BigTV English

Vasant Panchami 2024: వాగ్దేవి పండుగ.. వసంత పంచమి..!

Vasant Panchami 2024: వాగ్దేవి పండుగ.. వసంత పంచమి..!
Vasant Panchami

Vasantha panchami 2024 : ఈ ప్రపంచంలో అన్ని సంపదలకు మూలం.. జ్ఞానం. ఆ మహత్తరమైన జ్ఞానానికి అధిదేవత.. సరస్వతి. అందుకే మనం ఆమెను చదువుల తల్లి అంటాము. మాఘ శుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి ఆవిర్భవించిన కారణంగా ఆ రోజును వసంత పంచమి పేరుతో మనం జరుపుకుంటాము. ఈ పండుగ విశేషాలు..


వసంత పంచమిని కొన్ని ప్రాంతాల్లో ‘శ్రీ పంచమి’, ‘మదన పంచమి’ అని కూడా పిలుస్తారు. సరస్వతీ దేవి.. సకల వేదాలకు మూలదైవం. ‘ప్రణోదేవి సరస్వతి’ అని బుుగ్వేదం ఆ తల్లిని కీర్తించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపాల కలయికయే సరస్వతీ దేవి. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది, గుణదాయిని అనే 8 దివ్య అంశలను అనుగ్రహించే శక్తి సరస్వతీ దేవి. వీటినే సారస్వత శక్తులు అంటారు.

సార, స్వ అనే పదాల కలయిక అయిన.. సరస్వతి అంటే.. ‘తన గురించి తాను తెలుసుకున్నది’ అని అర్థం. జ్ఞానం యొక్క పరమార్థం.. మనిషి తానెవరో తెలుసుకోవటమే. అలాగే.. ఈ పదానికి ప్రవహించేది (నీరు కలిగినది) అనే అర్థమూ ఉంది. జ్ఞానమూ ఒకరి నుంచి మరొకరికి ప్రవాహంలాగా సాగిపోవాలని పెద్దలు చెబుతారు.


అలాగే.. వేదకాలంలో మన దేశంలో సరస్వతీ అనే నది ఉండేదని రుజువైంది. రుగ్వేదంలోనూ దీని ప్రస్తావన ఉంది. గంగ, యుమునకు తోడు సరస్వతి కలిసే ప్రదేశాన్నే మనం త్రివేణీ సంగమం అని పిలుస్తున్నాం. అమ్మవారినే మనం.. శారద, బ్రాహ్మణి, వాగ్దేవి, వాణి, శ్యామల అనే పేర్లతోనూ పిలుస్తాము.

విష్ణు ధర్మోత్తర పురాణం.. సరస్వతీ దేవి గొప్పదన్నాన్ని, ఆమె తేజస్సును ఎంతగానో వర్ణించింది. ఆమె 4 చేతులు 4 దిక్కుల్లోని శక్తితత్త్వానికి, వ్యాపకత్వానికి ప్రతీకలు. శారద చేతిలోని పుస్తకం సకల శాస్త్రాల సారం. అమ్మవారి చేతిలోని అక్షమాల అనంత కాలానికి చిహ్నం.

యోగశాస్త్రం ప్రకారం.. శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉన్న భాగం వీణను పోలి ఉంటుంది. ఈ శరీరం అనే వీణను సాధనతో రవళింపజేసి, ఆధ్యాత్మిక, యోగశక్తుల్ని ఉద్దీపనం చేయాలని ఆమె చేతిలోని వీణ చెబుతోంది.

అమ్మవారు కూర్చొచే తెల్లని కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. అమ్మవారి వాహనం హంస. పాలూ నీటిని వేరుచేయగల శక్తిగల ఈ హంస.. లోకంలో మంచినీ చెడునీ జ్ఞానం ఆధారంగా విడివిడిగా చూడాలని మనకు చెబుతుంది.

అమ్మవారు ధరించే వస్త్రాలు, కూర్చొనే కమలం, వాహనమైన హంస, మెడలోని పూలదండ, చేతిలోని అక్షమాల అన్నీ తెల్లగానే ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. జీవితంలో ఎలాంటి ప్రలోభాలకూ లొంగిపోకుండా, స్వచ్ఛంగా జీవించాలనే సందేశం ఈ రంగులో ఉంది.

ఇక.. శ్రీ పంచమి పండుగ రోజున అక్షరాభ్యాస వేడుకను జరపటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ రోజున తెల్లటి పువ్వులతో అమ్మవారిని పూజించి, అష్టోత్తరం చదివి, క్షీరాన్నాన్ని నివేదన చేసి, పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారు గొప్పగా రాణిస్తారని దేవీ భాగవతం చెబుతోంది.

ఈసారి ఈ రోజు (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం 02:41 గంటల నుంచి రేపు (ఫిబ్రవరి 14) మధ్యాహ్నం 12:09 గంటల వరకు పంచమి తిథి ఉంది. కనుక సూర్యోదయం లెక్క ప్రకారం.. రేపు ఉదయం 7:01 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు పూజ చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున బాసర, వర్గల్ వంటి పుణ్యక్షేత్రాల్లోని సరస్వతీ మాత దేవాలయాలను దర్శించి పూజలు చేయటం వల్ల విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×