Chilkur Balaji Temple: రంగారెడ్డి జిల్లా చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్(CS Rangarajan)పై దుండగులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ ఆయనపై కొంత మంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. రంగరాజన్ కు కాల్ చేసి మాట్లాడారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
వీఐపీ దర్శనాలు, హుండీలు లేని ఏకైక దేవాలయం
కాసేపు రంగరాజన్ పై దాడి విషయాన్ని పక్కన పెడితే.. చిల్కూరు బాలాజీ ఆలయానికి(Chilkur Balaji Temple) ఎంతో ఘన చరిత్ర ఉన్నది. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది ఈ ఆలయం. నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. చిల్కూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ నుంచి 25 కి.మీ దూరంలో ఉంటుంది. వికారాబాద్ వెళ్లే మార్గంలో మొయినాబాద్ మండలంలో ఉంటుంది. హైదరాబాద్ కు దగ్గరలో ఉండటంతో స్వామి వారిని దర్శించుకునేందుకు రోజూ సుమారు 20 వేల మంది భక్తులు తరలివస్తారు. శుక్ర, శనివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. వీఐపీ దర్శనలు, హుండీలు, టికెట్లు లేని ఏకైక దేవాలయంగా చిల్కూరు బాలాజీ ఆలయానికి గుర్తింపు ఉంది. ఒకే ప్రాంగణంలో ఓవైపు వేంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకుంటాడు. ఇక ఈ ఆలయంలో 118 ప్రదక్షిణలు అనేవి చాలా ప్రత్యేకం. ముందుగా స్వామి వారిని 11 ప్రదక్షిణలు చేసుకుని కోరికలు కోరుకుంటారు. అవి నెరవేరితే వచ్చి 118 ప్రదక్షిణలు చేస్తారు.
వీసాల స్వామిగా ప్రత్యేక గుర్తింపు
చిల్కూరు బాలాజీ ఆలయంలోని శ్రీవేంకటేశ్వరుడికి వీసాల స్వామి (Visa Balaji)గా గుర్తింపు ఉంది. విదేశాల్లో చదువుకోవాలని ఆశగా ఉన్నా, చాలా మంది విద్యార్థులకు వీసాలు లభించేవి కాదు. కానీ, చిల్కూరు బాలాజీ మహిమ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేసి వీసా రావాలని కోరుకున్న వారికి వీసాలు లభించాయి. ఆ తర్వాత చాలా మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చి వీసా రావాలని కోరుకుంటే వీసాలు వచ్చేస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే చిల్కూరు బాలాజీని వీసా గాడ్ గా పిలుస్తున్నారు.
చిల్కూరు ఆలయానికి 500 ఏండ్ల చరిత్ర
తెలంగాణ తిరుపతిగా గుర్తింపు తెచ్చుకున్న చిల్కూరు బాలాజీ ఆలయానికి 5 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. తిరుమల శ్రీవేకంటేశ్వర స్వామి పరమ భక్తుడైన గున్నాల మాధవరెడ్డి ప్రతి ఏటా తిరుపతికి వెళ్లి దర్శించుకుని వచ్చేవాడు. ఓసారి తిరుమలకు వెళ్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్వామివారు ఆయన కలలోకి వచ్చి ఇకపై తిరుమలకు రావాల్సిన అవసరం లేదని, చిల్కూరులోని ఓ పుట్టలో కొలువై ఉన్నాను.. అక్కడే ఆలయాన్ని నిర్మించాలని కోరారట. వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న మాధవరెడ్డి తిరిగి వచ్చి గ్రామస్తులతో కలిసి పుట్టను తవ్వుతారు. గడ్డపార బాలాజీ ఎద భాగంలో తగిలి రక్తం వస్తుంది. వెంటనే స్వామి వారిని క్షమాపణలు అడిగి, విగ్రహాన్ని పాలతో కలిగి బయటకు తీస్తారు. అక్కడే బాలాజీ ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎద భాగంలో గడ్డపార తగిలిన ఆనవాళ్లు కనిపిస్తాయి.
Read Also: మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది? భగవద్గీత ఏం చెబుతోంది?