వైసీపీ అధినేత జగన్.. మరి ఆయన తర్వాత ఎవరు..? పోనీ ఆయన రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పుడు లీడర్లు కానీ, కేడర్ కానీ ఎవరి మాట వినాలి..? దీనికి సరైన సమాధానం లేదు. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా అని ఎవరైనా అంటే.. పార్టీలో సగం మందికి ఆయనంటే పడట్లేదు. ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని, ఆయన్ను నమ్ముకునే పార్టీని జగన్ నిండా ముంచేశారనే ఆరోపణలున్నాయి. నిన్న మొన్నటి దాకా విజయసాయిరెడ్డి ఉండేవారు కానీ, ఆయన కూడా బయటకెళ్లిపోయారు. బయటకొచ్చాక, కోటరీ అంటూ పెద్ద పెద్ద నిందలే వేశారు. పోనీ సీనియర్ నేత, శాసన మండలిలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు అంత సీన్ ఉందా అంటే అదీ లేదు. ఆయన్ను కేవలం ఉత్తరాంధ్ర నాయకుడిలాగానే జగన్ ట్రీట్ చేస్తున్నారు. మండలిలో మాట్లాడేందుకే ఆయనకు అవకాశం ఇచ్చారు. పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడేందుకు ఆయనకు పెద్దగా ఛాన్స్ లేదనే చెప్పాలి. ఇకపోతే వైవీ సుబ్బారెడ్డి. ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని గతంలోనే తేలిపోయింది. ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ గా ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు సీనియర్లంతా తప్పుకునే సరికి తిరిగి ఆయన కీలకంగా మారే అవకాశాలున్నాయి. కానీ వాక్చాతుర్యం, మీడియాని ఎదుర్కొని మాట్లాడే విషయ సామర్థ్యం ఆయనకు లేవనే చెప్పాలి.
ఎవరు..? ఎవరు..?
జగన్ తర్వాత వైసీపీలో కీలకం ఎవరు అంటే ఆ పార్టీ నేతలే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. వైసీపీలో కేవలం పోట్లాడేవారే కానీ, మాట్లాడేవారు ఎక్కడున్నారనేది కామన్ మ్యాన్ ప్రశ్న. మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి నేతలు అధికారంలో ఉన్నప్పుడు బాగానే నోరు చేసుకున్నారు. పార్టీ ఓడిపోయాక జోగి రమేష్ వంటి నేతలు కేసులకు భయపడి పూర్తిగా సైలెంట్ అయ్యారు. పేర్ని నాని అప్పుడప్పుడు తెరపైకి వచ్చి వెళ్తున్నారు. కొడాలి నాని ఎప్పుడో ఒకసారి కానీ కనపడరు. రోజా ఉన్నా కూడా ఆమె సెటైర్లు ఇప్పుడు పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాయి. మరి వైసీపీ వాయిస్ ని జనాల్లోకి తీసుకెళ్లాల్సింది ఎవరు..?
పోసాని లాంటి వాళ్లు కేసులతో ఇబ్బంది పడుతూ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. నిన్న మొన్నటి వరకూ కాస్త హడావిడి చేసిన యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెరమరుగయ్యారు. ఇలా ఒక్కొక్కరే సైడైపోతుంటే జగన్ మాత్రం నింపాదిగా, గంభీరంగా కనపడటం ఇక్కడ విశేషం.
ఇంతకీ జగన్ కి కావాల్సిందేంటి..? సీనియర్లంతా బయటకు వెళ్తే జగన్ ఎవరితో రాజకీయం చేస్తారు. పోనీ మా పార్టీయే కొత్తది, మాదంతా యువరక్తం అని చెప్పుకోడానికి కూడా జగన్ కి అవకాశం లేదు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలతోనే వైఎస్సార్ కాంగ్రెస్ మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు వారిలో చాలామంది పక్కకు తప్పుకుంటున్నారు. అడుగు బొడుగు ఎవరైనా ఉంటే సాకే శైలజానాథ్ లాంటి వారు ఇటీవల కాలంలో జగన్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు.
నాలుగేళ్లు ఎలా..?
కూటమికి ఇంకా నాలుగేళ్లు అధికారం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై పెద్దగా చెప్పుకోడానికి కంప్లయింట్ లేవీ లేవు. రెడ్ బుక్ అంటూ వైసీపీ రచ్చ చేస్తున్నా.. అది కేవలం ఆ పార్టీ వ్యక్తిగత అంశంగా మారింది. దానివల్ల జనాలకు ఎంటర్టైన్ మెంటే కానీ, నేరుగా వచ్చిన నష్టమేమీ లేదు. ఈ దశలో జగన్ మరో టీమ్ ని బిల్డబ్ చేసుకోవాలి. వారి ద్వారా జనంలోకి వెళ్లాలి. కానీ అలాంటి వారు దొరకడం లేదు, జగన్ లేకుండా వ్యవహారం చక్కబెట్టగల సమర్థుడు, నేర్పరి ఎవరూ వైసీపీలో లేరు. ఒకరకంగా చెప్పాలంటే అలాంటి అవకాశం జగన్ ఎవరికీ ఇవ్వలేదనే చెప్పాలి.
జగన్ ధైర్యం వారిపైనే..
2019 ఎన్నికల్లో జగన్ గెలుపుకి కారణం మీడియా, సోషల్ మీడియా కూడా. ఎన్నికల ముందే జగన్ వచ్చేస్తున్నారంటూ మీడియా జనంలోకి ఓ వేవ్ ని తీసుకెళ్లింది. ఇక సోషల్ మీడియా.. రావాలి జగన్-కావాలి జగన్ అంటూ ఓ రేంజ్ లో ఆయన్ను పైకెత్తింది. దీనికితోడు పాదయాత్ర జగన్ ని జనానికి దగ్గర చేసింది. కానీ ఆ తర్వాత జగన్ కూడా మీడియాని, సోషల్ మీడియాని పట్టించుకోవడం మానేశారు. తీరా ఎన్నికల సమయంలో సోషల్ మీడియాని తిరిగి బలోపేతం చేయాలనుకున్నారు. కానీ అప్పటికే చేతులు కాలాయి. ప్రశాంత్ కిషోర్ హ్యాండివ్వడంతో.. సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్ తో పనికానిచ్చేయొచ్చు అనుకున్నారు. పథకాలే తనకు ఓట్లు వేస్తాయని, జస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే చాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియా అతి జగన్ కి పూర్తిగా మైనస్ అయింది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ని ఫాలో కావాలనుకున్నా.. సజ్జల భార్గవ్ అనుభవ రాహిత్యం వైసీపీకి నష్టం చేకూర్చింది. ఆహా ఓహో అంటూ వేసే భజన వార్తలనే జనం నమ్మారు, జనం కూడా వాటినే నమ్ముతున్నారనే భ్రమల్లో ఉన్నారు. తీరా ఎన్నికల ఫలితాలు జగన్ భ్రమలు తొలగించేశాయి. ఇక్కడ కూడా జగన్ రిజల్ట్ ని పూర్తిగా నమ్మకపోవడం విశేషం. ఈవీఎంల వల్లే ఫలితాలు తారుమారయ్యాయనే మరో వాదన జగన్ ఆలోచనా పరిపక్వతని మరోసారి బయటపెట్టింది.
ఇదంతా జరిగి ఏడాది అవుతోంది. కానీ ఇప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. పోయేవారే కానీ, వైసీపీలోకి వచ్చేవారు లేరు. పోనీ ఉన్నవారయినా కుదురుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అంటే అదీ లేదు. మరో రెండేళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పోనీ పోరాటాలు చేయకపోయినా.. కనీసం వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించడానికి ఎవరైనా ఉన్నారా అంటే చెప్పడం కష్టం. వైసీపీ గాడిలో పడాలంటే ఇప్పుడు జగన్ కి ఓ బలమైన నాయకుడు తోడు కావాలి. వాస్తవాలు ఆయనకు చెప్పగలగాలి, ఆ వాస్తవాలను జగన్ నమ్మేలా చేయాలి. తిరిగి గ్రౌండ్ రియాల్టీకి ఆయన్ను తీసుకు రావాలి. తిరిగి జనాలకు దగ్గర చేయాలి. అంత సాహసం ఎవరు చేయగలరు..? చేసినా జగన్ వారి మాట నమ్ముతారా..?