మహాభారత యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అంటారు. రాజ్య నియంత్రణ కోసం అన్నదమ్ములే పోరాడిన యుద్ధం అది. కౌరవులు పాండవులు రాజ్యాల కోసం కొట్టుకున్నారు. పాండవులు తమ హక్కుగా వచ్చిన వాటాను మాత్రమే కోరినా కూడా కౌరవులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దానివల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ధర్మం, అధర్మం మధ్య యుద్ధంగా ఇది పేరుపొందింది. శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో పాండవులు విజేతలుగా నిలిచారు. కౌరవులంతా మరణించారు.
కురుక్షేత్ర యుద్ధం వరకే ఎన్నో సినిమాలను, నాటకాలను, పుస్తకాలను రచించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎంతో మందికి తెలియదు. యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడి మరణం సంభవించింది. పాండవులు ఆ యుద్ధం తర్వాత ఏమాత్రం సంతోషంగా లేరు. తమ చేతుల్లో మరణించింది తమ అన్నదమ్ములే అన్న బాధ వారిని పీడించ సాగింది.
హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్న పాండవులు నీతిమంతులుగా పాలించారు. ఆ రాజ్యం కూడా వర్ధిల్లింది. ధర్మరాజు హస్తినాపుర రాజుగా పట్టాభిషేకం పొందాడు. శ్రీకృష్ణుడు చెప్పిన నియమ నిబంధన ప్రకారం ధర్మంగా పరిపాలించాడు. కొన్నేళ్ల తర్వాత పాండవ సోదరులు హస్తినాపుర రాజ్యాన్ని అభిమన్యుడి కుమారుడు, అర్జునుడి మనవడు అయిన పరీక్షిత్తుకు ఇచ్చేశారు. అతడినే వారసుడిగా పట్టాభిషేకం చేశారు. తమ చివరి ప్రయాణాన్ని ప్రారంభించారు.
పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల నుంచి ప్రయాణం సాగించసాగారు. అదే మహా ప్రస్థానంగా పేరుపొందింది. పాండవులు, ద్రౌపది మోక్షాన్ని పొందేందుకు ప్రపంచాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నారు. హిమాలయాల నుంచి నడుచుకుంటూ స్వర్గానికి బయలుదేరారు. ఒకరి వెంట ఒకరు అలా నడుస్తూ ఉంటే ఒక్కొక్కరుగా పడిపోవడం మొదలుపెట్టారు. అలా ప్రయాణంలో మొదట పడిపోయింది ద్రౌపది. ద్రౌపది మొదట మరణించడానికి కారణం ఆమె ఐదుగురు భర్తలలో అర్జునుడిని ఎక్కువగా ప్రేమించడమేనని, అదే ఆమెలోపంగా మారిందని ధర్మరాజు చెప్పాడు. మిగతావారంతా తన ప్రయాణాన్ని కొనసాగించారు.
ద్రౌపది తర్వాత పాండవులలో చిన్నవాడైనా సహదేవుడు కిందపడి మరణించాడు. సహదేవుడు తన జ్ఞానం పట్ల గర్వితుడై ఉండేవారని, అందుకే అతని స్వార్థపూరిత స్వభావం కారణంగా త్వరగా కింద పడిపోయి పతనం చెందాడని ధర్మరాజు చెప్పాడు.
సహదేవుడి అంతం తర్వాత నకులుడు కింద పడి పతనం చెందాడు. అతడు తన శారీరక రూపం అందం పట్ల అతి గర్వంగా ఉండేవాడని దానివల్లే అతడికి పతనం సంభవించిందని వివరించాడు ధర్మరాజు.
తర్వాత శక్తివంతుడైన భీముడు పడిపోయాడు. భీముడికి ఆహారం, తన బలం పట్ల ఎక్కువ ఇష్టం ఉండేది. తన పట్ల తనకున్న అతి ప్రేమ అతని లోపంగా మారిందని, తిండి పై అతడికున్న అత్యాశ కూడా ఇలా పతనం అయ్యేలా చేసిందని చెప్పాడు ధర్మరాజు.
ఇక గొప్ప యోధుడైన అర్జునుడు కూడా స్వర్గానికి చేరుకోలేక మధ్యలోనే పతనమయ్యాడు. అతను పడిపోయినప్పుడు అర్జునుడు యుధిష్టరుడు ఒకటే అనుకున్నాడు. తానే గొప్ప విలుకాడినని గర్వం చెందడం వల్ల స్వర్గానికి చేరకుండా మధ్యలోనే పతనమయ్యాడని చెప్పాడు.
Also Read: రంగులతో కాదు.. శవాల బూడిదతో హోలీ.. ఇందుకు పెద్ద కారణమే ఉందట!
ఇక మిగిలింది అత్యంత నీతిమంతుడు, పాండవులలో పెద్దవాడు అయినా ధర్మరాజు… స్వర్గానికి వెళ్లే మార్గం మధ్యలో పడిపోలేదు. స్వర్గం వైపు నడుస్తూ ఉన్నాడు. ఇంద్రుని మనుషులు వచ్చి అతడిని దేవలోకానికి తీసుకెళ్లారు. అక్కడే ధర్మరాజు తన చివరి రోజులను ధ్యానంలో గడిపాడు.