Ramayana : మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవిత కథనే రామాయణంగా వాల్మీకి మహర్షి రచించాడు. త్రేతాయుగం నాటి ఈ రమణీయ కావ్యంలో అనేక నగరాలను, ప్రదేశాలను అత్యంత రమ్యంగా, వివరంగా వర్ణించారు. వాటిలో అనేక ప్రదేశాలు నేటికీ మనదేశంలో వేరువేరు పేర్లతో ఉండగా, కాలంతో బాటుగా వచ్చిన మార్పుల కారణంగా కొన్ని మన పొరుగుదేశాల్లో ఉండిపోయాయి. రామాయణ కాలపు ఆ ప్రదేశాలు.. వాటి వర్తమాన కాలపు పేర్ల వివరాలు తెలుసుకుందాం.
రామాయణంలోని బాలకాండలో భగీరథుడు గంగను స్వర్గం నుంచి భూమికి దించిన కథ ఉంటుంది. నాడు.. గంగ తొలిసారి భూమ్మీద అడుగుపెట్టిన ప్రదేశాన్నే నేడు మనం గంగోత్రి అని పిలుస్తున్నాం. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది.
ఇదే కథలో కపిల మహర్షి ఆశ్రమ ప్రస్తావన వస్తుంది. శ్రీరాముని పూర్వీకులైన సగర చక్రవర్తి 60 వేలమంది కుమారులు ఇక్కడే అగ్నికి ఆహుతి కాగా.. గంగ వారి చితాభస్మంపై ప్రవహించగానే వారు తిరిగి సశరీరులవుతారు. ఈ ప్రదేశాన్ని నేడు గంగాసాగర్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది నేటి పశ్చిమ బెంగాల్‌లో ఉంది.
లంకాధిపతి అయిన రావణుడు శివ దర్శనం కోసం కైలాసం వెళ్లగా.. శివుని దర్శనం లభించదు. దాంతో ఆవేదనకు లోనైన రావణుడు.. తన 10 తలలు నరికి శివునికి అర్పించగా.. శివుడు దర్శనమిస్తాడు. ఆ ప్రదేశాన్ని రక్షాస్థలంగా పిలిచే ఈ ప్రదేశం నేటి టిబెట్‌లోని లాంగకో పేరుతో వ్యవహారంలో ఉంది.
రామాయణంలో సంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. నాడు ఆయన యజ్ఞవాటిక ఏర్పాటు చేసిన స్థలమే నేటి ఫైజాబాద్. ఇది ఉత్తర ప్రదేశ్‌లో ఉంది.
విశ్వామిత్రునితో రామలక్ష్మణులు యాగ సంరక్షణకు అడవిలో వెళుతుండగా రాయిగా పడి ఉన్న అహల్యకు రాముని పాదస్పర్శచేత శాపవిమోచనం అవుతుంది. ఆ ప్రదేశాన్ని నేడు.. అహిరౌలి అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది నేటి బీహార్ రాష్ట్రంలో ఉంది.
రాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి వెళుతూ.. గంగను దాటే సమయంలో గుహుడు వారిని కలిసి నావలో ఆవలి తీరానికి చేర్చుతాడు. నాడు రాముడిని గుహుడు కలిసిన చోటును శృంగబేరిపురం అంటారు. ఇది నేటి ప్రయాగ్‌రాజ్ నగరానికి సమీపంలో గంగాతీరాన ఉంది.
సీతారాములు వనవాసంలో నివసించిన ప్రదేశాన్ని చిత్రకూటం అంటారు. అది నేటి మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ బోర్డర్‌లో ఉంటుంది.
ఇదే అరణ్యవాస సమయంలో రావణుని చెల్లెలైన శూర్పణఖ శ్రీరాముడిని మోహించేందుకు రాగా.. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేస్తాడు. ఈ ప్రదేశాన్ని పంచవటి అంటారు. ఇది నేటి మహరాష్ట్రలోని నాసిక్ వద్ద ఉంది.
రాముడు అడవుల్లో వెళుతుండగా వృద్ధురాలైన శబరి ఆయన దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రాముడు ఆమె ఆశ్రమంలో విడిదిచేసి, ఆమె పెట్టిన ఎంగిలి పళ్లను తిన్న ప్రదేశం.. నేటి కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఉంది. దీనిని ఇప్పుడు సర్బన్ అంటున్నారు.
రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతమ్మను వెతుకుతూ బయలుదేరిన రామ లక్ష్మణులు బుుష్యమూక పర్వతం వద్ద (నేటి కర్ణాటకలోని హంపి) ఆంజనేయుడిని కలుస్తారు. తొలిసారి వీరు కలిసిన ప్రదేశం నేటి కర్ణాటకలోని ఉంది. దానిని హనుమాన్ హళ్ళి అంటారు.
అపహరించిన తర్వాత రావణుడు సీతమ్మను బంధించిన అశోకవనం నేటి శ్రీలంకలోని కాండీ అనే ప్రదేశానికి వెళ్లే దారిలో ‘సీతా ఏళియ’ అనే పేరుతో ఉంది.
శ్రీరాముడు రావణుని వధించిన చోటు కూడా నేటి శ్రీలంకలోని దునువిల్ల అనే పేరుతో ఉంది. అలాగే.. సీతమ్మ అగ్నిప్రవేశం చేసి భూమిలో కలిసిపోయిన చోటును శ్రీలంకలో ‘దివిరుంపోల’ పేరుతో పిలుస్తున్నారు.
సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు నిర్మించిన కుశపురం నేటి పాకిస్థాన్‌లో ఉంది. దానిని కుశార్ అంటుండగా, చిన్నకుమారుడైన లవుడు నిర్మించిన లవపురాన్నే నేడు.. లాహోర్ అంటున్నారు.
రాముని తమ్ముడైన భరతుని కుమారుడైన తక్షుడు నిర్మించిన నగరం కూడా పాకిస్థాన్‌లోనే ఉంది. దానికే తక్షశిల అనిపేరు. అలాగే.. భరతుని రెండవకుమారుడు పుష్కరుడు నిర్మించిన పురుషపురం/పుష్కలావతి అనే నగరాన్నే నేడు అక్కడ పెషావర్ అని పిలుస్తున్నారు.