Sravana Masam 2025: శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా శివాలయ దర్శనం, బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి ఈ మాసంలో ఎక్కువగా చేస్తుంటారు. అయితే.. శ్రావణ మాసంలో చేసే ఒక ప్రత్యేకమైన పూజ వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని.. జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ పూజే “శ్రావణ సోమవార రుద్రాభిషేకం”.
శ్రావణ సోమవార రుద్రాభిషేకం ఎందుకు ప్రత్యేకం ?
శ్రావణ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం శివుడికి చాలా పవిత్రమైనది. సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడు అత్యంత ప్రసన్నుడై, భక్తుల కోరికలను తీరుస్తాడు. రుద్ర అంటే శివుడి తీవ్ర రూపం. అభిషేకం అంటే దైవానికి పవిత్ర ద్రవ్యాలతో స్నానం చేయించడం. రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం పరి పూర్ణంగా లభిస్తుంది. అంతే కాకుండా రుద్రాభిషేకం ఆర్థిక సమస్యల నేంచి దూరం చేస్తుంది.
ఈ పూజ వల్ల ప్రయోజనాలు:
రుద్రాభిషేకం వల్ల కేవలం ఆధ్యాత్మిక లాభాలే కాకుండా.. భౌతిక సంపదలు, ఆరోగ్యం కూడా చేకూరుతాయి. ముఖ్యంగా ఈ పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం. అష్టైశ్వర్యాలు అనగా:
ధన సంపద: ఆర్థిక కష్టాలు తొలగిపోయి,..సిరి సంపదలు వృద్ధి చెందుతాయి.
ధాన్య సంపద: పంటలు బాగా పండి, ఆహార కొరత తీరుతుంది.
సంతాన సంపద: సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉన్న సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటారు.
పశు సంపద: పశువులు వృద్ధి చెంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి. (ఆధునిక కాలంలో ఇది పరిశ్రమలు, వాహనాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు).
బల సంపద: శారీరక, మానసిక బలం పెరుగుతుంది.
పరాక్రమ సంపద: ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి, శత్రువులపై విజయం సాధిస్తారు.
రాజ్య సంపద: సమాజంలో గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి.
జ్ఞాన సంపద: విద్యాబుద్ధులు వృద్ధి చెంది, జ్ఞానం ప్రకాశిస్తుంది.
ఈ ఎనిమిది రకాల ఐశ్వర్యాలు శ్రావణ సోమవార రుద్రాభిషేకంతో పొందవచ్చని ప్రతీతి.
రుద్రాభిషేకం ఎలా చేయాలి ?
ఈ పూజను మీ ఇంటి వద్ద లేదా దేవాలయాలలో పండితులచే చేయించవచ్చు. సాధారణంగా.. రుద్రాభిషేకానికి కావలసిన వస్తువులు:
శివలింగం (ఇంట్లో పూజిస్తే)
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు)
కొబ్బరినీరు, చెరకు రసం
పవిత్ర జలం (గంగాజలం)
బిల్వపత్రాలు, పువ్వులు
ధూపం, దీపం, నైవేద్యం
భస్మం, చందనం
Also Read: శ్రావణ మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటి ?
రుద్రాభిషేకం చేసేటప్పుడు “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా “మహామృత్యుంజయ మంత్రాన్ని” జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరిస్తే.. శివుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం ఈ రుద్రాభిషేకాన్ని చేసి, శివుడి అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను పొందండి.