Newly Married Couple: కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? మీ పెళ్లికి తిరుమల శ్రీవారి ఆశీస్సులు కావాలనుకుంటున్నారా..? శ్రీవారి ఆశీస్సులతో పాటు అక్షింతలు అలాగే వధూవరుల కోసం కంకణాలు, కుంకుమ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీకు ఉచితంగా పంపిస్తుంది. అయితే ఈ శ్రీవారి కానుకలు కావాలంటే మీరేం చేయాలో..? ఎప్పుడు చేయాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్నారు. గోవిందా అంటూ పలికిన భక్తుల కొంగు బంగారంగా విల్లసిల్లుతున్నాడు. ధర్మబద్దమైన ఏ కోరికైనా తిరుమల శ్రీవారి దరి చేరి కోరుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం అందుకే శ్రీవారిని భక్త వల్లభుడు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీవారి నుంచి నూతన దంపతులకు ఆశీస్సులు రావడమే కాదు కొన్ని కానుకలు పంపిస్తుంది టీటీడీ బోర్డు.
నూతనంగా వివాహం చేసుకునే పెళ్లి కుమారై, పెళ్లి కుమారుడికి శ్రీవారి దీవెనలతో పాటు అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, ‘కల్యాణ సంస్కృతి’ పుస్తకం టీటీడీ అందిస్తోంది. ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్షకు పైగా వధూవరులకు శ్రీవారి దీవెనలతో కల్యాణం జరుగుతుందని టీటీడీ చెప్తుంది.
నూతన వధువరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి.
నవసమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనది. వధువరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమ చేతికి ధరింపచేస్తారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణాలు పంపుతారు.
వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, సిరిసంపదలు కలగాలని టీటీడీ కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది.
నూతన వధువరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు ”కల్యాణ సంస్కృతి” పేరిట ఓ పుస్తకాన్ని, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీల ఫోటోలతో కూడీన వేద ఆశీర్వచన పత్రికను టీటీడీ కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు.
శ్రీవారి ఆశీస్సులు పొందగోరు నూతన వధూవరులు తమ పూర్తి చిరునామాతో ”కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి – 517501” పేరిట వివాహ పత్రికను, వధూవరుల ఆధార్ కార్డులు పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం.155257 సంప్రదించవచ్చు.
ఈ అపూర్వమైన ఘట్టం నిర్వహించడానికి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల శుద్ధ ప్రతి విభాగం (తపాలా విభాగం) సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం లక్షకు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందించడానికి శ్రమిస్తుంటారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.