Lord Sun Favourite Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడిని ఆత్మ, ఆరోగ్యం, శక్తి, అధికారం, ప్రభుత్వానికి కారకుడిగా చెబుతారు. సూర్యుడు ప్రతి రాశిలో సుమారు ఒక నెల పాటు సంచరిస్తాడు. సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో విజయం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, సానుకూలత పెరుగుతాయి. కొన్ని రాశుల వారికి సూర్యుడు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశుల వారు సూర్య భగవానుడి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందుతారని నమ్ముతారు.
సింహ రాశి (Leo):
సూర్యుడు సింహ రాశికి అధిపతి. కాబట్టి.. సూర్యుడికి అత్యంత ఇష్టమైన రాశి సింహ రాశి. ఈ రాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం , దైర్యాన్ని కలిగి ఉంటారు. సూర్యుడి ప్రభావం వల్ల వీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. కళలు, రాజకీయాలు, వ్యాపారం వంటి రంగాలలో వీరు రాణిస్తారు. సింహ రాశి వారు సూర్య భగవానుడిని పూజించడం ద్వారా మరింత శుభ ఫలితాలను పొందుతారు. వీరిలో ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతే కాకుండా ఉన్నత స్థానంలో నిలుస్తారు.
మేష రాశి (Aries):
మేష రాశి వారికి కుజుడు అధిపతి అయినప్పటికీ.. సూర్యుడు ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. అంటే సూర్యుడు మేష రాశిలో చాలా శక్తివంతంగా ఉంటాడని అర్థం. ఈ రాశి వారు ధైర్యంగా, ఉత్సాహంగా, దృఢ సంకల్పంతో ఉంటారు. కొత్త పనులను ప్రారంభించడానికి వెనుకాడరు. అంతే కాకుండా సూర్యుడి ప్రభావం వల్ల మేష రాశి వారికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటాయి. వీరు జీవితంలో విజయాలను సాధించడానికి సూర్య ఆరాధన సహాయపడుతుంది.
ధనస్సు రాశి (Sagittarius):
ధనస్సు రాశికి గురువు అధిపతి. సూర్యుడికి, గురువుకు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది. కాబట్టి.. సూర్యుడు ధనస్సు రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటాడు. ఈ రాశి వారు జ్ఞానం, ఆశావాదం, ఉన్నత ఆదర్శాలను కలిగి ఉంటారు. వీరు న్యాయం, ఆధ్యాత్మికత, విద్యా రంగాలలో రాణిస్తారు. సూర్యుడి అనుగ్రహం వల్ల ధనస్సు రాశి వారికి అదృష్టం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
Also Read: ఇంట్లో డబ్బు నిలవడం లేదా ? ఈ వాస్తు చిట్కాలు పాటించండి
వృశ్చిక రాశి (Scorpio):
వృశ్చిక రాశికి కుజుడు అధిపతి, సూర్యుడితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యమైన స్వభావం, దృఢ సంకల్పం, లోతైన అంతర్దృష్టి కలిగి ఉంటారు. సూర్యుడి ప్రభావం వల్ల వీరికి అసాధారణమైన శక్తి, సంకల్పం ఉంటాయి. వీరు పరిశోధన, గూఢచర్యం, వైద్య రంగాలలో రాణించగలుగుతారు. సూర్యుడి ఆరాధన వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆటంకాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది.
మిథున రాశి (Gemini):
మిథున రాశికి బుధుడు అధిపతి. సూర్యుడు బుధుడికి మిత్రుడు. కాబట్టి మిథున రాశి వారికి కూడా సూర్యుడు కొంతవరకు అనుకూలంగా ఉంటాడు. ఈ రాశి వారు తెలివైనవారు, సంభాషణా నైపుణ్యాలు కలిగినవారు. అంతే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలులు. సూర్యుడి అనుగ్రహం వల్ల వీరికి మంచి ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
పైన పేర్కొన్న రాశుల వారికి సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పటికీ.. సూర్య భగవానుడి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేయడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వంటివి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గాలు.