రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో శుభ్రత పాటించాలని ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు పిలుపునిచ్చింది. అదే సమయంలో రైల్వే స్టేషన్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా శుభ్రత నీట్ నెస్ మెయింటెయిన్ చేయాలని సూచించింది. లేదంటే, పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో శుభ్రత పాటించాలనే లక్ష్యంతో ‘స్వచ్ఛత అభియాన్’, ‘స్వచ్ఛత హి సేవ’, ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
శుభ్రత కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ డివిజన్ లోని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ స్టేషన్ తో పాటు రన్నింగ్ ట్రైన్స్ లో తనిఖీలు కొనసాగాయి. శుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించారు. ఈ ఫైన్లు అన్నీ కలిపి రూ. 24,800 వసూలు అయినట్లు అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు పి.ఇ. ఎడ్విన్, శ్రీనివాస్ రావు కొండా తెలిపారు. రైల్వే స్టేషన్లలో శుభ్రత కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ‘స్వచ్ఛత అభియాన్’, ‘స్వచ్ఛత హి సేవ’, ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమాల సందర్భంగా అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారని తెలిపారు.
స్వచ్ఛత కార్యక్రమాల సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చేపట్టిన ఈవెంట్స్ లో 1,595 మంది అధికారులు, 2,243 మంది వాలంటీర్లు హాజరైనట్లు ఎడ్విన్ వెల్లడించారు. వీరంతా కలిసి అన్ని రైల్వే స్టేషన్లలో శుభ్రత కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుభ్రత గురించి 741 వెబినార్లు కూడా జరిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 1 టన్ను వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. 35 మొక్కలను నాటడంతో పాటు 341 కాలువలు, 30 కార్యాలయాలను శుభ్రం చేశారని శ్రీనివాస్ రావు తెలిపారు.
Read Also: ఇండియన్ డైమండ్ క్రాసింగ్.. నాలుగు రైల్వే లైన్లు ఒకే చోట కలిసే ఈ అద్భుతం గురించి మీకు తెలుసా?
రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో ప్రయాణీకులు శుభ్రత పాటించాలని సూచించారు. వ్యర్థాలను నిర్ణీత డస్ట్ బిన్ లలో మాత్రమే వేయాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తను పడేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడి ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కరంగా మారుతుందన్నారు. రైల్వే ఆస్తులు ప్రజలవని చెప్పిన అధికారులు.. వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదే ఉందన్నారు. ఇకపై అందరూ శుభ్రత పాటించాలని సూచించారు.
Read Also: ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాలు బంద్, ఎందుకంటే?