Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు లేదా డార్క్ సర్కిల్స్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య. సరిగ్గా నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి, వయసు పెరగడం, లేదా జన్యుపరమైన కారణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఈ డార్క్ సర్కిల్స్ మన ముఖం నిస్తేజంగా.. అలసిపోయినట్లు కనిపించేలా చేస్తాయి. అయితే.. కొన్ని హోం రెమెడీస్‌తో ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
1. బంగాళదుంప ముక్కలు:
బంగాళదుంపలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం రంగును మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఒక బంగాళదుంపను సన్నని ముక్కలుగా కోసి.. వాటిని ఫ్రిజ్‌లో కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత.. చల్లని బంగాళదుంప ముక్కలను కళ్లపై 15-20 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి.
2. దోసకాయ ముక్కలు:
దోసకాయలో చర్మాన్ని చల్లబరిచే గుణాలు అధికంగా ఉంటాయి. కంటిపై దోసకాయ ముక్కలు పెట్టుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం తేలికపడి, నల్లటి వలయాలు తగ్గుతాయి. సన్నని దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి.. వాటిని కళ్లపై 10-15 నిమిషాలు ఉంచాలి. ఇది కళ్లకు విశ్రాంతిని కూడా ఇస్తుంది.
3. రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ కళ్ల కింద ఉన్న సున్నితమైన చర్మానికి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా.. తేలికగా ఉంచుతుంది. ఒక దూదిని రోజ్ వాటర్‌లో ముంచి, దాన్ని కళ్లపై 15 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గించి, కళ్లకు ప్రశాంతతను ఇస్తుంది.
4. టీ బ్యాగ్స్ :
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్‌లు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయి. వాడిన టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో ఉంచి.. ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లటి టీ బ్యాగ్‌లను కళ్లపై 10-15 నిమిషాలు ఉంచుకోవడం వల్ల కళ్ల చుట్టూ రక్త ప్రసరణ మెరుగుపడి, నల్లటి వలయాలు తగ్గుతాయి. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి.
5. బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా బాదం నూనెను తీసుకొని సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రాత్రంతా ఉంచి.. ఉదయం కడిగేయాలి. ఇది నల్లటి వలయాలను క్రమంగా తగ్గిస్తుంది.
ఈ చిట్కాలను పాటించడంతో పాటు.. తగినంత నిద్ర పోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. వీటన్నింటినీ క్రమం తప్పకుండా పాటిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. సమస్య చాలా తీవ్రంగా ఉంటే.. డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.