TDP strategy to defeat Botsa Satyanarayana in Visakha MLC Election 2024: ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం.
స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అరకు, పాడేరు నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల చేరికలే టార్గెట్ గా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
Also Read: కడపలో కబ్జాలు.. కదులుతున్న వైసీపీ కూసాలు
టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జి, పీల గోవిందు, కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరో ఆరుగురి పేర్లను పల్లా శ్రీనివాస్.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ అర్థికంగా బలమైన నేత.. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవిందుని అభ్యర్థిగా ప్రకటించేందుకు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమవాళ్లను కాపుడుకునే పనిలో వైసీపీ నేతలు బిజీ అయ్యారు. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకునేందుకు కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.