Lord Ganesha: నాయకుడు లేదా గణపతి కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు. పిల్లలందరికీ ఒక గొప్ప రోల్ మోడల్. ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల భక్తి, గౌరవం ఎలా ఉండాలో ఆయన జీవితం మనకు నేర్పుతుంది. “వినాయకుడు ఒక ఉత్తమ కుమారుడు” అనడానికి పురాణాల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి.ప్రతీ బిడ్డా గణేశుడి నుంచి నేర్చుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.తల్లిదండ్రులే సర్వస్వం :
వినాయకుడి జీవితంలో అత్యంత ప్రసిద్ధమైన కథ ‘లోక ప్రదక్షిణ’. కుమారస్వామి తన నెమలి వాహనంపై లోకమంతా చుట్టి రావడానికి బయలుదేరితే.. వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. “నా తల్లిదండ్రులే నా ప్రపంచం, వారిని మించిన లోకం వేరే లేదు” అని ఆయన నిరూపించారు.
పాఠం: బయట ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా.. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే మొదటి దైవాలని పిల్లలు గుర్తించాలి.
2.వినయం, విధేయత:
వినాయకుడు అపారమైన జ్ఞానం, శక్తి కలిగినవాడు. అయినప్పటికీ.. తన తల్లి పార్వతీ దేవి ఆజ్ఞను పాటించడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. పార్వతీ దేవి స్నానానికి వెళ్తూ.. ఎవరినీ లోపలికి రానివ్వద్దు అని చెబితే.. సాక్షాత్తూ పరమశివుడిని కూడా అడ్డుకున్నాడు. అది ఆయనకు తన తల్లి పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం.
పాఠం: శక్తివంతులుగా ఎదిగినా.. తల్లిదండ్రుల మాట పట్ల వినయాన్ని కోల్పోకూడదు.
3.బుద్ధిబలంతో సమస్యల పరిష్కారం:
వినాయకుడు తన శరీర ఆకృతిని చూసి ఎప్పుడూ బాధపడలేదు. తన దగ్గర ఉన్న వనరులతో (చిన్న మూషికం వాహనంగా ఉన్నా) అత్యంత క్లిష్టమైన సమస్యలను తన తెలివితేటలతో పరిష్కరించుకునేవాడు. తల్లిదండ్రుల మెప్పు పొందడానికి కష్టపడటం కంటే ‘ఇష్టపడి’ తెలివిగా ఆలోచించడం ఆయన నేర్పిన పాఠం.
పాఠం: శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పదని.. దాన్ని తల్లిదండ్రుల సేవలో ఉపయోగించాలని తెలుసుకోవాలి.
4.త్యాగగుణం, క్రమశిక్షణ:
మహాభారతాన్ని రాసే క్రమంలో.. కలం విరిగిపోతే తన దంతాన్ని తానే విరిచి కలంగా మార్చుకున్నాడు గణేశుడు. ఇది ఆయన క్రమశిక్షణకు, ఒక పనిని పూర్తి చేయాలనే పట్టుదలకు నిదర్శనం. ఒక బిడ్డగా క్రమ శిక్షణతో ఉంటే అది తల్లిదండ్రులకు ఇచ్చే అతిపెద్ద గౌరవం.
పాఠం: లక్ష్యం కోసం చిన్న చిన్న త్యాగాలు చేయడం, పట్టుదలతో చదవడం తల్లిదండ్రులకు గర్వకారణం.
Also Read: ఉద్యోగం రావడం లేదా ? బెంగళూరులోని ఈ వినాయకుడిని దర్శించుకుంటే మీ దశ మారుతుందట !
5.అహంకారం లేని వ్యక్తిత్వం:
గణేశుడు గణాధిపతి (దేవతల సైన్యానికి నాయకుడు). అంత పెద్ద పదవిలో ఉన్నా, ఆయన వాహనం ఒక చిన్న ఎలుక. ఇది ఆయనలోని నిరాడంబరతను సూచిస్తుంది. పిల్లలు ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరినా, తమ మూలాలను, తల్లిదండ్రులను మర్చిపోకూడదని ఇది తెలియజేస్తుంది.
పాఠం: హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి.
వినాయకుడిని కేవలం పూజించడమే కాదు.. ఆయనలోని ఈ గుణాలను అలవరుచుకున్నప్పుడే ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులకు నిజమైన ‘వినాయకుడు’ అవుతాడు. తల్లిదండ్రుల ప్రేమను పొందడం కంటే మించిన విజయం ప్రపంచంలో మరొకటి లేదని వినాయకుని చరిత్ర మనకు చెబుతోంది.