150 years Tollywood centiment tree collaps in Kumaradevam: అది సాదాసీదా చెట్టు కాదు తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక మహా వృక్షం. సినిమా పాత్రలతో బాధలు, సంతోషాలు పంచుకుంది ఆ చెట్టు. ఎందరో గొప్ప దర్శకుల ఆలోచనలకు తుది రూపునిచ్చింది ఆ చెట్టు. నాటి తరం నుంచి నేటి తరం వరకూ నటీనటులను ప్రత్యక్షంగా చూసిందా చెట్టు. అలాంటి మహావృక్షం సోమవారం కుప్పకూలింది. అంతకు మందు అది గోదావరి ఉగ్ర రూపాన్ని ఎన్నోసార్లు చూసింది. ఎన్నెన్నో ప్రకృతి విపత్తులకు తట్టుకుని నిలబడింది. అలాంటి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సినీ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ ఊరికే ఆ చెట్టు మంచి పేరు తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఈ చెట్టు కింద జరిగే షూటింగులను సందర్శించేందుకు చుట్టుపక్కల గ్రామాలనుంచి వచ్చి చూసి వెళ్లేవారితో ఆ ప్రాంతమంతా సందడిగా ఉండేది. టూరిస్టులు కూడా ప్రత్యేకంగా ఈ చెట్టును చూసేందుకు వచ్చేవారు.
హిట్టు సెంటిమెంటుగా మారిన చెట్టు
తూర్పుగోదావరిలో షూటింగ్ చేస్తే తప్పనిసరిగా ఈ చెట్టు కింద ఒక షాట్ చిత్రీకరించాల్సిందే
. అదో హిట్ సెంటిమెంట్ గా మారింది నిర్మాతలకు. ఈ చెట్టుకింద సినిమా తీస్తే సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ముద్ర పడిపోయింది సినీ వర్గాలలో అందుకనే నిర్మాతలను పట్టుబట్టి ఈ చెట్టుకింద ఓ సన్నివేశమూ లేక పాటనో ఉండేలా చూసుకునేవారు దర్శకులు.
హీరో కృష్ణ నటించిన పాడి పంటలు చిత్రంలో తొలిసారిగా ఈ చెట్టు కింద ఓ సన్నివేశం చిత్రీకరించారు. ఇటీవల రంగస్థలం మూవీలో కూడా ఈ చెట్టు కనిపిస్తుంది.
విషాధ గీతాలకు ప్రత్యేకం
ఎక్కువగా విషాధ గీతాలను ఈ చెట్టు కింద చిత్రీకరించేవారు నిర్మాతలు. దీనితో దీనిని సినీ విషాధ వృక్షంగా చెబుతుంటారు సినీ జనం .ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉందో తెలుసా? తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టుకు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ఒక నిద్రగన్నేరు చెట్టు. గోదావరి నది ఒడ్డునే ఉండటంతో దీనికి అంతటి ప్రాధాన్యత వచ్చింది. నిద్రగన్నేరు చెట్టు అంత గుబురుగా ఎదగడం..గోదావరి అందాలను చూసేందుకు వచ్చేవారు అక్కడే తాము వెంట తెచ్చుకున్న భోజనం చేసి తనివితీరా ముచ్చట్లు చెప్పుకుని వెళ్లేవారట ఒకప్పుడు.
క్రియేటివ్ ఆలోచనలిచ్చే చెట్టు
రానురానూ సినిమా వారి కంట పడి ఈ చెట్టు చరిత్రే మారిపోయింది. సినిమాలలో నటించేవారితో సహా ఈ చెట్టు కూడా చేరిపోయింది. ఇక కె.విశ్వనాథ్, బాపు, వంశీ , కె.రాఘవేంద్రరావు వంటి క్రియేటివ్ దర్శకులు తప్పనిసరిగా ఈ చెట్టు వద్ద ఓ షాట్ తీసేవారు. అసలు గోదావరి అంటేనే ఈ దర్శకులకు ఆరో ప్రాణం. అలాంటిది వీళ్లు తీసే క్రియేటివ్ సినిమాలకు ఈ చెట్టు ఒక ఊతంలా సాయం అందించింది. క్రియేటివ్ దర్శకుడు వంశీ అయితే ఈ చెట్టుకింద కూర్చుని అప్పటికప్పుడు సినిమా సన్నివేశాల స్క్రిప్ట్ లు రాసుకునేవారట. ఈ చెట్టు కింద కూర్చొంటే కొత్త ఆలోచనలు వచ్చేవని చెబుతుండేవారు.
స్వచ్ఛంద సంస్థ చొరబాటు
ఈ చెట్టు మీద రకరకాల పక్షులు, అవిచేసే ధ్వనులు, ఎదురుగా గోదావరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేదని ఇప్పుడు అవన్నీ లేకుండ కేవలం గోదావరి మాత్రమే ఆ చెట్టు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందని స్థానికులు బాధపడుతున్నారు.
అయితే ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థ కూలిపోయిన ఈ మహావృక్షం స్థానంలో అంతే ఎత్తులో ఉన్న మరో వృక్షాన్ని తెచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేద్దామనుకుంటోందట. అదేదో త్వరగా చేసి మళ్లీ తమ ఊరికి పునర్‌వైభవం వచ్చేలా చూడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.