BigTV English

Dhanurmasam : ముక్తిని ప్రసాదించే ధనుర్మాసం..!

Dhanurmasam : ముక్తిని ప్రసాదించే ధనుర్మాసం..!
Dhanurmasam

Dhanurmasam : సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అంటారు. దక్షిణాయంలో ఇది చివరి మాసం. డిసెంబరు 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13న ముగుస్తుంది. సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణము అంటారు. సరిగ్గా నేటికి నెల తర్వాత సూర్యుడు జనవరి 14న మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజే మకర సంక్రాంతి.


ఒక సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఆయనములుంటాయి. దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. అలాగే.. ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు సమయం. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది.

విష్ణువు ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో శ్రీమహా విష్ణువును మధుసూదనుడిగా కొలుస్తారు. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని, తర్వాతి 15 రోజులూ దద్యోజనాన్ని స్వామికి నివేదిస్తారు. ఇక.. నేటి వేకువజాము నుంచే హరిదాసులు హరినామ స్మరణతో ఇంటింటికీ వచ్చి.. భక్తులిచ్చే ధాన్యాన్ని స్వీకరిస్తారు. హరిదాసును సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా భావిస్తారు.


ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు సాయంత్రం రంగవల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించడం ఆనవాయితీ. మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూఉన్న గొబ్బెమ్మలను గోపికలు గాను భావించి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు. ఈ విధంగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల పెళ్లి కాని కన్యలకు త్వరలోనే మంచి భర్త లభిస్తాడని చెబుతారు.

ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది గోదాదేవి. ఈమెకే ఆండాళ్ అనే పేరు కూడా ఉంది. ఈమె పరమ విష్ణు భక్తుడైన విష్ణుచిత్తుడనే పండితుడికి పూలతోటలో చిన్నారి శిశువుగా కనిపిస్తుంది. పిల్లలు లేని విష్ణు చిత్తుడు.. సాక్షాత్ స్వామి వరప్రసాదంగా భావించి ఆ చిన్నారిని పెంచి పెద్ద చేస్తాడు. బాల్యం నుంచి ఈమెకూ విష్ణు భక్తి అబ్బటం, యుక్త వయస్సుకు వచ్చేనాటికి సాక్షాత్ శ్రీరంగంలో కొలువైన రంగ నాథుడినే వివాహమాడాలని భావిస్తుంది. తిరుప్పావై వ్రతాన్ని ఆరంభించి.. రంగనాథుని ఉద్దేశించి రోజుకో చిన్న గీతాన్ని రచించి నెలరోజుల పాటు మొత్తం 30 గానం చేసింది. ఈ గీతాలనే పాశురాలు అంటారు.

వీటిలో తొలి 5 పాశురాలు.. ఉపోద్ఘాతం, తిరుప్పావై ప్రాముఖ్యతను, తర్వాతి 10 పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి పూజలకు సిద్ధమైన రీతిని, తర్వాతి 5.. ఆమె దేవాలయ సందర్శనను, సుప్రభాతాన్ని వివరిస్తాయి. చివరి 9 పాశురాలు భగవంతుని మహిమను చెబుతాయి. చివరి పాశురంలో గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి విష్ణువు ఆశీర్వాదం లభిస్తుందని చెబుతుంది.

ధనుర్మాసం చివరి రోజు ముందు రాత్రి.. విష్ణుచిత్తుడికి శ్రీ రంగనాథుడు కలలో కనిపించి గోదాదేవిని సాలంకృతంగా తనకు కన్యాదానం చేయమని ఆదేశిస్తాడు. స్వామి ఆదేశం, కుమార్తె కోరిక మేరకు విష్ణుచిత్తుడు.. ఆమెను అందరి సమక్షంలో రంగనాథుడికి కన్యాదానం చేసి వివాహం జరిపిస్తాడు. వివాహం పూర్తి కాగానే ఆమె రంగనాథునిలో ఐక్యమైపోతుంది.

ఈ ధనుర్మాసం అంతా భక్తులు వేకువజామునే స్నానాలు చేసి.. విష్ణువు ఆలయానికి వెళ్లి.. సుప్రభాత సేవకి బదులుగా చేసే తిరుప్పావై సేవలో పాల్గొంటారు. తిరుమలలోనూ ఈ నెల రోజులు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై సాగుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదా రంగనాథుల కళ్యాణంతో స్వామి ఆరాధన ముగుస్తుంది.

ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆవు పాలు, కొబ్బరి నీళ్లు మొదలగు పంచామృతాలతో అభిషేకిస్తే.. స్వామి అనంతమైన కటాక్షానికి పాత్రులవుతారని మన పురాణాలు చెబుతున్నాయి.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×