Simhadri Appanna: ఏడాదికి ఒక్కరోజే నిజరూప దర్శనం.. వైభవోపేతంగా జరిగే చందనోత్సవం.. తన పేరు కాకుండా భక్తుడి పేరుతో దర్శనం ఇస్తున్న వరాహ నారసింహుడు. ఇంకా ఎన్నో ప్రత్యేకలు కలిగిన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఈ నెల 30న జరగనుంది. అసలు చందనోత్సవానికి ఉన్న ప్రత్యేకతను ఈ కథనంలో తెలుసుకుందాం.
భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవానికి వేలయింది. ఈ నెల 30న అంగరంగవైభవంగా స్వామి వారి చందనోత్సవం జరగనుంది. ఇక నిజరూప దర్శనం రోజు రాత్రి ఒంటిగంటకు సుప్రబాత సేవతో స్వామిని మేల్కోలిపి ప్రత్యేక పూజలు చేస్తారు పండితులు. తర్వాత స్వామి వారి దేహంపై ఉన్న చందన్నాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత రెండున్నర గంటల నుంచి సాదారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ దర్శనం కోసం భక్తులు ముందు రోజు నుంచే క్యూ లైన్లలో వేచి ఉంటారు.
ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు జరిగే తొలి విడత చందనోత్సవానికి కావాల్సిన జాజి పోకల అనే మేలిరకం గంధపుచెక్కలను తమిళనాడులోని తంజావూరు నుంచి తెప్పిస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గంధపు చెక్కలను అరగదీసేందుకు ఆలయ వైదికులు ముహూర్తం నిర్ణయిస్తారు. అలా వైదికులు నిర్ణయించిన ముహూర్తం రోజు ఉదయమే గంధపు చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు తొలి గంధపు చెక్కను అరగదీస్తారు. తొలి విడతలో 125 కిలోల చందనాన్ని అరగదీసి స్వామి వారికి సమర్పిస్తారు. తర్వాత వైశాఖ, జేష్ట, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా చందన్నాని స్వామి వారికి సమర్పిస్తారు. ఇలా సంవత్సరంలో నాలుగు సార్లు మొత్తం ఐదు వందల కిలోల చందనాన్ని స్వామి వారికి సమర్పిస్తారు. ఇక స్వామికి వారికి వలిచిన చందనాన్ని చిన్న ప్యాకెట్ల రూపంలో భక్తులకు ప్రసాదం ఇస్తారు. అయితే ఈ చందనోత్సవంలో పాల్గొనేందుకు గందపు చెక్కలను అరగదీసేందకు ఆలయ సిబ్బందితో పాటు కొంత మంది భక్తులకు కూడా అవకాశం ఇస్తారు. అందుకోసం నెల ముందుగానే భక్తులు ఆలయంలో అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
అయితే స్వామి వారికి చందనోత్సవం ఎందుకు జరిపిస్తారనే విషయం కూడా ఆలయ పురోహితులు తెలిపారు. పురాణాల ప్రకారం పురూరవ చక్రవర్తి ఆకాశ మార్గంలో వెళుతూ సింహాచలం కొండ మీదకు వచ్చినప్పుడు ఆయనకు పుట్ట మట్టి ఆకారంలో పన్నెండు అడుగుల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిస్తాడు. అక్కడే ఆలయాన్ని నిర్మించి పుట్టను తొలగించిన వైశాఖ తదియ రోజే పన్నెండు మడుగుల చందనాన్ని సమర్పిస్తారు. అలాగే నరసింహ స్వామి ఉగ్రస్వరూపం కాబట్టి ఆయనను శాంతింపజేయడానికి చందనం పూస్తారని మరి కొందరు చెప్తారు.
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి సింహాద్రి అప్పన్నగా మారిపోవడానికి ఒక కారణం ఉందంటున్నారు పండితులు. స్వామి వారి గుడిని నిర్మించిన శిల్పి అప్పనాచార్యుల పేరు మీద స్వామి వారిని అప్పన్నగా పిలుస్తారని ఇలా గుడిని.. గుడిలో దేవుడిని ఒక శిల్పి పేరు మీద పిలిచే ఆలయం ప్రపంచంలో మరోకటి లేదంటారు. అప్పన్న చందనోత్సవం యాత్ర సందర్భంగా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది, ఏడాదికి ఒక్కరోజు మాత్రమే కనిపించే స్వామివారి నిజరూప దర్శనం కోసం అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు, ఈ ఏడాది రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కూటమి ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా 2000 మంది పోలీసులుతో అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది, దేవాదాయ , రెవెన్యూ , హోం శాఖ మంత్రుల సమన్వయంతో ఏర్పాట్లను మంత్రుల పర్యవేక్షిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు సతీసమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు సమాచారం.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?