Story of Abhimanyudu : శత్రువులను చెండాడే ధీరుడు.. వీరాధివీరులను సైతం మట్టికరిపించిన యోధుడు.. మహభారత యుధ్దంలో అతిరధుడు..అభిమన్యుడు మహాభారతంలో ఎంతోమంది యోధులు ఉన్నా.. 16 ఏళ్ల వయస్సులోనే హీరోగా గుర్తింపు పొందింది ఒక్క అభిమన్యుడు మాత్రమే. మనం “పద్మవ్యూహం” అనే పదం విన్నప్పుడు.. మనకు టక్కున గుర్తొచ్చే పేరు.. అభిమన్యుడు. ఆది పర్వంలోని సంభవ పర్వంలో అభిమన్యుని పుట్టుక, అతని అకాల మరణం వెనుక ఉన్న కారణం గురించి ఉంది.
ఒకసారి స్వర్గలోకంలో దేవతలు సమావేశమౌతారు. భూమిమీద పాపాలు పెరిగిపోయాయని, దుష్టులను శిక్షించడానికి విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తున్నాడని.. మన దేవతలు కూడా తమ అంశలతో మానవులుగా అవతరించి మహభారత యుధ్దంలో పాల్గోని దుర్మార్గులను శిక్షిస్తారని చెప్పుకుంటుంటారు. అప్పుడు చంద్రదేవుడైన సోముని కుమారుడు వర్చస్సును కూడా భూలోకంలో అభిమన్యునిగా జన్మించమని ఇంద్రుడు కోరతాడు. తన కొడుకుని చూడకుండా ఉండలేని చంద్రుడైన సోముడు.. తన కొడుకు అభిమన్యుడిగా పదహారేళ్లు మాత్రమే భూలోకంలో జీవిస్తాడని.. తర్వాత చనిపోయి వర్చస్సుగా తిరిగి తన వద్దకు వస్తాడనే షరతుపై ఒప్పుకుంటాడు. అలా..ఇతను పాండవ మధ్యముడు అయిన అర్జునుడికి, బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు అభిమన్యుడిగా జన్మిస్తాడు.
అర్జునుడు మొదట ఇతనికి అస్త్ర విద్యను బోధించాడు. ఒకసారి అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములోకి ఎలాప్రవేశించాలో వివరిస్తున్నపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటుంటాడు. అది గ్రహించిన కృష్ణుడు అర్జునుని వారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా అపేశాడు. ఆ కారణంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు తిరిగి పద్మవ్యూహంనుండి బయటకు రావడం ఎలాగో తెలుకోలేక పోయాడు. పాండవులు, శకుని చేతిలో జూదంలో తమ రాజ్యాన్ని ఓడిపోయి, దుర్యోధనుడి షరతు ప్రకారం 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కొరకు అడవులకు వెళ్లిపోతారు. అప్పుడు సుభద్ర, తన సోదరుల రాజ్యమైన ద్వారకలో ఉండి, అభిమన్యుడిని పెంచింది. అభిమన్యుడు తన మేనమామలు బలరాముడు, కృష్ణుడి నుండి.. అలాగే తన తల్లికి దగ్గర బంధువు అయిన ప్రద్యుమ్నుడి నుండి యధ్ద విద్యను నేర్చుకుంటాడు. అనేక అస్త్రశస్తాలను ప్రయోగించడం తెలుసుకుని గొప్ప యోధునిగా తయారవుతాడు. అజ్ఞాతవాసంలో ఉన్న తన తండ్రి అర్జునుడిని చూడటానికి విరాట రాజ్యానికి అభిమన్యుడు వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. చివరకి పెద్దల సహకారంతో అభిమన్యుడు, ఉత్తరల వివాహము జరుగుతుంది.. వీరికి జన్మించిన వాడే పరిక్షిత్తు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులకు మిగిలిన ఏకైక వారసుడు.
Also Read : మేష రాశి వారిపై శని సాడే సతి ప్రభావం.. తస్మాత్ జాగ్రత్త !
అయితే మహాభారతం ఉత్తరను, అభిమన్యుని ఏకైక భార్యగా పేర్కొనగా, తెలుగు జానపద సినిమా శశిరేఖా పరిణయం ప్రకారం, అభిమన్యుడు ఉత్తరను వివాహం చేసుకునే ముందు, తన మామ బలరాముడి కుమార్తె శశిరేఖను (ఈమెను వత్సల అని కూడా పిలుస్తారు) వివాహం చేసుకున్నాడు. ఈ కథ ప్రకారం.. అభిమన్యుడు ద్వారకలో ఉంటూ శశిరేఖతో ప్రేమలో పడ్డాడు. అయితే బలరాముడు దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడికి శశిరేఖను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. శశిరేఖకి సాయం చేయాలనుకున్న భీముడి కొడుకు ఘటోత్కచుడు, శశిరేఖ వేషం వేసుకుని లక్ష్మణుడి చేయి విరగ్గొడతాడు. కథలో అనేక మలుపుల తర్వాత కృష్ణుడి సహకారంతో అభిమన్యుడు, శశిరేఖలు అడవిలో పెళ్లి చేసుకుంటారు. అయితే ఇది కేవలం సినిమా వాళ్ల కల్పిత కథ.. మహాభారతంలో ఇలాంటి కథ ఏమీ లేదు.
పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చాక, దుర్యోధనుడు వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. చివరికి ఇది కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది. మహాభారతం యుధ్దంలో భీష్ముడు మొదట కౌరవ దళ సేనాధిపతిగా నియమింపబడతాడు. 16ఏళ్ళ వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్ర యుధ్దంలో పాల్గొంటాడు. మొదట కోసల రాజు బృహద్బలతో జరిగిన యుద్ధంలో అభిమన్యుడు అతనితో తలపడి ఓడిస్తాడు. ఆతర్వాత భీష్ముడితో అభిమన్యుడు హోరాహోరీగా యుధ్దం చేశాడు, భీష్ముడి జెండాను విరగగొడతాడు. భీష్ముడిని భాణాలతో గాయపరుస్తాడు. అభిమన్యుడి పరాక్రమాన్ని చూసిన భీష్ముడు నువ్వు యోధులకే యోధుడివని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత అభిమన్యుడు, దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడితో యుధ్దం చేసి అతన్ని ఓడిస్తాడు. అలాగే మగధ రాజు జయత్సేనుని ఏనుగును చంపుతాడు. అలాగే అర్జునుడు నిర్మించిన అర్ధ చంద్ర వ్యూహం అని పిలువబడే అర్ధ వృత్తాకార ఫలకంలో ఒక స్థానాన నిలబడ్డ అభిమన్యుడు, గాంధారులతో క్రూరంగా పోరాడతాడు. కౌరవ సోదరులు ఇతని ధాటికి తట్టుకోలేక పారిపోతారు.
Also Read : ఈ వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో అన్నీ సమస్యలే..
ఆ తర్వాత అభిమన్యుడు కర్ణుడి కుమారులైన వికర్ణ, చిత్రసేనులతో తల పడతాడు. కర్ణ కుమారుడు చిత్రసేనుడు కూడా చాలా గొప్ప యోధుడు. అభిమన్యుడు, చిత్రసేనుడు ఇద్దరూ మహ రధులు.. వీరిధ్దరి మధ్య యుధ్దం భయంకరంగా జరిగింది. చివరకి అభిమన్యుడి బాణాల ధాటిని తట్టుకోలేక చిత్రసేనుడు పారిపోతాడు. ఆ తర్వాత అభిమన్యుడు పాండవుల సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు నిర్మించిన శృంగాటక వ్యూహంలో ఒక స్థానాన్ని పొంది అంబష్ఠ, అలంబుష లను కూడా ఓడించాడు. ఆ తర్వాత సుదిష్ణ, దుర్యోధన, బృహత్బలలతో యుద్ధం చేసి అందరినీ దారుణంగా గాయపరుస్తాడు. ఇతని అస్త్రశస్త్రాలకు తట్టకోలేక కౌరవ సేనలు ఆహాకారాలు చేస్తూ కదన రంగంలో చాలా దారుణంగా చనిపోయారు. పదకొండవ రోజున భీష్ముడు అర్జునుడి భాణాల ధాటిని తట్టుకోలేక అంపశయ్యపై పడిపోతాడు. ఆ తర్వాత, గతంలో పాండవులకు, కౌరవులకు గురువుగా ఉన్న ద్రోణాచార్యుడు కౌరవ పక్షానికి సేనాధిపతిగా ఎంపికయ్యాడు. నీకు ఏమి కావాలో కోరుకో అని దుర్యోధనుడిని అడిగితే ధర్మరాజు ని భంధించి ఇవ్వమంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహన్ని పన్నుతాడు.
అర్జునుడు పద్మవ్యూహన్ని చేధించగలడు కాబట్టి.. అర్జునుడిని యుద్ధరంగం నుండి వేరొక చోటికి మళ్లించమని దుర్యోధనుడిని కోరతాడు. పదమూడవ రోజున, అర్జునుడు సంసప్తకుల కోసం దక్షిణ దిక్కుగా వెళతాడు. అప్పుడు ద్రోణాచార్యుని నేతృత్వంలో కౌరవుల సైన్యం పద్మవ్యూహ శ్రేణిని ఏర్పాటు చేసుకుంది. ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, జయద్రథుడు, దుఃశ్శాసనుడు, భూరిశ్రవుడు వంటి మహారధులు లక్షలాది మంది సైనికులచే కాపలాగా ఉన్న పద్మవ్యూహన్ని ఏర్పరిచారు. పాండవ దళాలు యుద్ధంలో ముందుకు సాగాయి, కాని పద్మవ్యూహం గురించి తెలియక పాండవ యోధులందరూ వెనక్కి తగ్గారు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడికి ఆ పనిని అప్పగించాడు. అయితే తనకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు కానీ భయటకు ఎలా రావాలో తెలియదని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు ముందు నీవు వెళ్లు నిన్ను అనుసరించి మేము వస్తాం..నీకు ఏదైనా జరిగితే మేము కాపాడతాము అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు తన రథసారధి సుమిత్రతో రధాన్ని పద్మవ్యూహంలోకి నడపమని ఆజ్ఞాపించగా, పాండవులు అతన్ని అనుసరిస్తారు.అప్పుడు కౌరవ సైనికులు అభిమన్యునిపై దాడి చేయగా వారిని ఎధుర్కోంటూ, వారిపై రకరకాల అస్త్రాలను సంధిస్తూ ముందుకు సాగుతాడు. అప్పుడు సింధు పాలకుడు జయద్రథుడు పాండవుల సైన్యాన్ని అడ్డుకుంటాడు.
ఒకసారి పాండవుల చేతిలో అవమానకరమైన ఓటమిని చవిచూసిన జయద్రథుడు తర్వాత శివుడిని ప్రార్థించి ఒక వరం కోరాడు. అది ఏమిటంటే ఒక్కరోజు యుద్ధంలో అర్జునుడు, కృష్ణుడు తప్ప మిగిలిన ఎవ్వరైనా తనను ఎదిరించకుండా చేయమంటాడు. శివుడు సరేనంటాడు. శివుని వర ప్రభావంతో.. ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులతో పాటు పాండవుల పక్షాన ఉన్న యోథులందరినీ జయద్రథుడు పద్మవ్యూహం బయట ఎదుర్కొని వారు లోపలికి ప్రవేశించకుండా చేస్తాడు. అప్పుడు అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలో ముందుకు సాగుతూ.. కౌరవ యోధులైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, అశ్వథామ, కర్ణుడు, శకునిలాంటి మహా యోధులతో యుద్ధం చేస్తాడు. వీరందరి మద్య యుధ్ధం భయంకరంగా జరుగుతుంది. అభిమన్యుని ధనుర్విద్యా నైపుణ్యాలను చూచి కర్ణుడు, అశ్వథామ, ద్రోణుడు లాంటి యోధులు సైతం ఆశ్ఛర్యపోతారు. అభిమన్యుడు అస్మాక రాజ కుమారుడు, శల్య సోదరులు, రుక్మరథుడు, లక్ష్మణుడు, బృందాక, జయత్సేనుడి కుమారుడు బృహత్బల, అశ్వకేతువు, భోజ యువరాజు మార్తికావత, భూరిశ్రవుడు సహా అనేక మంది శత్రు యోధులను వధించాడు.
Also Read : కుబేరునికి ఇష్టమైన 4 రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉంటే ఇక తిరుగేలేదు
అప్పుడు దుర్యోధనుడు తన కుమారుడు లక్ష్మణుడి మరణంతో కోపోద్రిక్తుడై, అభిమన్యుని హత్య చేయడానికి పద్మవ్యూహన్ని మార్చమని ద్రోణుడిని కోరతాడు. శకుని యుద్ధ నియమాలను ఉల్లంఘించి అతనిపై ఏకకాలంలో దాడి చేధ్దామని చెప్పగా, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని అనే ఆరుగురు మహారధులు అభిమన్యునిపై దాడి చేశారు. అభిమన్యుడి చేతలో ధనస్సు ఉన్నంతవరకు అతన్ని చంపలేమని భావించిన దుర్యోధనుడు,కర్ణుడిని అతని ధనస్సు విరగ్గొట్టమని చెబుతాడు. అప్పుడు కర్ణుడు దొంగచాటుగా అభిమన్యుడి చేతి ధనస్సును ఒక భాణంతో విరగ్గొడతాడు. వెంటనే కృపాచార్య, కృతవర్మలు అభిమన్యుడి రథసారధిని చంపుతారు. వారు అతని రథాన్ని పడగొడతారు, అతని రథంలోని గుర్రాలను సైతం చంపుతారు. అప్పుడు అభిమన్యుడు ఒక కత్తిని, డాలుని తీసుకుని వీరితో పోరాడతాడు. కానీ అతని ఆయుధాలను అశ్వత్థామ మరియు ద్రోణుడు కత్తిని, డాలుని విరగ్గొడతారు. వెంటనే మిగిలిన వారు అనేక బాణాలు వేసి అతన్ని గాయ పరుస్తారు.
ఆ సమయంలో అభిమన్యుడు అలసిపోయినప్పటికీ, నిస్సహాయంగా ఉన్నప్పటికీ తన రథ చక్రాన్ని ఆయుధంగా ఉపయోగించి చాలా మంది గాంధార సైనికులను హతమారుస్తాడు. దేవతలు సైతం ఆకాశంలో నిల్చుని అభిమన్యుడి పోరాటాన్ని వీక్షించారు.. అంత గొప్పగా యధ్ధం చేశాడు అభిమన్యుడు. చివరకి దుశ్శాసనుడు తన గదతో దొంగచాటుగా అభిమన్యుడి తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై కిందపడిపోతాడు. అప్పుడు జయద్రథుడు అభిమన్యుడి శరీరాన్ని కాలితో తన్ని వీడు చచ్చాడు అంటూ వికటాట్టహాసం చేస్తాడు. సో.. అలా ఒక గొప్ప యోధుడు మహభారత యుద్ధంలో చనిపోయి.. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాడు. అయితే కొంతమంది వాదన ప్రకారం.. అభిమన్యుడు పుట్టేటప్పుడు పేగు మెడలో వేసుకుని పుడతాడని.. మేనమామ శ్రీకృష్ణుడి గండంలో జన్మించాడని.. అభిమన్యుడు బ్రతికుంటే కృష్ణుడు చనిపోతాడని.. కాబట్టే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడని.. సర్వామయుడైన ఆ శ్రీకృష్ణుడికి తెలిసినా అర్జునుడికి చెప్పకుండా దాచాడని అంటారు.
ఏది ఏమైనప్పటికీ.. ఇదీ యోధులకు యోధుడైన అభిమన్యుడి చరిత్ర.