Makar Sankranti 2026: మకర సంక్రాంతి మనదేశంలో ఒక ప్రధాన పండగ. దీనిని ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని గుర్తుచేస్తూ జరుపుకునే ఈ రోజు శుభ ప్రయత్నాలకు నాంది పలుకుతుంది. దాతృత్వం, సేవ యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ రోజున ప్రత్యేకంగా చెబుతారు. మకర సంక్రాంతి నాడు.. ఇంట్లో, దేవాలయాలలో పూజలు చేస్తారు. అంతే కాకుండా ఈ సమయంలో నువ్వులు, బెల్లం తింటారు. అంతే కాకుండా చుట్టుపక్కల వారితో ఆనందాన్ని పంచుకుంటారు. గాలిపటాలు ఎగరవేయడం, సాంప్రదాయ వంటకాలు, రంగవల్లులు కూడా ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తాయి. కానీ మకర సంక్రాంతి పండగ మతపరమైన ఆచారాలకే పరిమితం కాదని మీకు తెలుసా ? దీనికి అపారమైన శాస్త్రీయ, సహజ ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుని గమనం – ఉత్తరాయణ పుణ్యకాలం:
శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే.. మకర సంక్రాంతి రోజున సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరం వైపుకు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. దీనినే ‘ఉత్తరాయణం’ అని పిలుస్తారు. దీని వల్ల ఉత్తరార్ధగోళంలో పగటి సమయం క్రమంగా పెరుగుతూ.. రాత్రి సమయం తగ్గుతుంది. పగలు ఎక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మి మనకు అధికంగా లభిస్తుంది. ఇది మన శరీరంలో ‘సిర్కాడియన్ రిథమ్‘ ను క్రమబద్ధీకరించి.. మనల్ని మరింత ఉత్సాహంగా, చురుగ్గా ఉంచుతుంది.
విటమిన్ డి, రోగనిరోధక శక్తి:
చలికాలంలో సూర్యకిరణాలు భూమిని వాలుగా తాకుతాయి. కానీ ఉత్తరాయణం మొదలైన తర్వాత సూర్యరశ్మి మరింత నేరుగా.. ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల సహజంగా ‘విటమిన్ డి’ లభిస్తుంది. ఇది ఎముకల బలానికి , రోగనిరోధక శక్తి పెరగడానికి ఎంతో కీలకం. సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేయడం వెనక ఉన్న అసలు రహస్యం ఇదే. గంటల కొద్దీ ఎండలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి కావాల్సిన ఎండ తగిలి, చర్మ వ్యాధులు నయమవుతాయి.
నువ్వులు, బెల్లం:
చలికాలంలో వాతావరణం పొడిగా.. చల్లగా ఉంటుంది. ఈ సమయంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం అవసరం.
నువ్వులు:
వీటిలో కాల్షియం, ఐరన్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయి.
Also Read: సంక్రాంతి పండగ ఎప్పుడు ? తేదీ, శుభ ముహూర్తం ఇదే !
బెల్లం:
దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఇది రక్తహీనతను తగ్గించి, తక్షణ శక్తిని ఇస్తుంది. ఈ రెండింటి కలయిక శరీర రోగ నిరోధక శక్తిని పెంచి, చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.
పంట కాలం, ఆర్థిక ప్రాముఖ్యత:
సంక్రాంతిని ‘రైతుల పండగ’ అని పిలుస్తారు. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే సమయం ఇది. శాస్త్రీయంగా చూస్తే.. ధాన్యం నిల్వ చేయడానికి, పాత పంటను కోయడానికి ఇది సరైన సమయం. రైతుల ఇళ్లు ధాన్యంతో నిండి ఉండటం వల్ల ఇది శ్రేయస్సుకు, ఆర్థిక భద్రతకు చిహ్నంగా మారుతుంది.