Hidden Temple: సముద్ర గర్భంలో దాగి ఉండే మాయా దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..? ఆ ఆలయం యెక్క రహస్యాలు ఏంటో తెలుసా..? అలాంటి విలక్షణమైన రహస్యమైన ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది. దాని విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ వరకు కన్యాకుమారి వరకు ఏ ఆలయానికి ఆ ఆలయం ఏదో ఒక స్పెషాలిటి కలిగి ఉంటాయి. అలాంటి కోవలేకే వస్తుంది గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఉన్న స్థంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన, రహస్యమయమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ గుడికి ఉన్న ప్రత్యేకత రోజుకు రెండు సార్లు మాయం అవ్వడం.
రోజుకు రెండు సార్లు మాయమయ్యే ఆలయం: ఈ ఆలయం యొక్క ప్రధాన విశిష్టత ఏమిటంటే ఇది రోజుకు రెండుసార్లు భక్తుల కళ్ల ముందే మాయమైపోతుంది. ఈ ఆలయం అరేబియా సముద్రం మరియు కాంబే గల్ఫ్ (Gulf of Khambhat) తీరంలో ఉంటుంది. సముద్రంలో అలల పోటు వచ్చినప్పుడు, ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో కేవలం ఆలయం పైన ఉండే ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. సముద్రపు అలలు తగ్గగానే.. సముద్రం నుండి ఆలయం మళ్లీ బయటకు వస్తుంది. అప్పుడు మాత్రమే భక్తులు లోపలికి వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందట.
స్థల పురాణం (పురాణ గాథ): స్కంద పురాణం ప్రకార ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందట. శివుని కుమారుడైన కుమారస్వామి తారకాసురుడనే రాక్షసుడిని ఇక్కడే సంహరించాడని చెబుతారు. తారకాసురుడు రాక్షసుడైనప్పటికీ శివభక్తుడు కావడంతో అతనిని చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపం చెందాడట. విష్ణుమూర్తి సలహాతో, ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి కార్తికేయుడు ఈ ప్రదేశంలో మూడు శివలింగాలను ప్రతిష్టించి పూజించాడట. వాటిలో ఒకటే ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ అని సముద్రుడే స్వయంగా ప్రతిరోజూ స్వామికి జలాభిషేకం చేస్తూ ఉంటాడని పండితులు చెప్తున్నారు.
మరో పురాణ కథనం: మహాభారత యుద్ధం తర్వాత తమ బంధువులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి పాండవులు కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారని మరో పురాణ గాథ ప్రచారంలో ఉందట.
ఆలయ నిర్మాణం: ఈ ఆలయం స్తంభాలపై నిర్మించబడింది.. అందుకే దీనికి ‘స్తంభేశ్వర్’ అనే పేరు వచ్చిందట. గర్భాలయంలో సుమారు 4 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు ఉన్న శివలింగం ఉంటుందట. ప్రస్తుత ఉన్న ఆలయ నిర్మాణం సుమారు 150 ఏళ్ల క్రితం జరిగిందట.. అయితే ఇక్కడి శివలింగం వేల ఏళ్ల నాటిదని చెబుతారు పండితులు.
సందర్శకులకు సూచనలు: ఈ ఆలయాన్ని దర్శించాలనుకునే వారు సముద్రపు పోటు, పాటు సమయాలను ముందుగానే తెలుసుకోవాలట. అలల తీవ్రత తక్కువగా ఉన్న మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 6:00 గంటల మధ్య సమయం దర్శనానికి అనుకూలంగా ఉంటుందట. పౌర్ణమి, అమావాస్య రోజులలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందట కాబట్టి భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఈ రోజుల్లో శివలింగం నుంచి ఒక ప్రత్యేకమైన కాంతి వస్తుందని చెప్తుంటారు.
ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా, జంబుసార్ తాలూకాలోని కవి కంబోయి (Kavi Kamboi) అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం. వడోదర (Vadodara) నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుందట. ఈ ఆలయానికి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.