Shashta Graha Kutami 2025: ఘడియలు దగ్గరపడుతున్నాయ్! ఖగోళంలో అరుదైన కలయికకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. షష్టగ్రహ కూటమికి సమయం ఆసన్నమైంది. ఒకే రాశిలోకి.. ఆరు గ్రహాలు రాబోతున్నాయ్. అత్యంత అరుదుగా ఏర్పడే ఈ కూటమి.. అదృష్టమా? అరిష్టమా? సహజ కుండలి చక్రంలో వచ్చే మార్పులతో.. విపరీతమైన అనర్థాలు చోటు చేసుకోబోతున్నాయా? ఇంకొన్ని ఘడియల్లో ఏం జరగబోతోంది?
ఒకే రాశిలోకి 6 గ్రహాలు..
అదే సమయానికి సూర్యగ్రహణం
షష్టగ్రహ కూటమితో అరిష్టమా?
మార్చి 29న ఏం జరగబోతోంది?
ఖగోళంలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అత్యంత అరుదుగా సంభవించే ఈ గ్రహ కూటములతో.. భూమిపై ఉండే మనుషులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతుంటారు. ఇప్పుడు కూడా అలాంటి అరుదైన ఘటనే సంభవించబోతోంది. ఇంకొన్ని ఘడియల్లోనే షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. సాధారణంగా సంభవించే సూర్య గ్రహణమో, చంద్ర గ్రహణమో అయితే.. ఇంత ఆందోళన అవసరం లేదు. కానీ.. ఈసారి షష్ట గ్రహ కూటమిలోనే సూర్య గ్రహణం సంభవించబోతోంది. మార్చి 29 శనివారం అమావాస్య ఘడియల్లోనే.. షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది.
ఈసారి షష్ట గ్రహ కూటమిలోనే సూర్య గ్రహణం
ఆ సమయంలోనే సూర్య గ్రహణం సంభవించబోతోంది. అంటే.. ఈ ఉగాది రోజున మొదలయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. షష్టగ్రహ కూటమితోనే మొదలవుతుంది. అదే.. అందరిలోనూ టెన్షన్ పెంచుతోంది. ఆరు గ్రహాలు.. ఒకే రాశిలోకి రాబోతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కలయిక ద్వారా.. మీన రాశిలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. దాంతో.. విపత్తులు ముంచుకొస్తాయని.. అరిష్టం తప్పదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దాంతో.. అందరిలోనూ ఆందోళన మొదలైంది.
ఒకే రాశిలోకి రాబోతున్న 6 గ్రహాలు
ఈ మార్చి 14నే చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది జరిగిన 2 వారాల్లోనే సూర్యగ్రహణం సంభవించబోతోంది. అదే రోజు.. షష్ట గ్రహ కూటమి ఏర్పడుతోంది. ఇప్పుడు దీనిమీదే చర్చ మొదలైంది. ఈసారి మీన రాశిలోకి.. ఆరు గ్రహాలు రావడం అరిష్టమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. విశేషమని కొందరంటుంటే.. విధ్వంసం తప్పదని ఇంకొందరు చెబుతున్నారు. ఆరు గ్రహాల కలయిక చుట్టూ.. 60 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మంచి ఫలితాల కంటే.. ప్రతికూల ప్రభావాలు గట్టిగానే ఉంటాయంటున్నారు.
ఆరు గ్రహాలు కూటమి కట్టడం దేనికి సంకేతం?
ముఖ్యంగా.. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవడమనేది.. అత్యంత అరుదైన విశేషమే కావొచ్చు. కానీ.. ఇదే సమయంలో దుష్పరిణామాలు కూడా సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రతికూల ఫలితాలని ఎదుర్కొనేందుకు.. అంతా సంసిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. పండితులంతా.. ప్రకృతి విపత్తులు తప్పవంటున్నారు. ఇప్పుడు సంభవించబోయే షష్ట గ్రహ కూటమి.. ప్రకృతి ఒడిలో చిచ్చుపెట్టబోతోందని అంచనా వేస్తున్నారు. పైగా.. ఇదంతా అమావాస్య నాడే జరుగుతుండటం.. మరింత ఉత్కంఠగా మారింది.
మీనరాశిలో షష్టగ్రహ కూటమితో అరిష్టమా?
సహజ కుండలి చక్రంలో 12వ స్థానంలో ఉన్న మీనరాశిలో.. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. సాధారణంగా 12వ స్థానమనేది.. వ్యయ స్థానంగా భావిస్తారు. ఇది.. అనవసర ఖర్చులు, వృథా ప్రయాణాలని సూచిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీనరాశి ఉండే 12వ స్థానం.. ప్రతికూల ప్రభావాలన్ని చూపుతుంది. ఇప్పుడు ఆ స్థానంలోకే.. ఆరు గ్రహాలు రాబోతున్నాయ్. గ్రహ గమనాలతో.. జాతకరీత్యా కీలక మార్పులు సంభవిస్తాయంటున్నారు. బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల.. స్థిర, చరాస్తుల ధరలు పడిపోయే అవకాశం ఉంది. మీనంలో.. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటికీ.. ఈ పాప గ్రహయుతి వలన నష్టాలు తప్పవని చెబుతున్నారు.
షష్ట గ్రహ కూటమిలోనే సూర్యగ్రహణం
విలాసవంతమైన జీవితం ఉండదంటున్నారు. ఇక.. రవి.. రాహు, శనితో కలవడం వల్ల.. రాజకీయాల్లోనూ ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. నాయకుల మధ్య పరస్పర వైరుధ్యాలు, విభేదాలు తలెత్తుతాయంటున్నారు. ఇక.. శని కూడా మీనరాశిలోకి రావడం వల్ల.. ధన నష్టాన్ని, స్థాన చలనం ప్రభావం చూపుతాడు. రాహువు రాక వల్ల.. కష్టాలు ఎదురవుతాయి. ఈ రాశిలో చంద్రుడి సంచారం వల్ల.. ధన వ్యయం కలుగుతుందని నమ్ముతారు. గోచారరీత్యా సూర్యుడు.. వ్యవయ స్థానంలో ఉండటం వల్ల.. ధన నష్టాన్ని కలగజేసే అవకాశాలున్నాయి.
మార్చి 29న ఏం జరగబోతోంది?
సాధారణంగా గ్రహాల సంచారం, వాటి ప్రభావం సమస్త విశ్వంపై ఉంటుంది. వాటి ఎఫెక్ట్.. జీవ, జంతు, వస్తువులపై పడటం సాధారణమే. అయితే.. కొన్ని గ్రహాల కలయికల వల్ల.. కొన్ని సందర్భాల్లో అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు, మరికొన్ని అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో.. మార్చి 29న ఆరు గ్రహాలు మీన రాశిలో ఒకే చోట కలవబోతున్నాయ్. సాధారణంగా ఒక రాశిలో రెండు గ్రహాలుంటేనే.. గ్రహ యుద్ధం జరుగుతుందని భావిస్తారు. అలాంటిది.. ఆరు గ్రహాలు ఒకే రాశిలోకి వస్తే.. వాటి ప్రభావం ఊహకు కూడా అందకుండా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందువల్ల.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. షష్ట గ్రహ కూటమి వల్ల శుభ ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి.
మిగతా గ్రహాల కలయికతో.. ప్రతికూల ప్రభావాలుంటాయి.
ఈ ఆరు గ్రహాల్లో చంద్రుడు, శుక్రుడు వల్ల మాత్రమే శుభ ఫలితాలుంటాయి. మిగతా గ్రహాల కలయికతో.. ప్రతికూల ప్రభావాలుంటాయి. గోచారరీత్యా ఈ కూటమి వల్ల.. విపరీతమైన అనర్థాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఉగాదిన మొదలుకాబోయే విశ్వావసు సంవత్సరంలో.. తొలి అర్ధభాగమంతా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ గ్రహకూటమి కాలంలో.. ప్రపంచంలో వింత ఘటనలు, విపత్తులు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. ధనం ఎక్కువగా ఖర్చవడంతో పాటు అన్ని దేశాల్లోనూ అభద్రతా భావం పెరిగిపోతుందనే అంచనాలున్నాయి.
షష్ట గ్రహ కూటమితో.. అన్ని రాశుల వారికి చిక్కులు తప్పవా?
షష్ట గ్రహ కూటమితో.. అన్ని రాశుల వారికి చిక్కులు తప్పవా? జ్యోతిష్య పండితులు చెబుతున్నట్లు.. ఈ గ్రహాల కలయిక ప్రమాదకరమా? ప్రపంచం మొత్తం తలకిందులు కానుందా? ప్రళయం రాబోతోందా? భూకంపాలు సంభవిస్తాయా? అక్కడెక్కడో విశ్వంలో సంభవించే షష్ట గ్రహ కూటమి.. ఈ భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
భూమిపై ఊహించని స్థాయిలో విపత్తులు
జ్యోతిష్య శాస్త్రం.. గ్రహాల స్థానాలు, వాటి కదలికల ఆధారంగా భవిష్యత్‌ని అంచనా వేస్తుంది. ఇది.. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయం. జ్యోతిష్య నిపుణులు చెప్పినట్లుగా.. కొందరి వ్యక్తిగత జీవితంలో కీలక ఘటనలు జరిగాయనే అనుభవాలున్నాయ్. శుక్ర మహాదశలో శ్రీమంతులవుతారని.. శని దశలో కష్టాలు ఎదురవుతాయని చెప్పడం లాంటివి.. కొందరి జీవితాల్లో నిజమయ్యాయని నమ్ముతారు. అందువల్ల.. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు షష్టగ్రహ కూటమిపై ఇంత చర్చ జరగడానికి కారణం కూడా గత అనుభవాలే. కొన్ని కొన్ని సార్లు ఆకాశంలో జరిగే గ్రహాల కలయికతో.. భూమిపై ఊహించని స్థాయిలో విపత్తులు సంభవిస్తుంటాయ్. జ్యోతిష్య నిపుణులు కూడా కొన్ని సార్లు ఈ తరహా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే హెచ్చరించిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
షష్టగ్రహ కూటమితో ప్రపంచంలో గందరగోళం
అందుకు తగ్గట్లుగానే.. 2004లో సునామీ సంభవించింది. గ్రహణం, కేతువు ప్రభావంతోనే.. ఈ ప్రళయానికి సంబంధం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. ఇంకొందరు జ్యోతిష్య పండితులు.. ఇలాంటి భారీ విపత్తు ఒకటి సంభవిస్తుందని ముందే హెచ్చరించారనే వాదనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా.. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి గురించి కూడా జ్యోతిష్యులు ముందే చెప్పారనే వాదనలున్నాయి. శని, గురు, రాహువు కలయిక వల్ల.. ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తాయని కొందరు జ్యోతిష్యులు ముందే హెచ్చరించారని అంటారు. ఆ లెక్కన.. ఇప్పుడు ఏర్పడబోయే షష్టగ్రహ కూటమితో.. ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్. అదే.. ఆందోళన పెంచుతోంది.
గోంచారరీత్యా విపరీతమైన అనర్ధాలు జరిగే అవకాశాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక, గ్రహాల రాశుల మార్పులు.. 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రాశుల్లో గ్రహాల కూటములు ఏర్పడి.. అవి కొన్ని రాశులకు మేలు చేస్తున్నాయి. ఇంకొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలనిస్తున్నాయ్. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. ఈసారి మీనరాశిలో 6 గ్రహాల కలయిక వల్ల.. గోచారరీత్యా విపరీతమైన అనర్థాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. ప్రకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల.. ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు.
సమాజంలో అరాచకాలు పెరిగిపోతాయని హెచ్చరిక
పెను తుపాన్లు, వరదలు, ప్రకృతి బీభత్సం లాంటి విపత్తులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. బంగారం, భూముల ధరలు కూడా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. ఒకానొక దశలో కరువు, క్షామం ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. సమాజంలో అరాచకాలు పెరిగిపోతాయని చెబుతున్నారు. 6 గ్రహాల కలయికతో ఊహించని మార్పుల్ని చూస్తామని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు.
సమాజంలో అస్థిరత గానీ, విప్లవాత్మక మార్పులు
మీన రాశిలో శని సంచారంతో.. కొన్ని రాశులకు ఏలినాటి శని, అష్టమ శని ప్రభావాన్ని తెచ్చి.. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక అశాంతిని సృష్టించొచ్చు అంటున్నారు. రాహు, కేతు సంచారం.. అనూహ్య సంఘటనలు, సామాజిక ఉద్యమాలు, సాంకేతిక ఆటంకాలను సూచిస్తున్నాయ్. సమాజంలో అస్థిరత గానీ, విప్లవాత్మక మార్పులు గానీ రావొచ్చంటున్నారు. ఈ మార్చి 29న సంభవించబోయే సూర్యగ్రణంలో భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దానిని అశుభ సంకేతంగా పరిగణిస్తున్నారు.
షష్టగ్రహ కూటమి వల్ల వరదలు, సునామీలు, భూకంపాలు
ఇది.. కొన్ని రాశులపై ఒత్తిడి గానీ, అనిశ్చితి గానీ సృష్టిస్తుందనే వాదనలున్నాయి. షష్టగ్రహ కూటమి వల్ల.. వరదలు, సునామీలు, భూకంపాల లాంటి విపత్తులు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలు కూడా పెరగొచ్చనే అంచనాలున్నాయి. శని, రాహువు ప్రభావం వల్ల.. కొన్ని ప్రాంతాల్లో ఆర్థికమాంద్యం కూడా తలెత్తొచ్చంటున్నారు.
12వ స్థానమైన వ్యయ స్థానంలో షష్టగ్రహ కూటమి
మనకు తెలిసిన గ్రహాలు 9. ఉన్న రాశులు 12. ఇప్పుడు వాటిలో 6 గ్రహాలు.. 12వ స్థానమైన వ్యయ స్థానంలో.. ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఇదే.. ఈ ప్రపంచానికి తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలగజేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఏర్పడుతున్న గ్రహ కూటమి.. మీనరాశిలో కాకుండా.. ఏ పంచమ స్థానంలో గానీ, నవమ స్థానంలో గానీ, పదకొండో స్థానంలో గానీ ఏర్పడి ఉంటే.. ఫలితాలు మరోలా ఉండేవి. అప్పుడు.. అన్నీ శుభ ఫలితాలే ఉంటాయని చెబుతున్నారు.
కొన్ని రాశుల వారికి.. ఊహించని మార్పులకు దారితీయొచ్చు
కానీ.. ఈ గ్రహ కూటమి వల్ల.. కొన్ని రాశుల వారికి.. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సవాళ్లు, ఆటంకాలు ఎదురవ్వొచ్చని చెబుతున్నారు. ఇది.. గ్రహణ సమయంలో ఏర్పడుతున్న కూటమి కావడంతో.. గ్రహాల శక్తి తీవ్రతరం కావొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది.. ఊహించని మార్పులకు దారితీయొచ్చని కొందరు జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదంతా.. నిజంగా నమ్మదగ్గదేనా?
షష్ట గ్రహ కూటమి వలన.. 12 రాశుల వారిలో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండటంతో.. అంతా గందరగోళంలో పడిపోయారు. ఇంకొందరు మాత్రం.. చిన్న చిన్న పరిహారాలతో ఉపశమనం పొందొచ్చని భరోసా ఇస్తున్నారు. అసలు.. షష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం.. ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఇదంతా.. నిజంగా నమ్మదగ్గదేనా?
అన్ని రాశుల వారిలో షష్టగ్రహ కూటమి ఆందోళన
ఉగాదికి కొన్ని గంటల ముందు ఏర్పడుతున్న ఈ షష్ట గ్రహ కూటమి.. ఇప్పుడు అన్ని రాశుల వారిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా.. ఇదే సమయంలో సూర్యగ్రహణం కూడా సంభవిస్తుండటం.. మరింత టెన్షన్ రేపుతోంది. మార్చి 29 శనివారం రోజున.. రాత్రి 9 గంటల 46 నిమిషాల నుంచి ఈ షష్ట గ్రహ కూటమి మొదలవుతుంది. అది.. ఆదివారం సాయంత్రం 4 గంటల 34 నిమిషాల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల నుంచి.. ఒంటి గంట 50 నిమిషాల వరకు.. ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావం తీక్షణంగా ఉంటుంది.
సూర్య గ్రహణానికి ముందే షష్ట గ్రహ కూటమి మొదలు
30 నిమిషాల పాటు గ్రహాల సంచారం తీక్షణంగా ఉంటుందని.. జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక.. ఇదే సమయంలో ఏర్పడే సూర్య గ్రహణం.. మన దేశంలో కనిపించదు. అయినప్పటికీ.. దోషం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇందుకు.. ఈ సూర్య గ్రహణం మీన రాశిలో జరగడమే ప్రధాన కారణం. సూర్య గ్రహణానికి ముందే.. షష్ట గ్రహ కూటమి మొదలైపోతుంది. ఒకే రాశిలో ఆరు గ్రహాల కలయిక జరిగినప్పుడే.. సూర్య గ్రహణం సంభవిస్తుండటం.. మిగతా రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
షష్ట గ్రహ కూటమితో మిగతా రాశులపై ప్రతికూల ప్రభావం
గోచార రీత్యా.. మీన రాశిలో షష్ట గ్రహ కూటమి మొదలైన తర్వాత.. మిగతా రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది అనేక మార్పులకు దారితీస్తుందని అంటున్నారు. ముఖ్యంగా.. మేషం, మీనం, సింహం, తులా రాశుల వారు పరిహారాలు పాటించాలని సూచిస్తున్నారు పండితులు. ఖగోళంలో ఏర్పడే ఈ షష్ట గ్రహ కూటమి వల్ల.. ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయంటే.. సమాజంలోని వ్యక్తుల మధ్య విభేదాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతాయి. ఊహించని సమస్యలతో.. కలహాలు చోటు చేసుకుంటాయ్. దేశ రాజకీయాల్లోనూ పెను మార్పులు సంభవించే అవకాశం ఉందంటున్నారు. అధికార పార్టీల్లో వైరుధ్యాలు, అంతర్గత కలహాలు ఏర్పడతాయని చెబుతున్నారు.
మేష రాశి వారికి విపరీతమైన ఖర్చులు, మానసిక ఆందోళన
రాశుల వారీగా చూసుకుంటే.. మేష రాశి వారికి షష్ట గ్రహ కూటమి ప్రభావంతో.. ఈ ఏడాది ఖర్చులు విపరీతమవుతాయి. శత్రువులు పెరుగుతారు. మానసిక ఆందోళనతో ఇబ్బందిపడతారు. ముఖ్యంగా.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వృషభరాశి వారికి.. కుబేర యోగాన్ని అందిస్తోంది ఈ గ్రహ కూటమి. వీరికి.. జాక్‌పాట్ ఫలితాలు ఉంటాయని.. అన్ని వ్యవహారాల్లోనూ అనుకూలతలు ఏర్పడతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అటు లాభమూ కాదు.. ఇటు నష్టమూ కాదు. మధ్యస్థ ఫలితాలు ఉంటాయంటున్నారు.
కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలు
కర్కాటక రాశివారికి కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ ఏడాది అంతా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వీరు.. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలని చెబుతున్నారు. కన్యా రాశి వారికి సాధారణ ఫలితాలే ఉంటాయి. వారు.. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావంతో.. తులా రాశి వారి జాతకమే మారిపోనుంది. వాళ్లకు రాజయోగం పడుతుందని చెబుతున్నారు. నక్క తోక తొక్కినట్లుగా, ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా.. విశేషమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి వారికి సొంత నిర్ణయాలు కలిసి రావనే మాట
ఇక.. వృశ్చిక రాశి వారికి బుద్ధి బలం మందగిస్తుందని.. సొంత నిర్ణయాలు పెద్దగా కలిసి రావని చెబుతున్నారు. వారు ఈ ఏడాది చేపట్టబోయే కొత్త పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయంటున్నారు. ఇక.. ధనుస్సు రాశి వారికి ప్రతికూల పరిస్థితులే ఎదురుకానున్నాయి. విద్య, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ప్రతికూల ఫలితాలున్నాయి. మకర రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని.. విశేషమైన శుభ ఫలితాలు పొందుతారని చెబుతున్నారు. ఇక.. కుంభరాశి వారి పనులు ఆలస్యంగా జరగడమే కాకుండా.. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక.. షష్ట గ్రహ కూటమి ఏర్పడుతున్న మీనరాశి వారిపై.. ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు తీసుకునే ప్రతి నిర్ణయం, ఒకటికి రెండు సార్లు ఆలోచించి.. ఇతరులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. లేకపోతే.. ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మానవులకు ఎలాంటి ప్రమాదం లేదంటున్న హేతువాదులు
మరోవైపు.. షష్ట గ్రహ కూటమి వల్ల మానవులకు ఎలాంటి ప్రమాదం లేదని హేతువాదులు చెబుతున్నారు. ఇదంతా.. ఖగోళంలో సాధారణంగా జరిగేదేనని.. దాని ప్రభావం భూమిపై గానీ, మనుషులపై గానీ ఉండదని అంటున్నారు. అయితే.. ఇలాంటి గ్రహ కూటములు అరుదుగా ఏర్పడుతుంటాయని.. వాటి వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతాయనేది అంచనా వేయడం కష్టమనే వాదనలు కూడా ఉన్నాయి. ఒక వేళ ప్రభావం చూపినా.. 20 శాతం వరకు మాత్రమే మానవులపై ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. ఆయా రాశుల వారికి గ్రహ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి.. వారి గోచార ఫలితాల్లో మార్పు ఉంటుందే తప్ప.. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేది ఇంకొందరి పండితుల మాట. ఈ షష్ట గ్రహ కూటమి వలన.. మంచి జరిగినా, చెడు జరిగినా.. ఏదైనా నామమాత్రంగానే ఉంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్.