Plants: మొక్కలు పెంచడం వల్ల ఇంటికి అందం, స్వచ్ఛమైన గాలి వస్తాయి. కానీ.. వాస్తు శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం అశుభమని లేదా ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. అలాంటి మొక్కల గురించి, వాటిని ఎందుకు దూరంగా ఉంచాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1. కాక్టస్ లేదా ముళ్ళ మొక్కలు:
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ముళ్ళతో కూడిన మొక్కలను పెంచకూడదు. కాక్టస్ వంటి మొక్కలు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఇవి ఇంట్లోని సభ్యుల మధ్య మనస్పర్థలకు, ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతాయని చెబుతారు. అలాగే.. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ ముళ్ళ వల్ల వారికి గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.
మినహాయింపు: గులాబీ మొక్కకు ముళ్ళు ఉన్నప్పటికీ.. దానిని ఇంట్లో పెంచుకోవచ్చు.
2. బోన్సాయ్ మొక్కలు:
చూడటానికి చాలా అందంగా, చిన్నవిగా ఉండే బోన్సాయ్ మొక్కలను ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడతారు. కానీ.. వాస్తు ప్రకారం ఇవి ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఒక పెద్ద వృక్షం కావాల్సిన మొక్కను బలవంతంగా చిన్నదిగా మార్చడం వల్ల.. అది ఇంట్లోని వ్యక్తుల కెరీర్ లేదా వ్యాపార వృద్ధిని కుంటుపరుస్తుందని నమ్ముతారు.ఇవి ఇంటి లోపల కాకుండా తోటలో లేదా బయట పెంచుకోవడం మంచిది.
3. పాలు కారే మొక్కలు:
కొన్ని మొక్కల ఆకులు లేదా కొమ్మలు విరిచినప్పుడు తెల్లటి పాల లాంటి ద్రవం వస్తుంది. ఉదాహరణకు జెముడు లేదా ఇతర రకాల పాలు కారే మొక్కలను ఇంటి ఆవరణలో ఉంచకూడదు. సైన్స్ ప్రకారం.. ఈ పాలు విషపూరితమైనవి కావచ్చు. చర్మంపై పడితే అలర్జీలు రావడం లేదా కళ్లలో పడితే చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవి ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయని వాస్తు చెబుతోంది.
4. గోరింటాకు మొక్క:
సాధారణంగా గోరింటాకు మొక్కను అరిష్టంగా భావిస్తారు.ఈ మొక్కలు ప్రతికూల శక్తులకు నిలయమని, ఇవి ఇంట్లో ఉంటే మనశ్శాంతి తక్కువగా ఉంటుందని పాతకాలం నుంచి ఒక నమ్మకం ఉంది.అందుకే పల్లెటూళ్లలో కూడా గోరింటాకు చెట్లను ఇంటికి కొంచెం దూరంగా లేదా పొలం గట్ల మీద పెంచుతారు.
5. చింత చెట్టు:
ఇంటి ఆవరణలో లేదా ఇంటికి చాలా దగ్గరగా చింత చెట్టు ఉండకూడదు. శాస్త్రీయంగా చూస్తే.. చింత చెట్టు రాత్రిపూట అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. వాస్తు ప్రకారం.. ఈ చెట్టు ఉన్న చోట ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతారు.
Also Read: దేవుడిగానే కాదు, గొప్ప కొడుకుగా గణపతి నేర్పే పాఠాలు
6. ఎండిపోయిన మొక్కలు :
మొక్క ఏదైనా సరే.. అది ఎండిపోయినా లేదా వాడిపోయినా వెంటనే దానిని తీసేయాలి. ఎండిన మొక్కలు ఇంట్లో ఉంటే అవి మృత్యువుకు లేదా నిరాశకు సంకేతంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే ఉత్సాహం తగ్గి.. సోమరితనం పెరుగుతుంది.
మొక్కలు పెంచేటప్పుడు అవి కేవలం అందం కోసమే కాకుండా.. ఇంట్లో ప్రశాంతతను ఇచ్చేలా ఉండాలి. మనీ ప్లాంట్, తులసి, స్నేక్ ప్లాంట్, అలోవెరా వంటి మొక్కలు ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. పైన పేర్కొన్న మొక్కలను ఇంటి లోపల కాకుండా వీలైతే దూరంగా తోటలో పెంచుకోవడం శ్రేయస్కరం.