
Vishnu Puja : కార్తీకమాసంలో మహిళలు విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాళ్లు దీర్ఘయువై , అంత్యాన మోక్షాన్ని పొందుతారు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
హరిని మల్లెపువ్వులతో పూజిస్తే పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా ఎగిరిపోతాయి.
ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము , మహానదీ స్నానము , బ్రహ్మపత్ర భోజనము , అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మం. స్నాన దానాదులను ఆచరించని వారు, యధాశక్తిగా పూజ చేయని వారు వందల జన్మలు కుక్కగా పుట్టి , తదుపరి నూరుపుట్టుకలూ ఇదే ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. కార్తీక మాసములో అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు – తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు.
కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని , పూర్ణమనాడు గాని , అమావ్యానాడు గాని సంకల్ప రహితముగా ప్రాతఃస్నానం ఆచరించడం వల ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా , విన్నా ఇదే ఫలితాన్ని పొందుతారు. కార్తీకమాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి. కార్తీకమాసంలో విష్ణు పూజలు చేసే వారికి సహకరిస్తే స్వర్గాన్ని పొందుతారు.