జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహం అంటే బృహస్పతి ఎంతో ముఖ్యమైనవాడు. బృహస్పతిని దేవతల గురువుగా చెప్పుకుంటారు. ఎంతో ప్రాధాన్యత గల గురుగ్రహం మీ జాతకంలో బలంగా ఉంటే మీరు అన్ని విజయాలను దక్కించుకుంటారు. కెరీర్లో, వ్యాపారాల్లో దూసుకెళ్తారు.
గురుబలం లేకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. బృహస్పతి బలహీనంగా ఉంటే మీకు బాధలు తప్పవు. మంచి పేరు కూడా రాదు. చేయని తప్పుకు నిందలు భరించాల్సి వస్తుంది. కాబట్టి జాతకంలో గురు బలాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.
పసుపు కుంకుమతో
గురు బలాన్ని పెంచుకునేందుకు గురువారం నాడు బకెట్ నీళ్లలో పసుపు లేదా కొంచెం కుంకుమ కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే ప్రతి గురువారంనాడు వెనగపప్పును బెల్లంతో కలిపి ఆవులకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల గురుబలం పెరిగే అవకాశం ఉంది.
గురువుల సేవ
విద్య నేర్పిన గురువులను మరిచిపోకుండా వారిని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. అలాగే గురువారం నాడు మీ గురువుల సేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా పేదలకు దానధర్మాలు చేసేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా గురు బలాన్ని పెంచుతాయి.
ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఎనిమిది రోజుల ముందే పసుపును దేవాలయానికి ప్రతిరోజు దానం చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది. గురువు మీ పనులకు సహకరిస్తాడు.
తోబుట్టువులకు సాయం
అనాథలు, వృద్ధులకు అరటి పండ్లు, స్వీట్లు వంటి ఆహారాలను పంచిపెట్టడం కూడా మంచిది. ఇలాంటి చిన్న చిన్న పనులే గురు బలాన్ని పెంచుతాయి. అలాగే మీతో పాటు పుట్టిన తోబుట్టువులకు సాధ్యమైనంత వరకు సాయం చేయండి. ఇది గురు బలాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. గురు మంత్రాలు, స్తోత్రాలు పఠించడం వల్ల కూడా గురు గ్రహం అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఏ పని మొదలు పెట్టడానికి ముందు మీరు ముక్కును బాగా శుభ్రం చేసుకొని ఆ తర్వాతే పనిలో దిగాలి. అలాగే కొత్త పనిని లేదా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒకసారి తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. వారి కాలికి నమస్కరించి అప్పుడు పనిని ప్రారంభించండి.
నుదుటిపై గంధం
గురుబలం కావాలంటే నుదుటిపై గంధాన్ని నిత్యం ధరించండి. అలాగే పసుపుతో బొట్టు పెట్టుకునేందుకు ప్రయత్నించండి. వీలైనంతవరకు శరీరంపై బంగారు ఆభరణాలు ఉండేలా చూసుకోండి. ఇవి గురు బలాన్ని పెంచడానికి సహాయపడతాయి. అలాగే పసుపు రంగులో ఉన్న రుమాలను పట్టుకునేందుకు ప్రయత్నించండి. అలాగే టోపీని కూడా పసుపు రంగులో ఉన్నది పెట్టుకుంటే మంచిది. నదులు, సముద్రాలు వంటి వాటిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించవద్దు. స్విమ్మింగ్ పూల్ లో కూడా ఈత కొట్టడం గురు బలాన్ని తగ్గిస్తుంది. అలాగే అందరూ చూస్తుండగా బహిరంగంగా స్నానం చేయడం వంటి పనులు చేయకండి. ఇవన్నీ కూడా గురుబలాన్ని తగ్గిస్తాయి.
గురుబలాన్ని పెంచుకునేందుకు తరచూ శివునికి రుద్రాభిషేకం చేస్తూ ఉండండి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతి గురువారం ఆ గురుదేవుడిని మొక్కుకొని ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఈ ఉపవాసాన్ని ఐదు గురువారాల పాటు చేయవచ్చు. లేదా 11 గురువారాలు చేయవచ్చు. ఇంకా ఎక్కువ కాలం చేయాలనుకుంటే 43 వారాలపాటు ప్రతి గురువారం ఉపవాసం ఉండవచ్చు.
గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు ప్రయత్నించండి. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర కూడా చదవండి. ఇవన్నీ కూడా గురు బలాన్ని జాతకంలో పెంచుతాయి.