Chilkuru Balaji Rangarajan Case: చిలుకూరు బాలాజి ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డ వీర్ రాఘవ రెడ్డి సామాన్యుడేమి కాదని పోలీసులు తేల్చేశారు. అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడ వైరల్ గా మారాయి. ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హిందూ ధార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు దాడి ఘటనను ఖండించాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడ నిందితులను కఠినంగా శిక్షించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని, ఏకంగా రంగరాజన్ కు ఫోన్ చేసి మరీ పరామర్శించారు.
అయితే రంగరాజన్ పై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డిసిపి మాట్లాడుతూ.. ఈ నెల 8న రంజరాజన్ పై దాడి జరిగిందన్నారు. ఈ కేసులో రామరాజ్యం ఆర్గనైజేషన్ నిర్వహాకుడు వీర్ రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని డీసీపీ తెలిపారు. వీరంతా ఖమ్మం, నిజామాబాద్ కి చెందిన వారని, 2022లో వీర్ రాఘవ రెడ్డి రామ రాజ్యం ను ప్రారంభించారన్నారు.
ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇతర సామాజి మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని, భగవద్గీత శ్లోకాలతో రామ ఆర్మీలో చేరాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని పోస్టులు పెట్టాడన్నారు. సెప్టెబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ చేరే వారికి 20వేల జీతం ఇస్తానని కూడా ప్రచారం చేశాడన్నారు. ఈ ప్రచారానికి స్పందించి వీర్ రాఘవ రెడ్డిని 25 మంది తణుకులో మొదటి సారి కలిశారన్నారు. తణకులో నాలుగు రోజులు ఉన్న అనంతరం కోటప్ప కొండకు వెళ్ళారని, ఒక్కొక్కరికి రూ.2వేలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోమని రాఘవ రెడ్డి వారికి సూచించారన్నారు.
Also Read: CM Revanth Reddy: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్..
యూనిఫామ్ సిద్దమయ్యాక ఈనెల 6న ఏప్రిల్ లో అందరూ కలిశారని, రామరాజ్యం బ్యానర్ తో ఫోటోలు వీడియోలు తీసుకుని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారని డిసిపి వెల్లడించారు. ఈ నెల 7న మూడు వాహానాల్లో చిలుకూరు వచ్చి రంగారాజన్ పై దాడికి పాల్పడ్డారన్నారు. అయితే రంగరాజన్ ఇంట్లోకి చొరబడి డబ్బులతో పాటు టెంపుల్ అప్పగించాలంటూ డిమాండ్ చేశారని, చిత్ర హింసలు పెట్టి దాడి చేసి పారిపోయినట్లు అక్కడి భక్తులు అంటున్నారు. రామరాజ్యం ఆర్మీ కోసం మనుషుల్ని రిక్రూట్ చేయాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారని, రామరాజ్యం పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచి డబ్బులు కూడ డిమాండ్ చేస్తున్నట్లు వీర రాఘవరెడ్డి పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు నడుస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో రాఘవరెడ్డికి చెందిన పలు పాత వీడియోలు వైరల్ గా మారాయి. పోలీసులు ఇప్పటికే రాఘవరెడ్డిని అరెస్ట్ చేయగా, అతని చరిత్ర మొత్తం వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలు దాడిని ఖండించి, దాడికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.