Hair Donation Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లిన భక్తులు తప్పకుండా స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తారు. అయితే ఆ వడ్డీకాసుల వాడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు. అసలు ఇందులో ఉన్న భక్తి పూర్వకమైన మర్మం ఏంటి..? మహిళలు శ్రీవారికి తలనీలాలు సమర్పించవచ్చా..? ఆగమశాస్త్రం ఏం చెప్తుంది…? అసలు ఇందులోని నిజానిజాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్షదైవంగా.. ఆపద మొక్కుల వాడిగా.. ఏడు కొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకు వేల మంది భక్తులు వెళ్తుంటారు. అలా స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తుల్లో చాలా మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించి తర్వాత దర్శనం చేసుకుంటారు. అయితే స్వామి వారికి తలనీలాలు ఎందుకు ఇస్తారు అన్న విషయం బహుకొద్ది మందికే తెలిసి ఉంటుంది. అయితే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందులోంచి ఇక తేరుకోలేమని బాధలో కూరుకుపోయినప్పుడు చాలా మంది ఆ వడ్డీకాసుల వాడికి తలనీలాలు సమర్పిస్తామని ఆ కష్టంలోంచి తమను గట్టెక్కించమని కోరుకుంటారు. అలా తమ కష్టంలోంచి స్వామి వారు వారిని బయటపడేయగానే భక్తి పారవశ్యంతో ఏడుకొండల వాడి దర్శనానికి వచ్చి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. అయితే తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఇప్పటిది కాదని.. అనాది కాలంగా ఈ సంప్రదాయం కొనసాగుతుందని పండితులు చెప్తున్నారు. అయితే తలనీలాలు సమర్పించడానికి అనేక కారణాలు ఉన్నట్టు పురాణాల గాథ.
శ్రీనివాసుడికి వెంట్రుకలు ఇచ్చిన నీలాదేవి:
అప్పట్లో నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుందట. అప్పుడు స్వామి వారు నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి ఒక దగ్గర నిద్రపోతుంటాడట. అలా స్వామి నిద్రిస్తున్న సమయంలో ఆయన ముగ్దమనోహర రూపాన్నిచూస్తున్న నీలాదేవికి స్వామి వారి నుదుటిపై కొద్దపాటి వెంట్రుకలు లేకపోవడం గమనిస్తుందట. అంతటి అందమైన స్వామి వారికి వెంట్రుకలు లేకపోవడం ఏంటి అని నీలాదేవి బాధపడుతూ తన వెంట్రుకలు తీసి స్వామి వారి నుదుటన అతికిస్తుందట. వెంటనే మెల్కొన్న శ్రీవారు నీలాదేవి నొసటిపై కారుతున్న రక్తం చూసి జరిగిన విషయం అంతా గ్రహించి ఆమె భక్తికి మెచ్చి సంతోషంగా నీలాదేవికి వరం ఇస్తాడట. ఇకపై తిరుమల కొండకు వచ్చే భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తారని అలా సమర్పించిన తలనీలాలు మొత్తం నీలాదేవికే చెందుతాయని చెప్పడంతో నీలాదేవి సంతోషిస్తుందట.
బీబీ నాంచారమ్మకు ఇచ్చిన వరం:
వేంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నప్పు ఆమెకు ఒక వరం ఇచ్చాడట. తిరుమల కొండ మీదకు జుట్టుతో వచ్చే వాళ్లు నా భక్తులు అని.. వాళ్లు నా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఎవరైతే గుండుతో ముస్లీం లాగా వెళ్తారో వాళ్లు నీ వాళ్లని చెప్పారట. అదే అనావాయితీ భక్తులు నేటికీ కొనసాగిస్తున్నారు అనేది మరోక వాదన.
పాప ప్రక్షాళన కోసం:
శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే మనిషి తెలిసో తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయంట! అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్ర వచనం.
అహంకారం, గర్వాన్ని పోగొట్టే గుండు:
సాధారణంగా మహిళలు, పురుషుల అందంలో ప్రధాన పాత్ర శిరోజాలదే! అందమైన జుట్టు ఉందని గర్వంతో, అహంకారంతో ఉండేవారికి ఆపదల సమయంలో కనువిప్పు కలిగించడం కోసమే ఆపదలు తీరాక మొక్కుబడిగా తలనీలాలను స్వామికి ఇస్తారని మరో పురాణోక్తి.
మహిళలు తలనీలాలు ఇవ్వొచ్చు:
స్వామి వారికి మొదటిసారి తల నీలాలు ఇచ్చింది మహిళ అయిన నీలాదేవి. కాబట్టి మహిళలు కూడా స్వామి వారికి నిరభ్యంతరంగా తలనీలాలు సమర్పించవచ్చని ఆగమశాస్త్ర పండితులు చెప్తున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. కానీ బిగ్ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు