Kanuma Significance: తెలుగు ప్రజలు ప్రతి ఏటా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజులు సందడిగా జరుపుకునే పండగ ఇది. ఇందులో మొదటి రోజు భోగి. భోగ భాగ్యాలను ప్రసాదించేది భోగి అని చెబుతారు. రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు పితృదేవతలను పూజిస్తారు. మూడవ రోజైన కనుమను పాడి పశువుల పండగగా చెబుతారు. ఈ రోజును వ్యవసాయానికి సాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత చెప్పే రోజు.
రైతులు ఈ రోజు వారు పండించిన పంటను తామే కాకుండా పశు పక్ష్యాదులతో పంచుకోవాలని పక్షుల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అంతే కాకుండా కనుమ రోజు కాకులు కూడా కదలవు అనే సామెతను గుర్తు చేసుకుంటారు. అంతే కాకుండా కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. దీని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే.. పల్లెల్లో పంటలు పండించడంలో పశువులు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే రైతులు వాటిని కనుమ రోజు పూజించి ప్రేమగా చూసుకుంటారు. కనుమను ముఖ్యంగా పల్లెల్లో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.
పంటలు సాగు చేయడానికి మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతతో ఉంటారు. అంతే కాకుండా కనుమ రోజు వాటికి విశ్రాంతిని ఇచ్చి పూజిస్తారు. నదీ తీరాలతో పాటు, చెరువుల వద్దకు పశువులను తీసుకువెళ్లి స్నానం చేయించి పసుపు, కుంకుమలు దిద్దుతారు. కొంతమంది వాటికి మువ్వల పట్టీలతో అలంకరించి హారతులిస్తారు. ఏడాది మొత్తం రైతులతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజు ఎలాంటి పనులు చేయించకుండా విశ్రాంతి కల్పిస్తారు. సాయంత్రం పూట పండగ రోజు పొంగలి చేసి నైవేద్యం పెడుతూ వాటిపట్ల ప్రేమను చాటుకుంటారు. ఇలా చేయడం వల్ల వృద్ధి, ధనధాన్యాలు కలుగుతాయని నమ్ముతారు.
Also Read: 19 ఏళ్ల తర్వాత సంక్రాంతి రోజు అద్భుతం.. వీరి జీవితాలు మారిపోయే టైం స్టార్ట్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదంటూ పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనక గొప్ప ఆంతర్యం దాగి ఉంది. అప్పట్లో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను వాడేవారు. కనుమ రోజు ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే భావనతో బండ్లు కట్టకుండా ఉండేందుకు ప్రయాణమే చేయకుండా ఉండాలని చెప్పేవారు. వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు.