Gold Smuggling: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో.. భారీ స్థాయిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
దాదాపు 1.798 కిలోల 24 క్యారెట్ బంగారాన్ని DRI అధికారులు సీజ్ చేశారు. మొత్తం 5 గోల్డ్ బార్లు, 2 కట్ పీసులు కలిపి రూ. 2.37 కోట్ల రూపాయల విలువ గల ఈ బంగారం.. శంషాబాద్ విమానాశ్రయంలోని చెక్-ఇన్ లగేజీలో దాచబడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్ నుండి శార్జా ద్వారా ఎయిర్ అరేబియా ఫ్లైట్ G9 467 లో హైదరాబాద్‌కు వచ్చిన ఒక ప్రయాణికుడు.. ఈ బంగారాన్ని అక్రమంగా హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నించాడు. లగేజీ స్కానింగ్ సమయంలో అధికారులు అనుమానాస్పద సంకేతాలను గుర్తించి, తనిఖీలు చేపట్టారు.
కాగా.. పట్టుబడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతను కువైట్‌లో ఉన్న స్మగ్లింగ్ రింగ్ కోసం పని చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. హైదరాబాద్, దుబాయ్, కువైట్‌ల మధ్య నడుస్తున్న బంగారం స్మగ్లింగ్ నెట్వర్క్‌పై దర్యాప్తును వేగవంతం చేశారు. డిఆర్ఐ అధికారులు ఇప్పటికే సంబంధిత ఇంటెలిజెన్స్ యూనిట్లతో విచారణ జరుపుతున్నారు.
ఈ మధ్య కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో.. గోల్డ్ స్మగ్లింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో 10 కిలోల కంటే ఎక్కువ బంగారం వివిధ ప్రయాణికుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..
ఈ ఘటన తర్వాత కస్టమ్స్, DRI అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో.. తనిఖీలను మరింత కఠినతరం చేశారు. స్మగ్లింగ్ ప్రయత్నాలను గుర్తించడానికి కొత్త ఎక్స్-రే స్కానింగ్ సిస్టమ్స్, ప్రత్యేక స్నిఫర్ డాగ్స్, డేటా అనలిటిక్స్ పద్ధతులను ఉపయోగించనున్నారు.