Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్‌పీ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యచరణపై కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు చర్చిస్తున్నారు. కేస్ ను వాదించిన సీనియర్ న్యాయ వాదులు, న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాల తో నివేదిక ఇవ్వాలని అధికారులకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే.. తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వర్సిటీ కి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు చేసేందుకు మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతగా రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు కాసేపట్లో తెలియనుంది. మంత్రి వర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ మినహా అందరూ మంత్రులు, సీఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా ఉన్నారు.