడు.

తనను మోహించిన శూర్పణఖకు తాను వివాహితుడని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు రాముడు. ఇందులో మానవుడికి శీల సంస్కారం, వ్యక్తిత్వం ముఖ్యమనే సందేశం ఉంది. ఆదర్శ దంపతులను పోల్చాల్సి వస్తే సీతారాముులు అనే మాట వాడటం మన సంప్రదాయం. చిన్నచిన్న కారణాలకే విడాకులు కావాలనే ఆధునిక యువత నాటి సీతారాముల అన్యోన్య దాంపత్యం గురించి తెలుసుకుంటే వారి జీవితాలు ఆనందమయం అవుతాయి. కులమత వివక్ష చూపని పాలకుడు రాముడు.

వనవాసానికి వెళ్లినప్పుడు ఆయనను గంగ దాటించిన బోయవాడైన గుహుడిని, సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు ఎదురైన వానరుడైన హనుమను ఆప్యాయంగా హత్తుకుని తన వాత్సల్యాన్ని వారిపై కురిపించాడు రాముడు. తన రాకకై ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూసిన ఆదివాసీ మహిళ శబరి పెట్టిన ఎంగిలిని ఎంతో ఇష్టంగా తిని తనకు వర్ణభేదం లేదని నిరూపించాడు. కుల, మత, వర్ణ, ప్రాంత, భాషా వివక్షలు ప్రదర్శిస్తున్న నేటి పాలకులకు రాముడు పథగామి.

Also Read: రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి.. నేడు ఎదుర్కోలు ఉత్సవం

రాముడి సుపరిపాలన దేశవ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేసింది. మనకు రామరాజ్యం ఆదర్శమని జాతిపిత బాపూజీ తరచూ అనేవారు. ప్రజల కష్టాలను పట్టించుకోవటమే పాలకుల ఏకైక లక్ష్యమని రాముడు మనకు సూచిస్తున్నాడు. ఇన్ని సుగుణాలున్నాయి గనుకే రామకథ.. పరిశీలకులకు నేటికీ నిత్యనూతనంగా కనిపిస్తోంది. దేశంలోని కోట్లాదిమంది నోట వినిపిస్తోంది. కనుక రామాయణాన్ని పురాణంగా, రాముడిని దేవుడిగా కాకుండా రాముడిని ఒక ఆదర్శ మానవుడిగా, రాముడు నడిచిన దారిని ఒక ఉత్తమ ఆచరణగా మనం స్వీకరించగలిగితేనే మనం రాముడి వారసులుగా నిలవగలుగుతాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News