Dattatreya Swamy Temple: చుట్టూ నిండు కుండలాంటి జలాశయం.. మధ్యలో ఆలయం.. సర్పం పడగపై దర్శనమిచ్చే స్వామివారు.. 400 ఏళ్లనాటి చరిత్ర.. ఆలయానికి చేరుకోవాలంటే బోటులో షికారు చేయాల్సిందే.. దేశంలో మరెక్కడా లేని అరుదైన దత్తాత్రేయుని ఆలయం.. ఒకప్పుడు గ్రామం నడిబొడ్డులో ఉన్న ఆలయం ఇప్పుడు నిండు కుండలాంటి ప్రాజెక్ట్ జలాశయంలో దర్శనమిస్తోంది. ఇంతకీ అక్కడి గ్రామం ఏమైంది? ఆలయం జలాశయంలో ఎందుకు దర్శనమిస్తోంది.? ఇప్పుడు చూద్దాం..
ఓ వైపు ప్రకృతి రమణీయం.. మరో వైపు ఆధ్యాత్మిక వాతావరణం.. నిండు కుండలాంటి నీటి గర్భంలో దత్తాత్రేయుని ఆలయం.. మరెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, వరదవెల్లిలో ఉంది. ఇక్కడ కొలువైన దత్తాత్రేయ స్వామి ప్రత్యేకతలెన్నో.. కొండపై 400 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిసారు దత్తాత్రేయ స్వామి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. రాహు, కేతు, శని అవతారాల్లో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇలాంటి ఆలయాలు భారత్‌లో అరుదుగా ఉంటాయి. మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో స్వామివారు నిద్రించి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
ఇంతకీ గ్రామం నడిబొడ్డున కొలువైన దత్తాత్రేయుని ఆలయం నీటి గర్భంలోకి ఎందుకు మారింది? ఇక్కడి వరదవెల్లి గ్రామం ఏమైంది? కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వరదవెల్లిలో అందరూ వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. స్థానికులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈ గ్రామం మిడ్ మానేరు క్రింద పూర్తిగా మునిగిపోయింది. గ్రామంతో పాటు భూములన్నీ ముంపుకు గురయ్యాయి.
స్వామివారు కొండపై కొలువై ఉండటంతో ముంపు నుంచి బయటపడ్డారు. దీంతో ఇక్కడి గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. గ్రామస్తులు తీర ప్రాంతానికి చేరిపోయి.. ఆలయం నీటిలో మిగిలిపోయింది. ఆలయం చుట్టూ నీరు ఉండటంతో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి బోట్ల సాయం తప్పనిసరిగా మారింది. అలా కాకుండా సాధారణంగా స్వామివారిని దర్శించుకోవాలంటే.. నీరు తగ్గినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది.
Also Read: ఈ విశేషమైన రోజుల్లో ఈ నిబంధనలు తప్పనిసరి.. తెలుసుకుంటే దర్శనం సులభం
ప్రస్తుతం ఆలయం చుట్టూ నీరు చేరి ఉండటంతో.. భక్తులు ఆలయానికి చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల ప్రభుత్వం ఆలయానికి మూడు బోట్లను ఏర్పాటు చేసింది. దీంతో బోట్ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కాస్త భయం అనిపిస్తున్నప్పటికీ.. స్వామి నామస్మరణతో బోట్‌లో ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్వామివారి జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే.. ఆలయం చుట్టూ భారీగా నీరు ఉండటంతో ప్రాణభయం ఉన్నప్పటికీ.. స్వామివారి దర్శనం కోసం సాహసం చేస్తూనే ఆలయానికి చేరుకుంటున్నట్టు భక్తులు తెలుపుతున్నారు. ప్రభుత్వం బోట్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ.. స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే, ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే స్వామివారి దర్శనానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని.. ప్రభుత్వం చొరవ చూపి భక్తుల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.
స్వామివారు నిద్రించి కనపడటం.. నీటి గర్భంలో.. ప్రకృతి రమణీయంతో.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలాంటి 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం దేశంలో మరెక్కడా లేదని పురోహితులు తెలుపుతున్నారు. చూశారుగా.. దేశంలోనే మరెక్కడా లేని దత్తాత్రేయుని అరుదైన ఆలయం.. చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి ఆలయాల అభివృద్ధి జరిపి.. తగిన గుర్తింపు తీసుకొస్తే టెంపుల్ టూరిజం అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, భక్తులకు సౌకర్యం కూడా ఏర్పడుతుంది. పరిపాలనలో మార్పు చూపిస్తూ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పురాతన ఆలయాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని కోరుకుందాం.