Ganesh Chaturthi 2025: వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు… ఈ పేర్లన్నీ సకల శుభాలకు, విజయాలకు అధిపతి అయిన స్వామివే. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన ఆచారం. వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, ఆటంకాలు తొలగిపోయి, సంపద, శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే.. కేవలం పూజ చేయడమే కాకుండా, కొన్ని నియమాలు, పద్ధతులను పాటిస్తే ఆ గణపతి అనుగ్రహం మరింత లభిస్తుంది.
1. పచ్చని గడ్డి (గరిక) తో పూజ:
వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరిక. గరికతో పూజించడం వల్ల ఆయన్ను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి.. గణపతి విగ్రహం ముందు గరిక సమర్పిస్తే, ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ధనలాభం కలుగుతుంది. “ఓం గణేశాయ నమః” అని 108 సార్లు జపించడం కూడా మంచిది.
2. ఎర్రటి పువ్వులు, ఎర్రటి చందనం:
వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా మందారం పువ్వులు, ఎర్రటి చందనంతో పూజ చేస్తే విఘ్నేశ్వరుడు సంతోషిస్తాడు. పూజలో ఎర్రటి దుస్తులు ధరించడం కూడా శుభకరం.
3. ఉండ్రాళ్లు, బెల్లం నైవేద్యం:
గణపతికి నైవేద్యంలో ఉండ్రాళ్లు.. బెల్లంతో చేసిన వంటకాలు పెట్టడం చాలా ముఖ్యం. బెల్లం ఉండలు, నువ్వులు, నెయ్యి కలిపి చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తే.. ఆయన ప్రసన్నమై కోరిన కోర్కెలు తీరుస్తాడు.
4. బుధవారం పూజ:
వినాయకుడికి బుధవారం చాలా పవిత్రమైన రోజు. బుధవారం రోజున వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తే.. ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి, పూజ చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి, జీవితంలో ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.
5. సంకష్టహర చతుర్థి వ్రతం:
సంకష్టహర చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాత పూజ చేసి భోజనం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించిన వారికి సంపద, అదృష్టం, శ్రేయస్సు చేకూరుతాయని నమ్మకం.
6. గణేశ మంత్రాన్ని జపించడం:
ప్రతిరోజు గణపతి మంత్రాలను జపించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. “ఓం శ్రీ గణేశాయ నమః” లేదా “వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా” వంటి మంత్రాలను పఠించడం వల్ల జీవితంలో ఆటంకాలు తొలగి, విజయం లభిస్తుంది.
ఈ నియమాలు పాటిస్తూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది.