PM Modi First Signed on PM Kisan File: ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. సోమవారం పార్లమెంట్ సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీయే సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మోదీ పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్ పై తొలి సంతకం చేశారు.
మోదీ సంతకంతో.. దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.20 వేల కోట్ల నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. రైతులు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో దీనికోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతు సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తామన్న ప్రధాని.. అందులో భాగంగానే తొలిసంతకం రైతు సంక్షేమ ఫైల్ పై చేసినట్లు పేర్కొన్నారు.
ఆదివారం మోదీ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు ఏపీ, ఇద్దరు తెలంగాణ ఎంపీలు. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ.. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. వీరికి అధిష్టానం ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది. అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. ముగ్గురు మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: NEET-UG 2024 Row: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం.. ఎన్టీయేకు సుప్రీం నోటీసులు..