Karmas:కర్మసిద్దాంతం అంటే ఏమిటి..? పుట్టిన ప్రతి జీవి తాను చేసుకున్న కర్మలను అనుభవించి తీరాల్సిందేనా..? అసలు కర్మలు ఎన్ని రకాలు..? అవి మనిషిని ఏ విధంగా వెంటాడతాయి..? జీవి చేసే కర్మలను ఎవరు లెక్కిస్తారు..? ఎవరు శిక్షిస్తారు..? కాలం లెక్కిస్తుందా..? కర్మ శిక్షిస్తుందా..? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. చేసిన ప్రతి కర్మకు ఫలితము అనుభవిస్తూనే ఉంటాడు. ఈ ఫలితాలనే కర్మ ఫలితాలు అంటారు. ఈ కర్మ ఫలితాలు మనిషి వెంటే అనేక జన్మలలో ప్రయాణిస్తూ ఉంటాయి. జీవుల పుణ్య కర్మలు పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి భూమి మీద పుడుతుంటారు. అలాగే పాప కర్మలు పక్వానికి వచ్చినప్పుడు భూమి మీద ఏదో ఒక రూపంలో పుట్టి వాటిని అనుభవించి తీరాల్సిందే.
అయితే భూమ్మీద పుట్టిన ఏ జీవికైనా శరీరం, మనసు ఉంటాయి కానీ బుద్ది ఉండదు. ఈ భూమ్మీద పుట్టిన ఏకైక జీవి మనిషికి మాత్రమే శరీరం, మనసుతో పాటు బుద్ది కూడా ఉంటుంది. కాబట్టి మనిషి జన్మలోనే పాప, పుణ్య కర్మలను అనుభవించడంతో పాటు కొత్త కర్మలు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆదిశంకరాచార్యులు కూడా వివేక చూడామణిలో “జంతూనాం నర జన్మ దుర్లభం” అన్నారు. అంటే అన్ని జన్మలలో కెల్లా మానవ జన్మ ఉత్తమమైనది, దుర్లభమైనది అని అర్థం.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
మనం చేసే ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు. అందులో మొదటివి అగామి కర్మలు, రెండోవి సంచిత కర్మలు, మూడోవి ప్రారబ్ద కర్మలు.
అగామి కర్మలు: మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది. నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఎవరినైనా తిడితే వాడు బలం కలవాడు అయితే తిరిగి కొడతాడు. అది కర్మ ఫలం. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాలను ఇచ్చి శాంతిస్తాయి. అలా శాంతించే కర్మలనే ఆగామి కర్మలు అంటారు.
సంచిత కర్మలు: కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఉదాహరణకి ఒక చెట్టును నాటడం, ఒక చెరువు త్రవ్వించటం, ఒక పాఠశాల కట్టడం, దాన ధర్మాలు చెయ్యడం, ఒకడిని పరోక్షంగా దూషించడం లాంటివి. ఇలాంటి కర్మలు అదే జన్మలో ఫలితాన్ని ఇవ్వవ్వు. అవి మరో జన్మలో ఫలితాన్ని ఇస్తాయి. ఒక జన్మ నుంచి మరో జన్మకు మోసుకు వచ్చే కర్మలనే సంచిత కర్మలు అంటారు. ఒక శరీరంతో చేసే పనులకు చెందిన ఫలితాను మరో శరీరంతో అనుభవించడం అన్నమాట. అవి మంచి కావొచ్చు.. చెడు కావొచ్చు.
ప్రారబ్ద కర్మలు: ఒక జీవుడు చేసిన కర్మలను అనుభవించడానికే జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అటువంటి కర్మలనే ప్రారబ్ద కర్మలు అంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక జన్మలో ఒక కుక్కనో పిల్లినో కొట్టి ఉంటే సేమ్ అలాగే ఆ కుక్కతోనో పిల్లితోనో కొట్టించుకోవడానికి ఆ జీవి మళ్లీ కుక్కగానో పిల్లిగానో జన్మ ఎత్తాలి. ఆ ఎత్తిన జన్మలో అనుభవించేవే ప్రారబ్ద కర్మలు. ఈ ప్రారబ్ద కర్మలు అనుభవించే దాకా ఆ జీవి ఆ శరీరంతోనే ఉండాలి. ఈ సయయంలో చేసే మరికొన్ని కర్మలు మాత్రం సంచిత కర్మలలో చేరిపోతాయి.
ఇలా తమ కర్మలను అనుభవించడానికే జీవులు మళ్లీ జన్మ ఎత్తుతుంటాయి. గీతలో కృష్ణుడు చెప్పినట్టు వేల మందిలో కొందరు మాత్రమే దైవాన్ని అన్వేషించి చివరకు మోక్షాన్ని పొందుతారు. మిగిలిన వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే. “పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం” ఇక జీవి చేసే ప్రతి కర్మను కాలం లెక్కిస్తుంది. టైం వచ్చినప్పుడు ఆ జీవి చేసిన కర్మలను అనుభవించేలా కాలమే చేస్తుంది. ఆ కర్మలే మనిషి చేసిన మంచి చెడులను తిరిగి ఇస్తుంటాయి.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?