NAVAGRAHA POOJA: ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటాడు. వివిధ సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారిని గ్రహ బాధలు పట్టి పీడిస్తుంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తుంటారు. అయితే గ్రహబాధల నుంచి బయట పడేందుకు జపాలు, తపాలు, పూజలు చేయమంటారు. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. కొన్ని సందర్భాలలో లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సి వస్తుంది. అయితే వేలకు వేలు ఖర్చు పెట్టలేని మధ్య తరగతి వారి కోసమే పరిహార శాస్త్రంలో సింపుల్ రెమిడీస్ ఈ కథనంలో తెలుసుకుందాం.
సూర్యుడు: ఎవరి జాతకం చక్రంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు ఎదుర్కొంటారట. ఇలాంటి వారు సమస్యల పరిహారం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం. ఆదిత్య హృదయం పారాయణ చేయటం. అలాగే గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయాలట.
మంత్రం: రవి గ్రహ అనుగ్రహం కోసం ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః అనే బీజ మంత్రాన్ని ఉదయం వేళలో జపించాలట.
చంద్రుడు: జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగాలే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టక పోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు ఏర్పడతాయట. ఈ సమస్యల పరిష్కారం కోసం బియ్యం దానం చేయుట. పాలు, మజ్జిగ చిన్నపిల్లలకు పంచి పెట్టాలట. అలాగే శివునికి అవుపాలతో అభిషేకం చేయించాలట.
చంద్ర మంత్రం: ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః అనే బీజ మంత్రాన్ని సంధ్యా సమయంలో జపించాలట.
కుజుడు: జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేకపోవుట, అన్నదమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి లాంటి సమస్యలు ఎదుర్కోంటారట. కుజ గ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. కందులు దానం చేయడం, పగడం, ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండటం లాంటి పరిహారాలు చేయాలట.
కుజమంత్రం: ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః అనే మంత్రాన్ని ప్రతి రోజు రెండు గంటల పాటు జపించాలట.
బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించాలని పండితులు చెప్తున్నారు. అయితే బుధ గ్రహా అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామిని, విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. అలాగే ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇవ్వాలట.
బుధమంత్రం: బుధ గ్రహ అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం భ్రౌం సః బుధాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 5 గంటల పాటు జపించాలట.
గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేకపోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు గురు గ్రహం దోషంగా గుర్తించాలట. గురు గ్రహం అనుగ్రహం కోసం గురు చరిత్ర పారాయణ చేయుట. దైవ క్షేత్రములు సందర్శించడం. శనగలు దానం చేయడం. పంచముఖి రుద్రాక్ష ధారణ చేయడం. కనక పుష్కరాగం ధరించాలి.
గురుమంత్రం: గురు గ్రహ అనుగ్రహం కోసం ఓం గ్రా౦ గ్రీం గ్రౌం సః గురవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో జపించాలట.
శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనముల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చేయుట, స్ర్తీలను గౌరవించుట. సప్తముఖి రుద్రాక్షను ధరించాలి.
శుక్రమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో జపించాలి.
శని: ఆయు కారకుడు అయిన శని దేవుడు జాతకంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకునికి బద్దకము, అతినిద్ర, దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట లాంటి సమస్యలు ఉంటాయి. శని గ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయాలి. ఆంజనేయస్వామిని ఆరాధించాలి. హనుమాన్ చాలిసా పారాయణం చేయాలి.
శని మంత్రం: ఓం ప్రాం ప్రీం ప్రౌంసః శనైశ్చరాయ నమః అనే బీజ మంత్రాన్ని ప్రతి రోజు సాయంత్రం పూట జపించాలట.
రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కుష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవించడం. విద్యార్థులు విద్య మధ్యలో మానివేయడం. లాంటి సమస్యలు వస్తాయి. ఈ దోష నివారణకు కనక దుర్గ అమ్మవారిని పూజించాలి. దేవి భాగవతం పారాయణం చేయాలి. ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను ధరించాలి.
రాహువు మంత్రం: ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః అనే బీజ మంత్రాన్ని రాత్రి సమయంలో జపిచాలి.
కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తనలో తానే ఊహించుకొనుట, తనని తాను దేవుడిగానో.. దేవతగానో ఊహించుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి. ఈ గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయుట. ఆలయాల నిర్మాణానికి విరాళములు ఇవ్వాలి. పిచ్చి ఆస్పత్రిలో రోగులకు సేవలు చేయాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి.
కేతు మంత్రం: ఓం స్త్రాం స్త్రీం సౌం సః కేతవేనమః అనే బీజ మంత్రాన్ని రాత్రి సమయంలో జపించాలి.
ఇలా ఏసమస్య ఉందో తెలుసుకుని ఆ సమస్యకు కారణమైన గ్రహానికి సంబంధింయిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానం చేసుకుని దగ్గరలో ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడం. ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం లాంటి చేయడం వల్ల కూడా ఎటువంటి గ్రహదోషాలు దగ్గరకు రావట.