తులసి, శివుడు ఇద్దరూ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవతలు. వారిద్దరినీ ప్రతిరోజూ పూజించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ తులసి ఆకులను శివునికి సమర్పించకూడదు. తులసి ఆకులతో శివునికి పూజ చేయకూడదు. తులసి ఆకుల మాలను ఆ పరమేశ్వరుడికి వేయకూడదు.
దేవుళ్ళ ఆశీస్సులు పొందేందుకు భక్తులు నైవేద్యాలు, పువ్వులు, నాణేలు, దుస్తులు ఇలా ఎన్నో సమర్పిస్తూ ఉంటారు. దుర్గామాతకు మందార పువ్వులు, శివుడికి మారేడు పత్రి, శ్రీకృష్ణుడికి పటిక బెల్లం, గణేశుడికి మోదకాలు, హనుమంతుడికి బూందీ… ఇలా ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రకారమే నైవేద్యాలు సమర్పిస్తూ వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అయితే శివునికి తులసి ఆకులను మాత్రం సమర్పించకూడదు. ఈ విషయం చాలామందికి తెలియక శివునికి తులసితో పూజలు చేస్తూ ఉంటారు.
హిందూ మతంలో ప్రియమైన దేవుళ్లలో శివుడు ఒకరు. ఆయన కరుణామయుడు. న్యాయవంతుడు. ప్రపంచాన్ని మార్చే శక్తి కలవాడు. దుష్టశక్తులను తరిమే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన సృష్టి చేయగలడు. శివుని విగ్రహాలు, చిత్రాలు, శివలింగాలు ఎన్నో రూపాల్లో ఆయన్ని పూజిస్తూ ఉంటారు. పాలు, తేనే, నీరు, చెరకు రసం, మారేడు పత్రీలు సమర్పించి ఆయన ఆశీస్సులు కోరుతూ ఉంటారు. అయితే తులసి ఆకులు మాత్రం ఎప్పుడూ సమర్పించరు. మీరు ఏ శివుని ఆలయాలకెళ్ళినా అక్కడ తులసి ఆకులు కనిపించవు.
కేవలం శివునికే కాదు గణేశుడికి కూడా తులసి ఆకులతో పూజ చేయకూడదని అంటారు. గణేశుడు మోదకాలను ఇష్టపడతాడు. ఆయనకు మోదకాలను సమర్పించి నమస్కరిస్తే భక్తుల మార్గంలోని అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు. ఇతనికి కూడా తులసి ఆకులను సమర్పించకూడదని చెబుతారు.
పవిత్రమైన తులసిని హిందూమతంలో దేవతగా గౌరవిస్తారు. అందుకే ఈమెను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఆరోగ్యకరంగా తులసి మొక్క పెరిగే ఇంట్లో డబ్బు శాశ్వతంగా ఉంటుందని, ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని చెబుతారు. విష్ణువుకు తులసి ఆకులను సమర్పించి పూజ చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు కూడా ఎక్కువ. తులసి టీని తాగడం లేదా తులసి ఆకులను నమలడం ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు.
శివుడికి ఎందుకు సమర్పించకూడదు?
తులసిని శివుడికి ఎందుకు సమర్పించకూడదో తెలుసుకునేందుకు ముందు ఒక కథ చెప్పుకోవాలి. పూర్వం జలంధరుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతనికి బృందా అనే భార్య కూడా ఉంది. బృందా ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేది. ఆమె భక్తి కారణంగా జలంధరుడు అజేయుడుగా నిలిచాడు. దేవుళ్ళు కూడా ఆయనను ఓడించ లేకపోయారు. అయితే అతని నిరంకుశత్వం పెరిగిపోయింది. ప్రజలు ఎన్నో కష్టాలు పడడం మొదలైంది. దీంతో విష్ణువే నేరుగా రంగంలోకి రావాల్సి వచ్చింది. అతను జలంధరుడి అవతారం ధరించి బృంద దగ్గరికి వెళ్ళాడు. భర్త అనుకొని విష్ణువుతో ఆమె కలిసి గడిపింది. దీంతో ఆమె పతిభక్తి విచ్ఛిన్నమయ్యింది.
జలంధరుడు దైవిక రక్షణను కోల్పోయాడు. చివరికి శివుడు ఆయనను అంతమొందించాడు. ఈ మోసాన్ని గ్రహించిన బృందా విష్ణువు తన భార్య నుంచి విడిపోవాలని శపించింది. ఆ శాపం ఫలితంగానే రామాయణంలో రాముడిగా జన్మించిన విష్ణువు.. సీతకు దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పుకుంటారు. అంతేకాదు శివుడికి కూడా ఆమె శాపం ఇచ్చింది. లక్ష్మీదేవి ఎప్పటికీ శివుడిని పూజించకూడదని కూడా శాపం పెట్టింది. దాంతో లక్ష్మీదేవి రూపమైన తులసిని శివుడికి సమర్పించడం ఆపేశారు.
గణేశుడికి కూడా తులసి ఆకులను సమర్పించకూడదు. దీనికి కారణం ఆమె మొదటిసారి గణేశుని లోతైన ధ్యానంలో చూసింది. అప్పుడు అతడిని ఇష్టపడింది. మంత్రముగ్ధురాలై వివాహ ప్రతిపాదన కూడా చేసిందని చెప్పుకుంటారు. కానీ గణేశుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నందువల్ల ఆమెను నిరాకరించాడు. దీంతో తులసికి కోపం వచ్చింది. తులసి… గణేష్ కి ఒకరు కాదు, ఇద్దరు భార్యలు ఉంటారని శపించింది. దాంతో గణేశుడు తిరిగి తులసి ఒక రాక్షసుడిని వివాహం చేసుకోవాల్సి వస్తుందని శపించాడని చెప్పుకుంటారు. అప్పటినుండి తులసి ఆకులు శివుడికి లేదా గణేశుడికి సమర్పించడం మానేశారు.