YCP Jogi Ramesh – TDP Leaders: రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు.. మిత్రులు కూడా ఉండరని చెబుతుంటారు. అదే ఇది.. ఇదే అది. మొన్నటి వరకు ఆ నేత అంటే టీడీపీ శ్రేణులకు కోపతాపాలు ఎక్కువే. కానీ ఉన్నట్లుండి ఆ నేతతో జతకట్టి తిరిగారు టీడీపీ నాయకులు. నాయకులు అంటే నాయకులు కాదండీ.. ఏకంగా టీడీపీ ఎమ్మేల్యేలు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ కాలంలో మంత్రి హోదాలో గల ఈ నేత ఇప్పుడు పొలిటికల్ టాక్ ఆఫ్ ది టాపిక్ గా నిలిచారు. అసలు ఆ నేత సంగతి ఏంటో తేల్చాలని మంత్రి నారా లోకేష్ కూడా ఆదేశించారట.
జోగి రమేష్ అంటే తెలియని ఎవరూ ఉండరు. ఈయన వైసీపీ హయాంలో మంత్రిగా కూడా కొనసాగారు. అంతేకాదు ఏకంగా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడింది కూడా ఈయనేనంటూ.. ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈయన పేరెత్తితే చాలు, టీడీపీ అధినాయకత్వం గుర్రుమనేది. మొన్నటి వరకు జోగి రమేష్ అంటే కథ ఇలా ఉండేది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందట.
నిన్న నూజివీడులో జరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు జోగి రమేష్ కూడా అక్కడ కనిపించారు. అసలే జోగి రమేష్ పేరెత్తితే భగ్గుమనే టీడీపీ నేతల వెంట జోగి రమేష్ పాల్గొనడం ఇప్పుడు టీడీపీ అధినాయకత్వానికి అంతగా రుచించడం లేదట. ఈ విషయం చిన్నగా నారా లోకేష్ దృష్టికి కూడా పోగా, అసలు ఏం జరిగింది? ఎందుకు జోగి రమేష్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే విషయాలను లోకేష్ ఆరా తీస్తున్నారట.
ఇటీవల వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే జోగి రమేష్ కూడా టీడీపీలో చేరడం ఖాయమని, అందుకే ఎమ్మేల్యేల వెంట ఉన్నారని వదంతులు వ్యాపించాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జోగి రమేష్ మాట.. తూటాలేనని చెప్పవచ్చు. అటువంటి రమేష్ ను పార్టీలోకి తీసుకుంటారని వదంతులు వ్యాపించడంపై టీడీపీ అధినాయకత్వం సీరియస్ అయిందట. ఇంతకు జోగి రమేష్ పార్టీ మారితే, వైసీపీకి షాక్ ఏమోగానీ, టీడీపీ క్యాడర్ కి మాత్రం భారీ షాక్ అని చెప్పవచ్చు.