Bathukamma 2024: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆడపడుచులంతా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ .. పువ్వుల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ శుద్ధ అమావాస్య రోజు బతుకమ్మ పండగ ప్రారంభం అవుతుంది. తొమ్మిది రోజు పాటు జరిగే బతుకమ్మ పండగ ఏ రోజు కారోజు ఎంతో ప్రత్యేకమైంది.
పువ్వుల పండగ అయిన బతుకమ్మ పండగను 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండగలో మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు.
బతుకమ్మ పండగలో రెండవ రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. బతుకమ్మ పండగ సమయంలో ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ఈ రోజును అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు అటుకులు, బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తారు.
9 రోజుల్లో బతుకమ్మను 9 రూపాల్లో పూజిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను తయారు చేసి నిమర్జనం చేస్తారు.
మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు సప్పిడి పిండి, అటుకులు,బెల్లంతో కలిపి నైవేద్యం సమర్పిస్తారు.
మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు ముద్ద పప్పు, బెల్లం, పాలను సమర్పిస్తారు.
నాల్గవ రోజు బతుకమ్మను నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నానబియ్యం, బెల్లం, పాలను నైవేద్యంగా సమర్పిస్తారు
ఐదవ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.ఈ రోజు నైవేద్యం సమర్పించరు
ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుమ్మ అని అంటారు. ఈ రోజు బియ్యం పండిని వేయించి వేపకాయల లాగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నెయ్యి బెల్లం, వెన్న, నువ్వులు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదవ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, మలీదతో పాటు మరికొన్ని నైవేద్యాలు సమర్పిస్తారు.