Big Stories

Powerful Nava Graha Temples: మీ దరిద్రాన్ని ఆమడ దూరం చేసే నవగ్రహ ఆలయాలు

Nava graha temples

- Advertisement -

Powerful Nava Graha Temples in India: సాధారణంగా మన దేవాలయాల్లో నవగ్రహాలన్నీ ఒకే వేదిక మీద కొలువుదీరి కనిపిస్తాయి. అయితే.. తమిళనాడులోని 9 దివ్యక్షేత్రాలలో.. నవ గ్రహాలకు సంబంధించిన 9 ప్రత్యేక ఆలయాలున్నాయి. జాతకరీత్యా ఏదైనా గ్రహం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేవారు ఈ 9 ఆలయాల్లో తమ గ్రహానికి సంబంధించిన ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తే సంబంధిత ప్రతికూల ప్రభావం తప్పక తొలగిపోతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇంతకూ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి..? వాటి విశేషాలేమిటో మనమూ ఓసారి తెలుసుకుందాం.

- Advertisement -

సూర్య దేవాలయం
కుంభకోణం నుండి 15 కి.మీ దూరంలోని తిరుమంగళం కుడి గ్రామంలో ఈ ఆదిత్యుడి దేవాలయం ఉంది. దీనిని సూర్యనార్ కోయిల్ అంటారు. ఉష, ఛాయా సమేతంగా సూర్యభగవానుడు దర్శనమిచ్చే ఈ కోవెలను క్రీ.శ 1075 -1120 మధ్యకాలంలో ప్రఖ్యాత పాలకుడైన కులోత్తుంగ చోళుడు నిర్మించారు. ఇక్కడ స్వామికి తామర పుష్పాలతో పూజలు చేసి, తర్వాత ఆలయం చుట్టూ 9 ప్రదక్షణలు చేస్తే.. సూర్యుడి ప్రతికూల దృష్టి ప్రభావాలు ఉపశమించటమే గాక మంచి ఆరోగ్యమూ సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా జనవరిలో కొత్తధాన్యం ఇంటికి వచ్చే వేళ.. ఈ ఆలయంలో గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు.

చంద్రగ్రహ దేవాలయము
తిరువైయారుకు 5 కి.మీ దూరంలోని ఈ చంద్రుడి కోవెలను స్థానికులు తిన్గాలుర్ కోవిల్ అంటారు. ఇక్కడ కొలువై ఉన్న చంద్రుడిని పూజిస్తే.. దీర్ఘాయువు, గొప్ప జ్ఞానం సిద్ధించటమే గాక మానసిక ఒత్తిడి, దు:ఖం తొలగిపోతాయి. చంద్రుడు ఫల్గునీ నక్షత్రంతో కూడి ఉండే ఫాల్గుణ మాసపు పౌర్ణమి రాత్రి కాలంలో చంద్ర కిరణాలు ఇక్కడి ఆలయంలోని శివలింగం మీద పడటం మరో విశేషం.

అంగారక (కుజ) ఆలయం
తిరువైయార్‌కు 6 కి.మీ దూరంలోని ఈ కోవెలను స్థానికులు ‘వైథీశ్వరన్ కోవిల్’ అంటారు. ధైర్యం, విజయాలను అందించే గ్రహంగా, రోగాలను, వివాహ ప్రయత్నాలు ఫలించకపోవటం వంటి సమస్యలను పోగొట్టే గ్రహం.. కుజుడు. జటాయువు, గరుత్మంతుడు, సూర్యుడు ఇక్కడ కొలువైన కుజుడి మూర్తిని ఆరాధించినట్లు ఇక్కడి స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా పెళ్లికాని యువత.. ఈ ఆలయంలో పూజలు చేయిస్తే.. తప్పక వివాహమవుతుందని స్థానికులు నేటికీ బలంగా నమ్ముతారు.

Read more: మార్చి 18న ఉదయించనున్న శని.. 3 రాశులకు అశుభమైతే.. 2 రాశులకు మాత్రం శుభప్రదం

బుధుని ఆలయం
పైన చెప్పుకున్న అంగారక గ్రహ ఆలయానికి కేవలం పది కి.మీ దూరంలోని తిరువెన్నాడు గ్రామంలో ఈ బుధుడి కోవెల ఉంది. ఈ ఆలయంలో పూజలు చేయటం వల్ల వ్యాపారాభివృద్ధితో బాటు మనిషికి మంచి బుద్ధివికాసం కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇదే ఆలయంలో శ్వేతారన్యేశ్వరుడు, బ్రహ్మ విద్యయంభికాదేవి పేర్లతో ఉన్న శివాలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు.

బృహస్పతి కోవెల
కుంభకోణానికి 18 కి.మీ దూరంలోని ఆలంగుడి గ్రామంలో ఈ గురు గ్రహ దేవాలయం ఉంది. దీనిని దక్షిణామూర్తి ఆలయంగానూ చెబుతారు. క్రీ.శ 1131లో విక్రమచోళ మహారాజు దీనిని నిర్మించాడు. సాక్షాత్తూ పరమశివుడు.. దేవ గురువైన బృహస్పతి పేరుతో ఇక్కడ పూజలందుకోవటం విశేషం. ఈ కోవెల బయట ఉన్న పుష్కరిణిలోనే పార్వతి అమ్మవారు.. పరమశివుడిలో లయమై పోయిందని, క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని శంకరుడు తన గొంతులో నిలిపిన ప్రదేశమూ ఇదేననీ చెబుతారు. అందుకే ఇక్కడి శివుడిని ఆపద నుంచి గట్టెకించిన శివుడు (ఆపత్ సహాయేశ్వరర్)గా కొలుస్తారు. విద్యార్థులు గురువారం రోజు నానబెట్టిన శనగలను పసుపుదారంతో దండగా మలచి, ఇక్కడి స్వామికి అలంకరిస్తే.. చదువులో చక్కగా రాణిస్తారని, ఎంతోకాలంగా పెండింగ్‌‌లో ఉన్న తమ పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం. జాతకంలో గురు దోషం ఉన్నవారు.. ఈ గుడిచుట్టూ 24 ప్రదక్షిణలు చేసి, స్వామి సన్నిధిలో 24 నేతి దీపాలు వెలిగిస్తే గురు అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.

శుక్ర గ్రహ దేవాలయము
పైన పేర్కొన్న సూర్య దేవాలయానికి 3 కి.మీ దూరంలోని కంజనూరు గ్రామంలో ఈ శుక్ర దేవాలయం ఉంది. బ్రహ్మదేవుని పర్యవేక్షణలో.. పార్వతీ పరమేశ్వరుల వివాహం ఈ క్షేత్రంలోనే జరిగిందనీ చెబుతారు. దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా ఉన్నాయి. అనారోగ్యం పాలైన తమ భర్తల తరపున.. అనేకమంది మహిళలు ఈ దేవాలయంలో పూజలు చేయటం మనం చూడొచ్చు.

శని దేవాలయం
తిరునల్లార్ :-
కుంభకోణానికి 53 కి.మీ దూరంలోని కరైకాల్‌కు 5 కి.మీ దూరంలోని తిరునల్లార్ గ్రామంలో ఈ కోవెల ఉంది. ఈ ఆలయం సమీపంలోని తీర్థంలో స్నానం ఆచరిస్తే.. సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి దర్భ అంటే చాలా ఇష్టం. అందుకే ఈయనను దర్భారన్యేశ్వర్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ స్వామికి నిత్యం అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు.. స్వామి దర్శనానంతరం రెండు దర్భలు తీసుకుని, వాటి కొసలను ముడివేస్తారు. ఇలాచేయటం వల్ల వారి కష్టాలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.ఈ ఆలయం సమీపంలోని నల దమయంతుల ఆలయంలోని బ్రహ్మతీర్థంలో స్నానం ఆచరిస్తే.. ఎంతటి శనిదోషమైనా తొలగిపోతుందని చెబుతారు.

రాహు ఆలయం
కుంభకోణానికి 5 కి.మీ దూరంలోని తిరునగేశ్వరం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ కూడా శివుడే రాహు రూపంలో దర్శనమిస్తాడు. నాగనాద స్వామి, గిరిజాంబిక పేర్లతో స్వామి, అమ్మవార్లు పూజలందుకునే ఈ ఆలయంలో నిత్యం జరిగే క్షీరాభిషేక సమయంలో.. లింగం మీద పోసిన పాలు కిందికి జారేకొద్దీ నీలంగా మారతాయి. అయితే.. మిగిలిన వేళల్లో ఇలా జరగదు. ఆదిశేషుడు, దక్షుడు మొదలైన వారంతా ఇక్కడ కొలువైన స్వామిని ఆరాధించారని స్థల పురాణం చెబుతోంది.

కేతు ఆలయం
తిరువెన్నాడ్ నుంచి 6 కి.మీ దూరంలోని కిల్ పేరుంపళ్లమ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. క్షీరసాగర సమయంలో రాహుకేతువులు జంటసర్పాలుగా మారి శివుడికి సాయం చేసిన స్థలంగానూ దీనికి పేరుంది. ఈ ఆలయంలోని 9 తీర్థాల్లో స్నానం చేసి, 12 వారాల పాటు స్వామిని ఆరాధిస్తే.. కేతు గ్రహ ప్రభావం తొలగిపోతందని చెబుతారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఒక పళ్లెంలో 7 ప్రమిదలను వెలిగించి స్వామికి హారతి ఇస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News