Shravana Masam: శ్రావణ మాసం… భక్తి, నమ్మకాలకు ప్రతీక. ఈ పవిత్ర మాసంలో మన ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక సాధనకీ ముఖ్యమైన మార్గం సాత్విక జీవనం. అలాంటిది మాంసాహారం తినకూడదని పెద్దలు అంటుంటే, దానికి గల కారణం సాధారణమైనది కాదు… ఆధ్మాత్మికతకు ముడిపడి ఉంది.
శ్రావణం అంటే శివునికి అర్పణ చేసే కాలం. ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు చేస్తారు, శివాలయాలను సందర్శిస్తారు, శుద్ధమైన ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే ఈ కాలంలో మన ఆహారం, మన ఆలోచనలు, మన శరీరం అన్నీ సాత్వికతతో నిండాలి. మాంసాహారం తినడం వల్ల మనలో క్రూరత, అధర్మ భావనలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారం కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రభావం చూపుతుంది. మాంసాహారం తీసుకున్నప్పుడు మనలో తమోగుణం ఎక్కువవుతుంది – అంటే ఆలోచనలు మందగిస్తాయి, రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది, మానసిక స్థితి అస్థిరంగా మారుతుంది.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం – శ్రావణ మాసం వర్షాకాలంలోకి వస్తుంది. ఈ సీజన్‌లో పగుళ్లతో, తేమతో బాక్టీరియా పెరుగుతుంది. ఈ సమయంలో మాంసాహార పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పోయిజనింగ్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. కనుక శాస్త్రీయంగా కూడా ఇది మానేయాలనే సూచన ఉంది. పైగా, శివుడు సర్వభూతహితుడు. జీవహింసకు వ్యతిరేకంగా ఉండే దేవుడు. అలాంటి ఆయన్ను పూజించే మాసంలో ప్రాణహింస కలిగించే ఆహారం తినడం భక్తి ధర్మానికి వ్యతిరేకం.
పురాణాల్లో చెప్పినట్లు, ఈ మాసంలో దేవతలు భూమిపై విహరిస్తారట. అటువంటి కాలంలో మనం తీసుకునే ప్రతి చర్య శుభంగా ఉండాలి. భక్తితో చేసే ఉపవాసాలు, సాత్వికాహారం, సేవా కార్యక్రమాలన్నీ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడతాయి. పైగా, ఇది పిల్లలకు, యువతకు మన సంప్రదాయాలను బోధించడానికి ఒక ఉత్తమ కాలం. ఈ సందర్భంగా వారిలో సానుకూల జీవిత శైలి అలవాటు పరచొచ్చు.
ఇంకో కోణం కూడా ఉంది. శ్రావణ మాసం ఉపవాసం, నియమాల కాలం. అలాంటి ఉపవాస వ్రతాల మధ్య మాంసాహారం తినడం వల్ల శరీరానికి బరువు పెరిగే ఆహారం అందుతుంది. ఇది జీర్ణానికి భారం కలిగిస్తుంది. అలసట, నీరసతలుకి దారితీస్తుంది. అందుకే ఉపవాసం రోజుల్లో మాంసాహారాన్ని మానేయమని సూచించడమే కాదు, మొత్తం శ్రావణ మాసంలోనూ దూరంగా ఉండమంటారు.
ఈ కారణాలన్నింటినీ చూస్తే… మాంసాహారం మానడం అన్నది కేవలం ఒక నిబంధన కాదు. అది మన శరీరం, మనసు, ఆధ్యాత్మికత, సమాజం అన్నింటికీ హితమైన నిర్ణయం. శ్రావణ మాసం ఒక మార్గదర్శి కాలం. ఈ మాసాన్ని సాత్వికతతో గడిపితే… శివుని అనుగ్రహం మనపై కరుణగా కురుస్తుంది.