BigTV English

Mantralayam Temple : మహిమాన్విత క్షేత్రం.. మంత్రాలయం

Mantralayam Temple : మహిమాన్విత క్షేత్రం.. మంత్రాలయం
Mantralayam Temple

Mantralayam Temple : రాయలసీమలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఒకటి. సాక్షాత్తూ ప్రహ్లాదుడి అవతారమైన గురు రాఘవేంద్రుల పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. ఇక్కడ నేటికీ రాఘవేంద్ర స్వామి తన బృందావనం( స్వామి సమాధి) నుంచి భక్తుల ప్రశ్నలకు పరిష్కారాలు సూచిస్తూనే ఉన్నారు. నిత్యం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.


స్థల పురాణం
కృతయుగంలో హిరణ్యకశిపుడి కుమారుడిగా జన్మించి, విష్ణువు అనుగ్రహాన్ని పొందిన ప్రహ్లాదుడే.. ఈ యుగంలో గురు రాఘవేంద్రులుగా అవతరించారని పురాణ గాథ. నాడు ప్రహ్లాదుడు యజ్ఞయాగాదులు చేసిన ఈ స్థలంలోనే తాను జీవసమాధి కావాలని స్వామి తలచారు. అలాగే.. గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) కూడా రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉండిపోమని ఆదేశించటంతో.. రాఘవేంద్రులు ఇక్కడే బృందావనం రూపంలో ఉండిపోయారు. మంత్రాలయాన్ని ఒకప్పుడు మంచాల అనేవారు. ఆదోని నవాబు పాలనలోని ఈ కుగ్రామానికి రాఘవేంద్రుల రాకతో ఇది మంత్రాలయంగా మారింది.

స్వామి చరిత్ర
తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు, గోపికాంబ దంపతులకు 1595లో వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామి చిన్పప్పటి పేరు) జన్మించారు. ఐదేళ్లకే అక్షరాభ్యాసం చేసి.. ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు నాటికి సకల విద్యలను పూర్తిచేసిన వెంకటనాథుడు కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. రాఘవేంద్ర అనే సన్యాస నామంతో నాటి నుంచి తమిళ, కన్నడ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తుంగభద్రా నదీ తీరాన గల పంచముఖి వద్ద 12 ఏళ్లపాటు ఘోర తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.


అనంతరం మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. తన అవతార సమాప్తి కాలంలో రాఘవేంద్రులు తన బృందంతో.. మాధవరం దగ్గరున్న ఒక కొండ వద్దకు వెళ్లి.. ఒక రాయిని చూపించారు. త్రేతాయుగంలో సీతారాములకు 7 గంటలపాటు విశ్రాంతినిచ్చిన ఆ రాయి ఇదేనంటూ దాని చరిత్రను వివరించి, ఈ రాతితో నిర్మించబయే తన సమాధి(బృందావనం) 700 ఏళ్లపాటు పూజలందుకోనుందని, దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారు. ఆయన ఆదేశంపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.

ఇతర దర్శనీయ స్థలాలు
మంత్రాలయం వచ్చే భక్తులు ముందుగా తుంగభద్రా నదిలో స్నానం చేసి ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని… అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు. అనంతరం.. కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్నీ దర్శించుకుంటారు. ఈ ఆలయంలోనే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేయగా, పంచముఖ ఆంజనేయుడిగా స్వామి.. రాఘవేంద్రులకు దర్శనమిచ్చారు.

అనంతరం భక్తులు.. మంత్రాలయానికి సమీపంలోని పాతూరు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలోని వేంకటేశ్వరుడి విగ్రహాన్ని సాక్షాత్తూ రాఘవేంద్ర స్వామివారే చెక్కారని ప్రతీతి. అలాగే తన భక్తుడైన వెంకన్న ఆచారి కోరిక మేరకు రాఘవేంద్రస్వామి ఈ గ్రామంలో నివసించారు. వెంకన్న వైకుంఠప్రాప్తి తర్వాత.. రాఘవేంద్రులే స్వయంగా తన భక్తునికి ఒక బృందావనాన్ని నిర్మించారు.

రోజూ ఉదయం 6 – 8.30 గంటల మధ్య, తిరిగి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ భక్తులకు దర్శనం ఉంటుంది. అలాగే.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం లభిస్తుంది. ద్వాదశి, ఆరాధనోత్సవాల సమయంలో పూజ వేళల్లో మార్పులుంటాయి. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు.

ఇక్కడ అందించే నైవేద్యానికి ‘పరిమళ ప్రసాదం’ అని పేరు. భక్తులందరికీ రోజూ.. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత నిత్యాన్నదానం ఉంటుంది. అలాగే.. రాత్రి 7 – 8 గంటల వరకూ పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×