Shashtipoorthi: జ్యోతిష్య శాస్త్రం, పరాశరుడి వింశోత్తరి మనిషి ఆయుః ప్రమాణాన్ని 120 ఏళ్లుగా ప్రస్తావించాయి. నవ గ్రహాలకివున్న దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు కనుక మునులు దీనిని ఇలా నిర్ణయించారు. ఇందులో సగం పూర్తి కాగానే.. తన మిగిలిన జీవితం శాంతిగా, ధర్మయుతంగా, అపమృత్యువు పాలవ్వకుండా జీవించేందుకు అవసరమైన శక్తిని ఇవ్వమని భగవంతుని కోరుతూ జరిపే శాంతి ప్రక్రియనే నేడు మనం షష్టిపూర్తి అంటున్నాం.
మనిషి వయసు 59 పూర్తయి, 60లోకి అడుగుపెట్టగానే.. ‘ఉగ్రరధ’ అనే మృత్యుపీడ పీడిస్తుందట. అందుకే ఈ షష్టిపూర్తి వేడుక పుట్టిందని చెబుతారు. అలాగే.. 69 దాటి.. 70వ ఏడాదిలో అడుగుపెట్టగానే ‘భీమరధ’ అనే మృత్యు పీడ వేధిస్తుందనీ, దీనికీ షష్టి పూర్తి వంటి శాంతి ప్రక్రియ ఉంది. అయితే..దీనిని అందరూ జరుపుకోవటం లేదు.
ఇది కూడా దాటి.. 84 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేసుకున్నవారికి సహస్ర చంద్రదర్శనం (1000 పౌర్ణమిలు చూశారని అర్థం) అనే భారీ శాంతి ఉత్సవం కూడా చేస్తారు. ఈ వేడుకలన్నీ ఆయా వయసుల్లో వచ్చే మృత్యుపీడలు పోయి ఆరోగ్యంగా వుండాలనే ఉద్దేశ్యంతో చేసేవి.
ఈ రోజుల్లో చాలామంది తమ సంపదను చాటుకోవటానికి, గొప్పదనాన్ని ప్రకటించుకోవటానికి షష్టిపూర్తి వేడుకను జరుపుకుంటున్నారు గానీ.. నిజానికి ఇది ‘థాంక్స్ గివింగ్ డే’ వంటిది. తన 60 ఏళ్ల జీవితంలో తనను ఆదరించిన, ఆదుకున్న మనుషులను, చదువు చెప్పిన గురువులను గుర్తుంచుకుని వారికి తనవంతుగా మనిషి సాయం చేయటమే దీని పరమార్థమని పెద్దల భావన.
అలాగే.. తన జీవితంలో మెజారిటీ బాధ్యతలు ఆ సమయానిక తీరిపోతాయి.. కనుక తమ మిగిలిన జీవితాన్ని సమాజ హితానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు కేటాయించటానికి అతడిని మానసికంగా సిద్ధం చేయాలనే ఉద్దేశమూ ఈ వేడుక వెనక ఉంది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. గడచిన జీవితం కంటే.. రాబోయే జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవటానికి తగిన ఆలోచనతో సిద్ధం అయ్యేందుకు ఏర్పాటు చేసిన వేడుకే.. షష్టిపూర్తి.