Chandra Grahanam: హోలీ రోజున చంద్రగ్రహణం కూడా వస్తోంది. ఈరోజున ప్రతికూల ప్రభావాలు పడకుండా ఉండాలంటే కొన్ని పనులను ఇంట్లో చేయాలి.
ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకే రోజు సంభవించబోతున్నాయి. నిజానికి చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ ఎంతో మంది దాని దుష్ప్రభావాలు తమపై పడకుండా ఉండేందుకు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణాన్ని అశుభంగానే చెబుతారు. హోలీ వంటి పెద్ద పండుగనాడే ఈ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశి చక్రాలపై ఉంటుంది. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా గ్రహణం ప్రభావం తమపై పడకుండా కాపాడుకోవచ్చు.
చంద్ర మంత్రం
చంద్రగ్రహణం రోజున చంద్ర మంత్రాన్ని జపించండి. ఇలా జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ‘ఓం సోం సోమ్య నమః’ ఇదే చంద్ర మంత్రం. చంద్రగ్రహణం సమయంలో ఇదే మంత్రాన్ని అలా జపిస్తూ ఉంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది.
దానధర్మాలు
చంద్రగ్రహణ సమయంలో కచ్చితంగా చేయాల్సినది దానం. ఆరోజు దానం చేయడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో పేదలకు ఆహారం, బట్టలు వంటివి దానం చేస్తే ఆ ఇంటికి ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబానికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది.
తులసి మొక్క
చంద్రగ్రహానికి ముందు మీరు ఇంట్లో ఉన్న తులసి మొక్క నుంచి కొన్ని ఆకులను తెంపి మీతోనే ఉంచుకోండి. దీనివల్ల ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపించదు. తాగునీటిలో, ఊరగాయల్లో, నెయ్యిలో, వండిన ఆహారాల్లో తులసి ఆకులను వేయండి. దానివల్ల అవేవీ కూడా గ్రహణ సమయంలో అపవిత్రం కాకుండా ఉంటాయి. గ్రహణం వీడిపోయాక వాటిని తినవచ్చు.
స్నానం
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కచ్చితంగా ఇంటిల్లపాది స్నానం చేయాలి. దీనివల్ల మనస్సు, శరీరం రెండు పవిత్రమవుతాయి. కేవలం మీరు స్నానం చేయడమే కాదు. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా నీళ్లు జల్లి తడి గుడ్డతో తుడవాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న మనుషులకు పై అశుభ ప్రభావాలు పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
Also Read: అరసవెల్లిలో స్వామిని తాకని సూర్యకిరణాలు.. కారణం ఇదే!
గమనిక: పండితులు, పెద్దలు చెప్పిన.. గ్రంథాలు, శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను యథావిధిగా మీకు అందించాం. ఈ అంశాలకు ‘బిగ్ టీవీ లైవ్’ బాధ్యత వహించదని గమనించగలరు.