Sankatahara Chaturthi: వినాయకచవితి ఏడాదికి ఒకసారి వస్తే.. ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. అంటే ఇది మాస వినాయకచవితి అన్నట్టు. ఈ చవితి మంగళవారం రోజున వస్తే.. దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున గణపతిని పూజిస్తే.. కష్టాలు తీరి.. ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అంతేకాదు జీవితంలో ఉన్న సమస్యలు కూడా పోయి.. విముక్తి లభిస్తుందని భావిస్తారు.
ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే సంకటహర చతుర్థికి విశేషస్థానం ఉంది. ఈ ఏడాది శ్రావణమాసంలో సంకటహర చతుర్థిరోజున మూడు యోగాలు ఏర్పడనున్నాయి. అవే సిద్ధియోగం, రవియోగం, సర్వార్థ సిద్ధియోగం.
ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 1.46 గంటలకు మొదలై ఆగస్టు 23వ తేదీ ఉదయం 10.39 గంటలకు ముగుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం నుంచి వచ్చే తిథి లెక్కకాదు. ఉదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే ఆ రోజు తిథిగా పరిగణిస్తారు.
Also Read : శత్రువులను చెండాడే ధీరుడు.. అభిమన్యుడు.. దుశ్శాశనుడి చేతిలో మరణం ఎలా ?
సంకటహర చతుర్థినాడు గణేషుడిని పూజించినవారికి సర్వార్థ సిద్ధియోగం కలుగుతుంది. ఆ సమయంలో ఉపవాసం, పూజలు చేయడంతో ఆ ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. దర్భలతో వినాయకుడిని పూజించి.. మోదకాలు, లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తే.. కష్టాలు తొలగుతాయని నమ్ముతారు. ఓం గణ గణపత్తే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి పూజిస్తే.. ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి.
అంతేకాదు.. సంకటహర చతుర్థినాడు శమీవృక్షాన్ని పూజించడం మంచిది. జమ్మి ఆకుల్ని తెచ్చి.. గణేషుడి వద్ద ఉంచి పూజిస్తే.. దుఃఖాలు, కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తీరాలంటే.. నాలుగు దీపాలను వెలిగించి గణపతిని పూజించాలి.