BigTV English

Srikakuleswara Swamy Temple : ఆముక్త మాల్యద పుట్టిన ఆలయం ఇదే..!

Srikakuleswara Swamy Temple : ఆముక్త మాల్యద పుట్టిన ఆలయం ఇదే..!

Sri Srikakuleswara Swamy Temple : ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర మహావిష్ణువు… ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్న అత్యంత మహిమగల దైవం.. శ్రీకాకుళేశ్వరస్వామి. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఆవిర్భవించిన ఈ స్వామి కొలువైన కోవెలకు చారిత్రకంగానూ పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యముంది. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువే.. కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వరుడిగా అవతరించాడని పురాణ కథనం. వైష్ణవులకు అత్యంత పుణ్యప్రదమైన 108 క్షేత్రాల్లో ఇది 57వది.


పురాణ కథనం ప్రకారం.. కలియుగంలో పాపం పెరిగిపోతుందని భయపడిన దేవతలంతా బ్రహ్మతో కలిసి భూలోకానికి వచ్చి.. ఒక ప్రదేశంలో విష్ణువు దర్శనానికై తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షం కాగా..‘ మేం తపస్సు చేసిన ఈ ప్రదేశంలోనే కొలువై భక్తుల పాపాలను హరించాలని’ కోరగా ఆయన సరేనంటాడు. దీంతో బ్రహ్మ.. స్వయంగా శ్రీమహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట.

ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వరుసగా సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్రభాషపై ప్రీతితోనే విష్ణువు ఇక్కడ కొలువు దీరాడని, అందుకే ఆయనను శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువనీ పిలుస్తారు. చారిత్రక కథనాల ప్రకారం.. పాతరోజుల్లో ఇక్కడి కృష్ణానదీ మార్గాన గొప్ప వ్యాపారం జరిగేదని, ఆ దారిన వెళ్లే నావికులు స్వామిని దర్శించుకునేవారనీ, వారి కాలంలో ఈ ఊరిని సిరికొలను, సిరికికొలను అనేవారనీ, అదే.. కాలక్రమంలో శ్రీకాకుళం అయిందని చెబుతారు.


మరోకథనం ప్రకారం.. క్రీ.పూ నాలుగో శతాబ్దం నాటికే ఇక్కడ గుడి ఉండేది. అయితే.. ఓరోజు గుడిలోని మూలమూర్తి కనిపించకుండా పోయింది. వెయ్యేళ్ల తర్వాత ఆ బాటన.. కంచియాత్రకు పోతున్న ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధాని నరసింహవర్మ ఇక్కడ బసచేశాడట. అప్పుడు ఈ మాయమైన విగ్రహం సంగతి విని, అక్కడి గ్రామాలన్నీ వెతకగా.. చివరికి స్వామి అతని కలలో కనిపించి.. వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి పెరడులో ఉన్నానని చెప్పారట. అక్కడ తవ్వగా ఆ విగ్రహం దొరికిందనీ, అదే నేటికీ ఇక్కడ పూజలందుకుంటోంది.

రాజ్యవిస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి, శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని ఆ రాత్రికి అక్కడే బసచేశారు. అయితే.. ఆ రాత్రి స్వామి ఆయనకు కలలో కనిపించి.. తెలుగు కావ్యాన్ని రచించమనగా, ఆలయంలో ఆగ్నేయంగా ఉన్న 16 స్తంభాల మండపంలో కూర్చొని ‘ఆముక్తమాల్యద’ రచన చేశారు. దాంతో ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపం అనే పేరొచ్చింది.

ఈ దేవాలయం గోడలపై 12, 13వ శతాబ్దాల నాటి 30కి పైగా శాసనాలు ఈ ఆలయ చరిత్రను వివరిస్తున్నాయి. ఆలయంలోని స్వామివారి పంచలోహ విగ్రహాన్ని 1205లో బృగుమళ్ల అనంతభోగయ్య చేయించినట్లు ఆ విగ్రహం మీది శాసనం తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్లగా, దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. అందుకే.. నేటికీ చల్లపల్లి జమిందారులైన యార్లగడ్డ వంశీయులే ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

నారాయణతీర్థులవారు ‘శ్రీకృష్ణలీలా తరంగిణి’లో ఇక్కడి ఆంధ్రమహావిష్ణువుని కీర్తించగా, శ్రీనాథ మహాకవి క్రీడాభిరామం గ్రంథంలో ఈక్షేత్ర మహిమనూ, ఇక్కడ జరిగే తిరునాళ్ల వైభవాన్నీ కొనియాడాడు. ఆలయానికి సమీపంలోని కృష్ణానదిలో స్నానమాడి, స్వామిని దర్శిస్తే పాప పరిహారమౌతుందని భక్తుల నమ్మకం. ఏటా వైశాఖమాసంలో ఇక్కడ అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విజయవాడ నుంచి 65 కి.మీ దూరంలోని ఈ క్షేత్రానికి.. కొడాలి మీదుగా పలు బస్సు సర్వీసులున్నాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×