Tirumala Darshan: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తాయి. నిత్యం 70 నుంచి 80 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. రద్దీ సమయాల్లో భక్తులు క్యూ లైన్లలో గంటల కొద్ది వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంటి పిల్లలతో తిరుమలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి దర్శనం విషయంలో ప్రాధాన్యత ఇస్తోంది. ఏడాదిలోపు పిల్లలతో పాటు వారి పేరెంట్స్ ఉచిత దర్శన అవకాశం కల్పిస్తోంది. అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యం అందిస్తోంది. టీటీడీ అందిస్తున్న ఈ సేవ ద్వారా ఏడాది లోపు పిల్లలతో తల్లిదండ్రులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా దర్శనానికి పంపిస్తారు. చిన్న పిల్లల ఉచిత దర్శనానికి సంబంధించి నియమ, నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చంటి పిల్లల ఉచిత దర్శనానికి కావాల్సిన పత్రాలు
టీటీడీ ఏడాది లోపు పిల్లల ఉచిత దర్శనానికి సంబంధించి కచ్చితంగా ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే, ఆస్పత్రి జారీ చేసే డిశ్చార్జ్ సమ్మరీని చూపించవచ్చు. చంటి పిల్లల తల్లిదండ్రులు గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు లేదంటే పాన్ కార్డులో ఏదో ఒకటి చూపించవచ్చు. చిన్న పిల్లలకు ఉచిత దర్శనం అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. చిన్న పిల్ల తల్లిదండ్రులు ఆలయం పక్కనే ఉన్న సుపథం ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్లాలి. అక్కడ చిన్న పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రులు ఐడీ ప్రూఫ్స్ ను ఆలయ సిబ్బంది పరిశీలించి అనంతరం దర్శనానికి అనుమతిస్తారు.
ఎంత మంది దర్శనం చేసుకోవచ్చు అంటే?
ఇక ఈ ఉచిత దర్శనానికి ఏడాదిలోపు చిన్నారి తల్లిదండ్రులతో పాటు 12లోపు మరో పాప లేదంటే బాబును అనుమతిస్తారు. ఇతర కుటుంబ సభ్యులు ఎవరినీ అనుమతించరు. ఈ ఉచిత దర్శనం కోసం ముందుగా ఎలాంటి బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరి లాగే ఈ ఉచిత దర్శానానికి వెళ్లే తల్లిదండ్రులు, పిల్లలు టీటీడీ సూచించినట్లుగా సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాల్సి ఉంటుంది.
చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఉపశమనం
తిరుపతి తిరుమల దేవస్థానం కల్పించే ఉచిత దర్శనం వల్ల చంటి పిల్లల తల్లిదండ్రులకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంచే ఇబ్బంది తప్పుతుంది. గంటలోపూ దర్శనం చేసుకునే అవకాశం ఉండటంతో పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది పడరు. చిన్న పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి కూడా ఉచిత దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు. సో, ఇకపై మీరు కూడా చిన్న పిల్లలతో తిరుమలకు వెళ్లినప్పుడు ఈ సేవను ఉపయోగించుకోండి. పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్లడం మాత్రం మర్చిపోకండి.
Read Also: ఇంట్లో నుంచే ఆలయాల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా?